Balakrishna Vs Ambati Rambabu : మీసం మెలితిప్పి బాలయ్య సవాల్, సినిమాల్లో తిప్పుకోండని అంబటి కౌంటర్
Balakrishna Vs Ambati Rambabu : ఏపీ అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ సవాళ్లు విసురుకున్నారు. మీసాలు తిప్పుతూ, తొడలు కొడుతూ వార్నింగ్ లు ఇచ్చుకున్నారు.
Balakrishna Vs Ambati Rambabu : ఏపీ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. వర్షాకాల సమావేశాల తొలిరోజే టీడీపీ, వైసీపీ సభ్యులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. సభలో మీసాలు మెలేస్తూ, తొడలు కొట్టుకుని వార్నింగ్ లు ఇచ్చుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన అన్నారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరికొకరు అసెంబ్లీ వేదికగా సవాళ్లు విసురుకున్నారు. అసెంబ్లీలో బాలయ్య మీసం మెలితిప్పి సవాల్ చేయగా, మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చారు.
మంత్రి అంబటి రెచ్చగొట్టారు
మంత్రి అంబటి రాంబాబు తనను చూసి తొడకొట్టారని, అందుకే తాను మీసం మెలేశానని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. చూసుకుందాం రా అన్నారని, నేను కూడా చూసుకుందాం రా అని సవాల్ చేశానన్నారు. సినీ పరిశ్రమలో అందరు తన లాగా ధైర్యవంతులు ఉండరని, ఎవరి అభిప్రాయాలు వారివన్నారు.
అసెంబ్లీలో జరిగిన ఘటనలు తలుచుకుంటే బాధేస్తోందని బాలకృష్ణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో శాసనసభను నడిపిస్తోందని ఆరోపించారు. చంద్రబాబును ఆధారాలు లేని కేసులో జైలుకు పంపారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభలో తెలుగు సినిమా కళాకారులను అత్యంత ఘోరంగా అవమానించారని చెప్పారు. సినీ రంగం నుంచి వచ్చిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యి... ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని బాలకృష్ణ గుర్తుచేశారు. ఇవాళ సభలో తనకు మాత్రమే అవమానం జరగలేదని, మొత్తం తెలుగు సినీ పరిశ్రమను కించపరిచారన్నారు. అసెంబ్లీలో ముందుగా మీసం మెలేసి, తొడకొట్టి సవాల్ చేసింది వైసీపీ ఎమ్మెల్యేలే అని బాలకృష్ణ అన్నారు. తాను చేయని పనిని చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అధికారగర్వం, మందబలంతో విర్రవీగుతున్నారని విమర్శించారు. అతిత్వరలో ప్రజలే వారికి బుద్ధి చెప్తారన్నారు. తన వృత్తిని అవమానించిన మంత్రి అంబటి రాంబాబుకి కౌంటర్ గా తొడకొట్టి, మీసం మెలితిప్పినట్లు బాలకృష్ణ తెలిపారు.
బాలయ్యకు అంబటి కౌంటర్
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం మెలితిప్పి, తొడకొట్టి సవాల్ చేయడంపై మంత్రి అంబటి సభలో మండిపడ్డారు. టీడీపీ సభ్యులు కావాలనే వైసీపీ ఎమ్మెల్యేలను రెచ్చగొడుతున్నారన్నారు. సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలను జరిగినా తమకు సంబంధంలేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌పై దౌర్జన్యానికి దిగడం సరికాదన్నారన్నారు. అసెంబ్లీలో మీసాలు తిప్పితే చూస్తే ఊరుకోమని, ఇలాంటివన్నీ సినిమాల్లో చేసుకోవాలని బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు. అనంతరం ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి సభలో జరిగిన ఘటనలపై స్పందించారు. 'నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని మీసం తిప్పితే ఊరుకోడానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ! నాది తెలుగు గడ్డ !' అని అంబటి ట్వీట్ చేశారు.