IIIT Student Suicide: ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్ధి ఆత్మహత్య
IIIT Student Suicide: ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటీలో బిటెక్ చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సివిల్ ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్న నేర్జాంపల్లె గంగారాం మంగళవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ట్రిపుల్ ఐటీ అధికారులు ప్రకటించారు.
IIIT Student Suicide: వైయస్‌ఆర్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలో ఉన్న ట్రిపుల్‌ఐటీలో చదువుతున్న నేర్జాంపల్లె గంగారాం మంగళవారం హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు, తోటి విద్యార్థుల కథనం ప్రకారం.. లింగాల మండలం తేర్నాంపల్లె హరిజనవాడకు చెందిన నారాయణమ్మ, గంగాధర కూలీ పనులు చేస్తుంటారు. వీరికి గంగారాం, గౌరీకుమార్ కుమారులు. పెద్ద కుమారుడు గంగారాం ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
మంగళవారం గంగారాం ట్రిపుల్ ఐటీలోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థులు గది తలుపులు కొట్టినా తీయకపోవడంతో కిటికీ నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. విద్యార్ధి మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్, సీఐ గోవిందరెడ్డి, వేంపల్లె, చక్రాయపేట ఎస్సైలు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదువుల్లో ఒత్తిడి, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్ధి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు చెబుతున్నారు.