CRDA Lands: అమరావతిలో పేదల ఇళ్లకు మరో 268 ఎకరాల కేటాయింపు
CRDA Lands: రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పద్దతిలో సమీకరించిన భూముల్లో పేదల ఇళ్ల స్థలాలకు మరో 268 ఎకరాలను బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
CRDA Lands: రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సమీకరించిన భూముల్లో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి మరో 268ఎకరాలు అప్పగించారు. ఇప్పటికే రెండు జిల్లాల పేదలకు ఇళ్ల స్థలాల కోసం రాజధాని భూముల్లో 1,134 ఎకరాల కేటాయించారు. కలెక్టర్ల విజ్ఞప్తితో తాజాగా మరిన్ని భూములను అప్పగించాలని ఎల్‌ఏఎస్‌సీ నిర్ణయించింది. ఎకరా రూ.24.60 లక్షల ధరకు ఈ భూముల్ని జిల్లాలకు బదలాయిస్తున్నారు.
రాజధాని అమరావతిలో సెంటు చొప్పున ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం మరో 268 ఎకరాలు కేటాయించింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన 50 వేల మందికి రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల కేటాయింపు కోసం ఇప్పటికే 1,134 ఎకరాల్ని కేటాయించింది. ఇందుకోసం సీఆర్‌డీఏ చట్టాన్ని సవరిస్తూ, రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేశారు.
ఆర్-5 పేరుతో కొత్త రెసిడెన్షియల్ జోన్ ఏర్పాటుచేసింది. ఎన్టీఆర్ జిల్లాకు 584 ఎకరాలు, గుంటూరు జిల్లాకు 550 ఎకరాలను తొలుత ప్రభుత్వం కేటాయించింది. వాటిలో లేఅవుట్‌ల అభివృద్ధి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల యంత్రాంగం చేపట్టింది. ఈ నెల 18న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందించాలని నిర్ణయించారు.
మరోవైపు రెండు జిల్లాల కలెక్టర్ల విజ్ఞప్తి మేరకు మరో 268 ఎకరాల్ని ఇళ్ల స్థలాలకు కేటాయించాలని ల్యాండ్ ఎలాట్‌మెంట్ స్క్రూటినీ కమిటీ నిర్ణయించింది. ఎల్‌ఏఎస్‌సీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. కమిటీ సిఫారసు మేరకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 168 ఎకరాలు, గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 100 ఎకరాలు అదనంగా కేటాయించాలని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మికి సీఆర్‌డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ప్రతిపాదన పంపారు.
రాజధాని మాస్టర్‌ప్లాన్‌లోని ఎస్3 జోన్‌లో భూములు…
బోరుపాలెం, పిచ్చికపాలెం, అనంతవరం గ్రామాల పరిధిలో ఎన్టీఆర్ జిల్లా వారికి, నెక్కల్లు గ్రామ పరిధిలో గుంటూరు జిల్లా వారికి భూములు కేటాయించాలని వివేక్ యాదవ్ కోరారు. సీఆర్‌డీఏకి ఒక్కో ఎకరానికి రూ.24.60 లక్షల చొప్పన రెవెన్యూశాఖ చెల్లించే ప్రాతిపదికన భూములు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రప్రభుత్వం నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని విజయవాడ, పెదకాకాని, దుగ్గిరాల తదితర ప్రాంతాలకు చెందిన 50వేల మందికి అమరావతిలోని ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమర్రు గ్రామాల పరిధిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1,134 ఎకరాలు కేటాయించింది. ఆ భూముల్ని రెండు జిల్లాల కలెక్టర్లకు సీఆర్‌డీఏ ఇప్పటికే అప్పగించింది.
ఎన్టీఆర్ జిల్లాకు చెందినవారి కోసం 11, గుంటూరు జిల్లాకు చెందినవారి కోసం 10 లేఅవుట్‌లను సిద్ధం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు సమర్పించిన లేఅవుట్ ప్లాన్‌లనూ సీఆర్‌డీఏ ఆమోదించింది. ''ప్రభుత్వం కేటాయించిన 584 ఎకరాల్లో 20,684 మంది లబ్ధిదారులకే స్థలాలు ఇవ్వగలమని, మిగతా 6,055 మందికి స్థలాలు ఇచ్చేందుకు మరో 168 ఎకరాలు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కోరారు. అలాగే 550 ఎకరాల్లో 19,818 మందికి స్థలాలు ఇవ్వగలమని, మిగతా 3,417 మందికి స్థలాలు ఇచ్చేందుకు మరో 100 ఎకరాలు కేటాయించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కోరినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో సీఆర్‌డీఏ కమిషనర్ పేర్కొన్నారు.
గణనీయంగా బేస్ ప్రైస్ తగ్గింపు…
రాజధాని అమరావతిలో భూముల సగటున ఎకరం ధర రూ.4.1 కోట్లుగా నిర్ధారించారు. ఆ భూముల్ని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు గృహనిర్మాణానికి బేస్‌ప్రైస్‌లో 25 శాతానికి కేటాయించవచ్చన్న నిబంధన ఉంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 23న జరిగిన అథారిటీ సమావేశంలో... దాన్ని 6 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం సీఆర్‌డీఏకి రెవెన్యూశాఖ ఎకరానికి రూ.24.60 లక్షలు చొప్పున, 268 ఎకరాలకు కలిపి రూ.65.93 కోట్లు చెల్లించాలని పురపాలకశాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో సీఆర్‌డీఏ కమిషనర్ పేర్కొన్నారు.
మరోవైపు రాజధానిలో సెంటు భూమి కేటాయింపు పేరుతో ప్రభుత్వం పేదల్ని మోసం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే 5వేలకు పైగా ఇళ్లను టిడ్కో నిర్మించిందని, అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణం చేపడితే తక్కువ విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణం చేపట్టొచ్చని చెబుతున్నారు. ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడానికే సెంటు భూమి పేరుతో మోసం చేస్తోందని ఆరోపిస్తున్నారు.