CM Jagan Mohan Reddy : విదేశీ విద్య నిధుల విడుదల చేసిన సిఎం జగన్….-ap cm released gopvernment financial assistance to 213 students for foreign education ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Mohan Reddy : విదేశీ విద్య నిధుల విడుదల చేసిన సిఎం జగన్….

CM Jagan Mohan Reddy : విదేశీ విద్య నిధుల విడుదల చేసిన సిఎం జగన్….

HT Telugu Desk HT Telugu
Feb 03, 2023 12:58 PM IST

CM Jagan Mohan Reddy విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. జగనన్న విదేశీ విద్యా కానుక నిధులను సిఎం క్యాంపు కార్యాలయం నుంచి లబ్దిదారుల ఖాతాలకు జమ చేశారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని, వారికి మద్దతుగా నిలుస్తోందని చెప్పారు. విద్యార్ధులు పైకి ఎదిగాక రాష్ట్ర ప్రతిష్టలను నిలబెట్టాలని సూచించారు. రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద పెట్టుబడి విద్యమీద పెడుతున్నామని చెప్పిన సిఎం, విద్యమీద పెట్టే ప్రతి పెట్టుబడి కూడా మానవనరులమీద పెట్టినట్టేనన్నారు.

సీఎం జగన్
సీఎం జగన్

ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని, ఉన్నత విద్యాభ్యాసానికి మద్దతుగా నిలుస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. విద్యార్ధులు పైకి ఎదిగాక రాష్ట్ర ప్రతిష్టలను నిలబెట్టాలని సూచించారు. రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద పెట్టుబడి విద్యమీద పెడుతున్నామని చెప్పిన సిఎం, విద్యమీద పెట్టే ప్రతి పెట్టుబడి కూడా మానవనరులమీద పెట్టినట్టేనన్నారు. తొలివిడత నగదును ముఖ్యమంత్రి లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేశారు.

అంతర్జాతీయ యూనివర్శిటీలకు ఫీజుల చెల్లింపు….

రాష్ట్రంలో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, విదేశీ విద్యాదీవెన కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యయంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. విద్యార్ధులకు మద్దతుగా పూర్తిగా సహాయ, సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. కార్నిగీ మిలన్‌ యూనివర్శిటీలో ఫీజు రూ. కోటి 16 లక్షల ఫీజు ఉందని, సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్శిటీలో కోటి రూపాయల ఫీజు ఉందని, బోస్టన్‌ యూనివర్శిటీలో రూ. 97 లక్షల ఫీజు ఉందని, హార్వర్డ్‌ యూనివర్శిటీలో రూ. 88 లక్షల ఫీజు ఉందని… సామాన్యులు ఎవ్వరూ కూడా భరించే ఫీజులు వాటిలో లేవని, అలాంటి చోట సీట్లు వచ్చినా డబ్బులు కట్టే పరిస్థితి లేదని, తల్లి దండ్రుల మీద భారం పెట్టడం ఇష్టంలేక … వెనకడుగు వేసే పరిస్థితులు ఉండేవని చెప్పారు.

మంచి విద్యతో కుటుంబాల తలరాతలే కాదు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలరాతలు కూడా మారుతాయన్నారు. మహాత్మగాంధీ, నెహ్రూ, అంబేద్కర్‌ లాంటి వాళ్లు పెద్ద పెద్ద యూనివర్శిటీలనుంచి వచ్చినవారనని చెప్పారు.

పెద్ద పెద్ద కంపెనీల్లోని సీఈఓలు నుంచి మొదలుపెడితే, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌వరకూ కూడా పెద్ద పెద్ద యూనివర్శిటీలనుంచి వచ్చినవారేనని చెప్పారు.ఆ స్థాయిలో కలలను మీరు నిజంచేయాలని సూచించారు. దేశ ప్రతిష్టనే కాదు, రాష్ట్ర ప్రతిష్టనుకూడా పెంచాలని అకాంక్ష వ్యక్తం చేశారు.

డబ్బు లేక చదువు ఆగకూడదు….

మంచి యూనివర్శిటీలో సీటు వస్తే.. డబ్బులు కట్టలేక వెనకడుగు వేసే పరిస్థితి రాకూడదనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు చెప్పారు. బెస్ట్‌ యూనివర్శిటీలు, బెస్ట్‌ కాలేజీల్లో సీట్లు వచ్చినవారికి ప్రభుత్వం అండగా నిలిచిందని, పారదర్శకంగా ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. టాప్‌ 200 యూనివర్శిటీల్లో సీట్లు వస్తే.. పారదర్శకంగా ప్రభుత్వం వారికి మద్దతుగా నిలుస్తుందన్నారు. గతంలో ఉన్న స్కీం ఎలా అమలు జరిగేదో చూశామని, అదొక వైట్‌ వాష్‌ కార్యక్రమమని సిఎం ఎద్దేవా చేశారు.

టీడీపీ హయంలో రూ.10-15 లక్షలకు పరిమితైన కార్యక్రమంతో, ప్రయోజనం అరకొరగానే ఉండేదన్నారు. గతంలో బకాయిలు కూడా చెల్లించకపోవడంతో పథకాన్ని మూసివేసే పరిస్థితులు వచ్చాయన్నారు. పథకాన్ని అమలు చేయడంలో గతంలో చిత్తశుద్ధిలేదని, ఆ పరిస్థితులు మార్చాలనే ఉద్దేశంతో కొత్త ఆలోచనతో దీన్ని ప్రారంభిస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు.. ఇలా వాటి రూపురేఖలను మారుస్తున్నామని చెప్పారు. పిల్లలు మంచి కాలేజీల్లో చదువుకునేలా అడుగులు వేయిస్తున్నామన్నారు.

ప్రపంచంలోని పెద్ద యూనివర్శిటీల్లో సీట్లు వస్తే.. వారికి తోడుగా నిలవాలన్న ఆలోచనలో నుంచి ఇది వచ్చిందని చెప్పారు. ఈ ఏడాది 213 మంది పిల్లలు దరఖాస్తు చేసుకుని పారదర్శకంగా ఎంపికయ్యారని, ఎలాంటి సమస్య ఉన్నా.. వెంటనే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. విదేశాలకు వెళ్లే విద్యార్దులకు సీఎంఓలో ఒక అధికారి నంబర్‌ను ఇస్తామని, ఏదైనా సమస్య తలెత్తినప్పుడు నేరుగా కాల్‌చేసి.. వెంటనే సహాయం తీసుకోవచ్చన్నారు. ప్రతి విషయంలో వారికి తోడుగా ఉంటామని చెప్పారు.

వరల్డ్‌ యూనివర్శిటీ క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం టాప్‌ 200 యూనివర్శిటీలకు ఎంపికైన విద్యార్ధులకు పూర్తి ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతిభకు పెద్దపీట వేస్తూ టాప్‌ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్టంగా రూ. 1.25 కోట్ల వరకు, మిగిలిన వారికి గరిష్టంగా రూ. 1 కోటి వరకు 100 శాతం ట్యూషన్‌ ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ చేస్తున్నామన్నారు.

100 నుండి 200 క్యూఎస్‌ ర్యాంకులు పొందిన యూనివర్శిటీలలో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు 100 శాతం ట్యూషన్‌ ఫీజు గరిష్టంగా రూ. 75 లక్షల వరకు రీఇంబర్స్‌మెంట్, ఇక మిగిలిన విద్యార్ధులకు గరిష్టంగా రూ. 50 లక్షలు లేదా ట్యూషన్‌ ఫీజులో 50 శాతం ఏది తక్కువైతే అది చెల్లిస్తామన్నారు. విదేశీ విశ్వవిద్యాలయానికి వెళ్ళే విద్యార్ధులకు విమాన, వీసా ఛార్జీలు సైతం రీఇంబర్స్‌మెంట్‌ చేస్తున్నారు.

విద్యార్దుల ఖాతాల్లోకి నగదును ముఖ్యమంత్రి బదిలీ చేశారు. ఈ ఏడాది టాప్‌ 200 విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్ధులకు మొదటి విడత సాయంగా రూ. 19.95 కోట్లను అందించారు.

Whats_app_banner