Gudivada casino| సీన్‌లోకి ఎంటరైన భాజపా.. సోము వీర్రాజు సహా పలువురు నేతల అరెస్ట్
మంగళవారం ఛలో గుడివాడకు పిలుపునిచ్చిన రాష్ట్ర భాజపా నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ నుంచి గుడివాడ వెళ్తున్న రాష్ట్ర భాజపా అధ్యక్షులు సోమువీర్రాజతో పాటు పలువురు నాయకులను అడ్డుకుని అరెస్టు చేశారు.
గుడివాడ క్యాసినో వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ అంశంపై విమర్శలు గుప్పిస్తున్న వేళ.. తాజాగా భాజపా కూడా సీన్‌లోకి ఎంటరైంది. తెదేపా నేత బుద్ధా వెంకన్నను నాటకీయ రీతిలో అరెస్టు చేసిన పోలీసులు .. భాజపా నేతలను కూడా ఇదే విధంగా ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఛలో గుడివాడకు పిలుపునిచ్చిన రాష్ట్ర భాజపా నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ నుంచి గుడివాడ వెళ్తున్న రాష్ట్ర భాజపా అధ్యక్షులు సోమువీర్రాజతో పాటు పలువురు నాయకులను అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో పోలీసులకు, భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
నిరంకుశ పాలన: భాజపా
దీంతో ప్రభుత్వం, పోలీసులు తీరు పట్ల సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరంకుశం పాలన నడుస్తోందని విమర్శించారు. క్యాసినో గురించి ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ పోలీసులను నిలదీశారు. సంక్రాంతి సంబరాల్లో క్యాసినోలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు. వివాదాలు సృష్టించడం తమకిష్టం లేదని, కేవలం సంప్రదాయాలను రక్షించడమే తమ లక్ష్యమని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
ప్రజలే బుద్ధి చెప్తారు: సోము వీర్రాజు
సోము వీర్రాజుతో పాటు సీఎం రమేశ్, విష్ణువర్ధన్ రెడ్డి, రమేశ్ నాయుడు, షేక్ బాజీ తదితర భాజపా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. తాము సంక్రాంతి వేడుకలకే వెళ్తున్నామని, నిరసనలకు వెళ్లడం లేదని ముందుకు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఉంగుటూరు పోలిస్ స్టేషన్‌కు తరలించారు. సంక్రాంతి వేడుకలకు వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమని అన్నారు. తమ వేడుకలకు అనుమతి లేదంటే, మరి పేకాట, క్యాసినోలకు ఎలా అనుమతిలిచ్చారని ప్రశ్నించారు. నిరంకుశంగా వ్యవహరిస్తోన్న ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.
సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు గుడివాడలోని మంత్రి కోడాలి నాని కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో నిర్వహించారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష తెదేపా, భాజపాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
సంబంధిత కథనం