Minister Roja On Balakrishna: ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహంలాంటి జగన్ ముందు కాదు-బాలయ్యకు మంత్రి రోజా కౌంటర్
Minister Roja On Balakrishna: ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహంలాంటి సీఎం జగన్ ముందు కాదని మంత్రి రోజా... ఎమ్మెల్యే బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. మీసాలు మెలేస్తే ఇక్కడ భయపడేవాళ్లు ఎవరు లేరన్నారు.
Minister Roja On Balakrishna: ఏపీ అసెంబ్లీలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్ట్ పై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు, ముగ్గురిని సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు స్పీకర్. సభలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు మీసాలు మెలితిప్పుడూ, తొడలు కొడుతూ సవాళ్లు విసిరుకున్నారు. సభలో ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం మెలేయడంపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. బావ కళ్లలో ఆనందం కోసం బాలయ్య మీసాలు మెలేస్తున్నారని ఆరోపించారు. సభలో టీడీపీ ఎమ్మెల్యేలు నానా హంగామా సృష్టించారన్నారు. సభా మర్యాదను అగౌరవపరిచేలా బాలకృష్ణ ప్రవర్తించారన్నారు. చంద్రబాబు అరెస్టుపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బాలకృష్ణకి సూటిగా చెప్తున్నా.. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహంలాంటి జగన్ ముందు కాదంటూ మంత్రి రోజా అన్నారు. బాలకృష్ణ సినిమా ఫంక్షన్లకు వెళ్లి ఆడపిల్లలు కనిపిస్తే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అంటారని సెటైర్లు వేశారు. బాలకృష్ణ మీసాలు మెలేస్తే ఇక్కడ భయపడేవారు ఎవ్వరు లేరన్నారు.
సినిమా షూటింగ్ అనుకుంటున్నారా?
పబ్లిసిటీ కోసమే టీడీపీ నేతల సభలో హడావిడి చేస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. స్పీకర్ పై టీడీపీ నేతలు ఫైల్స్, బాటిల్స్ విసిరారని ఆరోపించారు. సభా మర్యాదను అగౌరవపరిచేలా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రవర్తించారని దుయ్యబట్టారు. తన తండ్రి ఎన్టీఆర్‌కు అవమానం జరిగినప్పుడు బాలకృష్ణ ఎందుకు స్పందించలేకపోయారన్నారు. బాలకృష్ణ అసెంబ్లీని సినిమా షూటింగ్ అనుకుంటున్నారన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడి దొరికిపోయిన దొంగ అని విమర్శించారు. అసలు తొమ్మిదేళ్లలో ఎన్నిసార్లు బాలకృష్ణ సభకు వచ్చారని మంత్రి రోజా ప్రశ్నించారు. బాలయ్య తన నియోజకవర్గం సమస్యలపై ఎప్పుడైనా ప్రశ్నించారా? అని నిలదీశారు. చంద్రబాబు అరెస్టుపై సభలో చర్చిస్తామన్నారు.
సభలో చర్చకు సిద్ధం
"చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే శాసనసభలో బాలకృష్ణ మీసం తిప్పారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే స్కిల్ స్కామ్‌పై సభలో చర్చకు సిద్ధంగా ఉండాలి. ఈ తొమ్మిదేళ్లలో ఏనాడైనా ప్రజల సమస్యలపైన గానీ, హిందూపురం నియోజకవర్గం గురించి గానీ అసెంబ్లీలో చర్చించారా?. బాలకృష్ణకు సభలో మైక్ ఇస్తాం. ఈ స్కిల్ స్కామ్ చంద్రబాబు ఏం చేశారో? చేయలేదో? చెప్పమనండి. చంద్రబాబు అరెస్ట్‌పై అసెంబ్లీలో కచ్చితంగా చర్చకి వస్తుంది. అప్పుడు బాలయ్యకి మాట్లాడే అవకాశం ఇవ్వమని మేమే స్పీకర్ ను కోరతాం. అప్పుడు మాట్లాడమనండి. అంతే తప్ప.. ఇప్పుడు మీసాలు తిప్పడం, తొడలుగొట్టడం కాదు." - మంత్రి ఆర్కే రోజా