Deepavali Special Trains: దక్షిణ మధ్య రైల్వే దసరా, దీపావళి పండుగ సీజన్‌లో 854 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీపావళి, ఛత్ పూజల్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా భారతీయ రైల్వేలు 7,296 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పండుగ సీజన్‌లో వివిధ గమ్యస్థానాలకు గత ఏడాది 626 ప్రత్యేక రైళ్లను నడుపగా ఈ ఏడాది 854 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విజయవాడ డివిజన్ పరిధిలో నేడు 31 రైళ్లు నడుస్తాయి.
అక్టోబర్ 31న నడిచే ప్రత్యేక రైళ్లలో ట్రైన్ నంబర్ 07653 కాచిగూడ-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రాత్రి పదిన్నరకు, ట్రైన్ నంబర్ 07042 తిరుపతి-సికింద్రాబాద్ రైలు రాత్రి 7.50కు, ట్రైన్ నంబర్ 07446 లింగంపల్లి-కాకినాడ రైలు రాత్రి 7.10కు, ట్రైన్ నంబర్ 07336 మణుగూరు-బెలగామ్ రైలు సాయంత్రం 3.40కు, ట్రైన్ నంబర్ 05294 సికింద్రాబాద్-ముజఫర్ నగర్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 3.55కు, ట్రైన్ నంబర్ 07021 సికింద్రాబాద్-దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 8.45కు, ట్రైన్ నంబర్ 07055 కాచిగూడ-హిసార్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం నాలుగు గంటలకు, ట్రైన్ నంబర్ 08580 సికింద్రాబాద్-విశాఖపట్నం రైలు రాత్రి 7.40కు, ట్రైన్ నంబర్ 03429 సికింద్రాబాద్-మాల్దా టౌన్ రైలు సాయంత్రం 4.35కు, ట్రైన్ నంబర్ 01437 సోలాపూర్-తిరుపతి రైలు రాత్రి 9.40కు బయల్దేరుతుంది.
విజయవాడ స్టేషన్‌లో దీపావళి పండుగతో పాటు సెలవుల రద్దీ దృష్ట్యా క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. దీపావళి పండుగ చత్ పూజ సమయంలో రైలు ప్రయాణానికి పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, విజయవాడ డివిజన్ ప్రయాణీకుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి సన్నద్ధమైంది.
పండుగ సెలవుల సమయంలో ప్రయాణికుల అదనపు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ సీజన్‌లో దక్షిణ మధ్య రైల్వే 850 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసింది. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి వీలుగా ఇప్పటికే ఉన్న రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.