Amarnath : 84 మంది ఏపీ యాత్రీకులు సురక్షితం, ఇద్దరు మహిళల గల్లంతు….-84 ap pilgrims to amarnath safe two untraced yet ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /   Amarnath : 84 మంది ఏపీ యాత్రీకులు సురక్షితం, ఇద్దరు మహిళల గల్లంతు….

Amarnath : 84 మంది ఏపీ యాత్రీకులు సురక్షితం, ఇద్దరు మహిళల గల్లంతు….

HT Telugu Desk HT Telugu
Jul 10, 2022 01:58 PM IST

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన 84మంది ఆంధ్రా యాత్రికులు సురక్షితంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మరో ఇద్దరి అచూకీ లభించలేదని, వారి అచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆంధ్ర ప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన వారిలో రాజమండ్రికి చెందిన మహిళల అచూకీ లభించలేదని అధికారులు ప్రకటించారు.

<p>అమర్‌నాథ్‌ యాత్రలో &nbsp;గల్లంతైన వారి కోసం జాగిలాలతో గాలిస్తున్న సైనికులు</p>
అమర్‌నాథ్‌ యాత్రలో గల్లంతైన వారి కోసం జాగిలాలతో గాలిస్తున్న సైనికులు (HT_PRINT)

ఆంధ్రప్రదేశ్‌ అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్ళిన వారిలో 84మంది సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి యాత్రకు వెళ్లిన వారు ఆకస్మిక వరదలతో చిక్కుకుపోయారు. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన వారిలో 84మంది బేస్‌ క్యాంపులకు సురక్షితంగా చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నానికి ఇద్దరు మహిళల అచూకీ మాత్రమే లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి.

గత మూడ్రోజులుగా అమర్‌నాథ్‌ యాత్ర సాగే ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం యాత్రను నిలిపివేసింది. ఇప్పటికే మార్గమధ్యలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన ఐదుగురు పర్యాటకుల అచూకీ లభించలేదని కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత వారిలో ముగ్గురి అచూకీ లభించింది. రాష్ట్రం నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన వారి క్షేమ సమాచారాలు తెలుసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బేస్‌ క్యాంపులకు సురక్షితంగా చేరుకున్న వారి క్షేమ సమాచారాలను కుటుంబాలకు తెలియచేసింది.

మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన వారిపై ఒక్కసారిగా వరద ప్రవాహం విరుచుకుపడటంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. బేస్‌ క్యాంపుల్లోకి వరద ప్రవాహం విరుచుకుపడటంతో యాత్రికులు వరదలో కొట్టుకుపోయారు. దీంతో ఏపీ నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారి అచూకీపై ఆందోళన నెలకొంది. ఏపీ నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన వారి క్షేమ సమాచారాలు తెలుసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాజమండ్రి నుంచి 20మంది సభ్యుల బృందం అమర్‌నాథ్ యాత్రకు వెళ్లినట్లు గుర్తించారు. వారిలో ఇద్దరు మహిళల అచూకీ ఇంకా లభించలేదని అధికారులు చెబుతున్నారు. అచూకీ లభించని మహిళల భర్తలు శ్రీనగర్‌ చేరుకున్నారని, మహిళల అచూకీ తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

గల్లంతైన మహిళలు గాయపడి ఎక్కడైనా చికిత్స పొందుతూ ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. ఫోన్లు అందుబాటులో లేకపోవడం వల్ల కూడా వారి క్షేమ సమాచారాలు తెలియకపోవచ్చని రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్న అధికారులు చెబుతున్నారు.

రాజమండ్రి ఆర్డీఓ బాధిత కుటుంబాన్ని పరామర్శించి సహాయ చర్యలపై కుటుంబ సభ్యులకు వివరించారు. మరోవైపు గుంటూరుకు చెందిన 38మంది సభ్యుల బృందం కూడా అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లినట్లు గుర్తించారు. వీరంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. తాడేపల్లి గూడెంకు చెందిన 17మంది సభ్యుల బృందం కూడా అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. తిరుపతి నుంచి ఆరుగురు సభ్యుల బృందం, విజయనగరం నుంచి వెళ్లిన మరో బృందం ఆకస్మిక వరదల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కడప నుంచి వెళ్లిన మరో బృందం కూడా తాము సురక్షితంగానే ఉన్నట్లు అధికారులకు సమాచారం అందించారు. ఈ బృందంలో ఎంతమంది అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారనేది స్పష్టం కాలేదు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు.ఏపీభవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్‌ హిమాన్షు కౌషిక్‌ శ్రీనగర్‌లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక యంత్రాంగంతో సమన్వయం చేస్తూ ఏపీ నుంచి వెళ్లిన యాత్రీకుల్ని ఇళ్లకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమర్‌నాథ్‌ యాత్రీకుల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1902 హెల్ప్‌లైన్‌ ద్వారా సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలోని ఏపీభవన్‌లో యాత్రీకుల కోసం హెల్ప్‌లైన్‌ నిర్వహిస్తున్నారు.

Whats_app_banner