AP CID : ఇసుక అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణ.. A2గా చంద్రబాబు పేరు-ap cid investigation on sand irregularities during chandrababu regime ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cid : ఇసుక అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణ.. A2గా చంద్రబాబు పేరు

AP CID : ఇసుక అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణ.. A2గా చంద్రబాబు పేరు

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 02, 2023 05:04 PM IST

AP CID On Sand Irregularities : చంద్రబాబు హయాంలో జరిగిన ఇసుక తవ్వకాలపై విచారణ చేపట్టింది ఏపీ సీఐడీ. APMDC ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబు పేరును A2గా పేర్కొంది.

ఇసుక అక్రమాలపై సీఐడీ విచారణ
ఇసుక అక్రమాలపై సీఐడీ విచారణ

AP CID On Sand Irregularities : చంద్రబాబు హయాంలో ఇసుక అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణకు సిద్ధమైంది. ఇసుక అక్రమాలపై కేసు నమోదు చేసింది. APMDC ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా… ఇందులో A1గా పీతల సుజాత, A2గా చంద్రబాబు, A3గా చింతమనేని, A4గా దేవినేని ఉమాతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసింది. మైనింగ్ శాఖ అధికారుల ఫిర్యాదుపై FIR నమోదు చేసింది సీఐడీ. ఉచిత ఇసుక ముసుగులో వేల కోట్ల దోపిడీ జరిగినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.

గత నెల 3వ తేదీన ఈ అంశంపై మైనింగ్ విభాగం నుంచి ఫిర్యాదు అందినట్లు ఎఫ్ఐఆర్ లో తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని ఫిర్యాదులో ప్రస్తావించారు. మైనింగ్ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫ్రీ శాండ్ పాలసీ విధానం, అమలులో అవకతవకల పై సీఐడీ విచారణ చేపట్టగా… ఉచిత ఇసుక పేరుతో సహజ వనరుల హద్దు లేకుండా అక్రమ తవ్వకాలకు ఆస్కారం ఇచ్చారని ‌సీఐడీ గుర్తించింది. ఈ మేరకు పలువురి పేర్లను ప్రస్తావిస్తూ అభియోగాలను మోపింది. నలుగురి పేర్లను నిందితులుగా పేర్కొనగా… మిగతా వారి పేర్లు తెలియాల్సి ఉందని తెలిపింది.

ఫిర్యాదులో ఏముందంటే…

“గనులు ఖనిజాలకు సంబంధించి 1957లోనే కేంద్ర ప్రభుత్వం ఒకచట్టం చేసింది. గనులు, ఖనిజాలకు సంబంధించి రెగ్యులేటింగ్ అథారిటీ కేంద్ర ప్రభుత్వమే. 1957 చట్టం నాటి నియమ నిబంధనలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్‌ లీజులను మంజూరు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలాంటి గనులను, ఖనిజాలను నోటిఫై చేయకపోతే వాటిమీద పూర్తి నియంత్రణ అధికారం కేంద్ర ప్రభుత్వానిదే. అయితే 2014 నుంచి ఇసుక లీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టంలోని నియమాలను, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించింది. ఆగస్టు 28, 2014న ఇసుక రీచ్‌లన్నింటినీ APMDCకి అప్పగిస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. తర్వాత ఈ రీచ్‌లను జిల్లా, మండల మహిళా సమాఖ్యలకు అప్పగించారు. తర్వాత 2016లో ఈ విధానాన్ని సమీక్ష చేస్తూ కేబినెట్‌ సబ్‌ కమిటీకి అప్పగించారు. కేబినెట్‌ సబ్‌కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని జనవరి 15, 2016లో మరొక జీవో జారీచేశారు. టెండర్‌ కం ఇ-ఆక్షన్‌ నిర్వహించాలని జీవోలో పేర్కొన్నారు. అనూహ్యంగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే దీన్నికూడా పక్కపెట్టారు. ఉచితంగా ఇసుక అంటూ మార్చి 4, 2016ఒక మెమో జారీచేశారు. దీనికి అనుగుణంగా ఏప్రిల్‌ 6, 2016న జీవో 43 జారీచేశారు. ఉచిత ఇసుక విధానానికి సంబంధించి న్యాయసమ్మతం లేకుండా, కసరత్తు లేకుండా ఈ ఉత్తర్వులు జారీచేశారు. ఇసుక పాలసీ విషయంలో కేబినెట్‌ ఒక నిర్ణయం తీసుకున్న రెండునెలల వ్యవధిలోనే మళ్లీ ఈనిర్ణయం తీసుకున్నారు” అని డీఎంజీ వెంకటరెడ్డి… సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

"ఒక పద్ధతి లేకుండా, ఒక విధానం పాటించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. టెండర్‌ మరియు ఇ-ఆక్షన్‌ ద్వారా ఇవ్వాలన్న కేబినెట్‌ నిర్ణయాన్ని పూర్తిగా పక్కనపెట్టారు. ఉచిత ఇసుక విధానానికి తగిన కారణాలనుకూడా తెలియజేయలేదు. ఎంత తవ్వుతారు? ఎంత ఇస్తున్నారు? ఇందులో ఎలాంటి పద్ధతి అనుసరిస్తున్నారు? అన్నదానిపై ఎలాంటి నిర్ణయాలూ లేవు. ఉచిత ఇసుక నిర్ణయానికి కేబినెట్‌ నోట్‌ కాని, మెమోరాండం కాని లేవు. బిజినెస్‌ రూల్స్‌ను పాటించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేర ఆర్థిక నష్టం కలుగుతుందన్నదానిపై ప్రభుత్వం ఎలాంటి చర్చా జరగలేదు. ఒక తప్పుడు ఉద్దేశంతో ఏప్రిల్‌ 6, 2016న జీవో - 43 జారీచేశారు. ఇతరులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈనిర్ణయం తీసుకున్నారు. ఉచిత ఇసుక పేరిట రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని హైకోర్టు పలుసందర్భాల్లో చెప్పింది. ఉచిత ఇసుక పేరిట సహజవనరును పూర్తిగా దోచుకున్నారు. ప్రయివేటు వ్యక్తులు ఉచిత ఇసుక విధానం మాటను దోపిడీకి పాల్పడ్డారని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ పేర్కొంది. పేదలకు ఉపయోగపడాల్సిందిపోయి కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూర్చడానికి ఉచిత ఇసుక విధానాన్ని రూపొందించినట్టుగా పేర్కొంది. 2016-2019 మధ్య దాదాపు వేయికిపైగా అక్రమ ఇసుక కేసులు నమోదయ్యాయి. కాని కొండంత అక్రమాల్లో ఇది గోరంత మాత్రమే. ప్రజాబాహుల్యంలో ఉచిత ఇసుక అని చెప్పారు. కాని రీచ్‌లన్నీ ఎమ్మెల్యేలు, అప్పటి అధికార పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు చేతుల్లో నడిచాయి భారీ యంత్రాలను పెట్టి ఇసుకను నిలువునా దోచుకున్నారు. ఉచిత ఇసుక విధానం నీడన ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేకూర్చారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలి" అని పేర్కొన్నారు.

ఇటీవలనే చంద్రబాబుపై మరో కేసు కూడా నమోదు చేసింది ఏపీ సీఐడీ. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో పీటీ వారెంట్ ను దాఖలు చేసింది. చంద్రబాబును ఏ3గా చేర్చగా… సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ ను ఏసీబీ కోర్టు అనుమతించింది. అవినీతి నిరోధక చట్టం కింద ( ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) చంద్రబాబుపై ఈ కేసు నమోదైంది.ఈ కేసుకు 18/2023 FIR నంబర్ ను కేటాయించారు.

ఈ కేసులో ఏ1గా నరేశ్ పేరు ఉండగా, ఏ2గా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరును ప్రస్తావించారు. ఏ3గా చంద్రబాబు పేరును నమోదు చేశారు. ఏపీ బెవరేజస్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో తెలిపారు.

టీ20 వరల్డ్ కప్ 2024