Anakapalli District : అన‌కాప‌ల్లి జిల్లాలో ఘోరం - 9వ తరగతి బాలికను న‌రికి చంపిన ప్రేమోన్మాది..!-a ninth class girl was murdered in anakapalli district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anakapalli District : అన‌కాప‌ల్లి జిల్లాలో ఘోరం - 9వ తరగతి బాలికను న‌రికి చంపిన ప్రేమోన్మాది..!

Anakapalli District : అన‌కాప‌ల్లి జిల్లాలో ఘోరం - 9వ తరగతి బాలికను న‌రికి చంపిన ప్రేమోన్మాది..!

HT Telugu Desk HT Telugu
Jul 07, 2024 09:58 AM IST

Anakapalli District Crime News : అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. బెయిల్ పై వచ్చిన ఓ ప్రేమోన్మాది… తొమ్మిదో తరగతి చదవుతున్న బాలికను అత్యంత దారుణంగా హత్య చేశాడు.

అనకాపల్లి జిల్లాలో బాలిక దారుణ హత్య
అనకాపల్లి జిల్లాలో బాలిక దారుణ హత్య (image source unsplash.com)

అన‌కాప‌ల్లి జిల్లాల్లో ఘోరం చోటు చేసుకుంది. అణ్యంపుణ్యం తెలియని తొమ్మిదో త‌ర‌గ‌తి అమ్మాయిని ప్రేమోన్మాది.. వేట కొడ‌వ‌లితో న‌రికి హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న‌ స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది.

ఈ కిరాత‌క ఘ‌ట‌న అన‌కాప‌ల్లి జిల్లా రాంబిల్లి మండ‌లం కొప్పుగుండుపాలెంలో జ‌రిగింది. ఇదే గ్రామానికి చెందిన బ‌ద్ది ద‌ర్శిని (14) రాంబిల్లి మండ‌ల కేంద్రంలోని జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్‌లో తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతుంది. క‌శింకోట‌కు చెందిన బోడాబ‌త్తుల సురేష్(26) కొప్పుగుండుపాలెంలోని అమ్మ‌మ్మ ఇంటి వ‌ద్ద ఉంటున్నాడు. జులాయిగా తిరిగే ఆ ప్రేమోన్మాది ఏడాదిగా ఆ బాలిక వెంట ప‌డ్డాడు. ప్రేమ పేరుతో ఆ బాలిక‌ను వేధించేవాడు. అయితే ద‌ర్శిని అందుకు నిరాక‌రించింది.

బెయిల్ పై బయటికొచ్చి….

సురేష్ వేధింపులు తాల‌లేక‌ త‌ల్లిదండ్రుల‌కు విష‌యం చెప్పింది. త‌ల్లిదండ్రులతో క‌లిసి రాంబ‌ల్లి పోలీస్ స్టేష‌న్‌ను ఆశ్ర‌యించింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సురేష్‌పై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ఆ కేసుపై సురేష్‌ను జైలుకు కూడా పంపారు. దీంతో ఆ బాలిక‌పై క‌క్ష పెంచుకున్న సురేష్‌ ఇటీవల బెయిల్‌పై విడుద‌ల అయ్యాడు. ద‌ర్శిని ఎలాగైనా హ‌త‌మార్చాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. దీంతో ద‌ర్శిని స్కూల్ నుంచి వ‌చ్చేస‌రికి త‌ల్లిదండ్రులు ప‌నులు ముగించుకుని ఇంటికి రార‌ని, అదే స‌మ‌యంలో హ‌త్య చేయాల‌ని భావించాడు.

చిన్నారి ద‌ర్శిని రోజులానే శ‌నివారం కూడా పాఠ‌శాల‌కు నుంచి సాయంత్రం ఇంటికి వ‌చ్చింది. అయితే ఇంట్లో ఎవ‌రూ లేర‌ని భావించి బాలిక ఇంట్లోకి సురేష్ దూరి… వేట కొడ‌వ‌లితో హ‌తమార్చ‌ాడు. హ‌త్య చేసి కొద్ది సేప‌టికి సురేష్ ఇంట్లో నుంచి బ‌య‌టకు వ‌చ్చాడు. దీన్ని బాలిక నాన‌మ్మ కాంతం చూశారు. అనుమానంతో వెంట‌నే ఇంటి లోప‌లికి వెళ్లి చూసింది. 

ర‌క్త‌పుమ‌డుగులో ఉన్న మ‌న‌వ‌రాలిని చూసి కేక‌లు వేసింది. ఏం జ‌రుగుతుందోన‌ని ఇంటి చుట్టుప‌క్క‌ల వారు అక్క‌డి వ‌చ్చారు. ర‌క్త‌పుమ‌డుగులో ఉన్న బాలిక, ప‌క్క‌నే విల‌పిస్తున్న నాన్న‌మ్మ‌ను చూసి నివ్వెరుపోయారు. అయితే స్థానికులు వ‌చ్చి బాలిక‌ను ప‌రిశీలించి… అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు గుర్తించారు.

ప‌నులు ముగించుకుని ఇంటికి వ‌చ్చిన ద‌ర్శిని త‌ల్లిదండ్రులు వెంక‌ట‌ర‌మ‌ణ‌, వ‌ర‌ల‌క్ష్మిలు కుతురు హ‌త్యతో ఉదాంతం తెలిసి విషాదంలోకి వెళ్లిపోయారు. క‌న్నీరుమున్నీరు అవుతూ గుండెల‌విసేలా రోదించారు.  ఘ‌ట‌న గురించి తెలుసుకున్ పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. సురేష్ త‌న మ‌న‌వ‌రాలిని హత్య చేశాడ‌ని కాంతం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ప‌రారీలో ఉన్నాడు.  నిందితుడి కోసం గాలింపు ముమ్మ‌రం చేశారు.

స్పందించిన రాష్ట్ర హోం మంత్రి అనిత‌

చిన్నారి దారుణ హ‌త్య ఘ‌ట‌న‌పై రాష్ట్ర హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత స్పందించారు. స‌మాచారం తెలిసిన వెంట‌నే అన‌కాప‌ల్లి జిల్లా ఎస్పీ కేవీ ముర‌ళీకృష్ణ‌తో మాట్లాడారు. పూర్తి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని వెంట‌నే ప‌ట్టుకుని క‌ఠినంగా శిక్షించాల‌ని ఆదేశించారు. దీంతో ప‌ర‌వాడ డీఎస్పీ కేవీ స‌త్య‌నారాయ‌ణ సంఘ‌టనా స్థ‌లానికి వెళ్లి ప‌రిశీలించారు. నిందితుడి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు.

ప‌సివాడిని నేల‌కేసిబాది హ‌త్య‌…

చిత్తూరు జిల్లాలో బార‌మ‌ని భావించి ఏడాదిన్న‌ర ప‌సివాడిని నేల‌కేసి బాది ప్రాణాలు తీశాడు. ఈ అమానుష ఘ‌ట‌న శ‌నివారం చిత్తూరు రూర‌ల్ మండ‌లం దిగుమాసాప‌ల్లెలో జ‌రిగింది. 

చిత్తూరు జిల్లా ఐరాల మండ‌లం జంగాల‌ప‌ల్లెకి చెందిన చంద్ర‌ప్ర‌కాష్‌తో త‌వ‌ణంప‌ల్లె మండ‌లం మాధ‌వ‌రం పంచాయతీ కృష్ణాపురానికి చెందిన శిరీష‌కు వివాహం జ‌రిగింది. వీరికి ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శిరీష‌కు మ‌తిస్థిమితం బాగోక‌పోవ‌డంతో పాటు న‌త్తి కూడా ఉంది. దీంతో భార్య ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానంతో ఆమెను భ‌ర్త త‌రుచూ వేధిస్తూ ఉండేవాడు. ఇలా భార్య‌ను దూరం పెట్టాడు.

భ‌ర్త‌కు దూరంగా పిల్ల‌ల‌తో ఉంటున్న శిరీష‌కు అదే గ్రామానికి చెందిన ప్రదీప్ అనే వ్య‌క్తితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది వీరిద్ద‌రి మ‌ధ్య వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. 

కొన్నాళ్లుగా ఇద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. అయితే ఈ ఇద్ద‌రూ దాదాపు నెల రోజుల క్రితం ప‌ని కోసం ముగ్గురు పిల్ల‌తో క‌లిసి దిగుమాసాప‌ల్లెలోని ఓ కోళ్ల‌ఫారంలో చేరారు. పిల్ల‌ల పోష‌ణ భార‌మ‌ని భావించిన ప్ర‌దీప్ శ‌నివారం మ‌ద్యం తాగి, ఆ మ‌త్తులో ఏడాద‌న్న‌ర వ‌య‌స్సున్న దినేష్‌ను నేల‌కేసి బాది హ‌త్య చేశాడు. అయితే పిల్ల‌డు ఇంటిపై నుంచి ప‌డిపోయాడ‌ని… కొన ఊపిరితో ఉన్నాడ‌ని శిరీష‌తో అబ‌ద్ధం చెప్పాడు. ఇద్ద‌రూ క‌లిసి పిల్లోడిని చిత్తూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. 

అయితే ప్ర‌దీప్ మాట‌తీరుపై అనుమానం వ‌చ్చిన శిరీష సోద‌రుడు భాను పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ప్ర‌దీప్‌ను పోలీసులు విచారించ‌గా అస‌లు విష‌జ్ఞం బ‌య‌ట‌ప‌డింది. దీంతో నిందితుడిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

WhatsApp channel