తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jangaon Farmers Protest : జనగామ మార్కెట్లో దళారుల దోపిడీపై సీఎం సీరియస్,​ముగ్గురికిపై కేసు నమోదు

Jangaon Farmers Protest : జనగామ మార్కెట్లో దళారుల దోపిడీపై సీఎం సీరియస్,​ముగ్గురికిపై కేసు నమోదు

HT Telugu Desk HT Telugu

12 April 2024, 7:52 IST

    • Jangaon Farmers Protest : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. అయితే జనగామ జిల్లాలో ధాన్యం అమ్మేందుకు వచ్చిన రైతులను దళారులు దోచుకునేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులు ధర్నాకు దిగారు. ట్రేడర్స్ పై చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
దళారుల దోపిడీపై సీఎం సీరియస్
దళారుల దోపిడీపై సీఎం సీరియస్

దళారుల దోపిడీపై సీఎం సీరియస్

Jangaon Farmers Protest : జనగామ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారుల దోపిడీకి అడ్డే లేకుండా పోతోంది. ఆరుగాలం శ్రమించిన రైతులను తాలు, తేమ పేరున నిండా ముంచుతుండటంతో బుధవారం కొంతమంది రైతులు ఆందోళనకు దిగారు. మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా రూ.1,500 కే కొనుగోలు చేస్తున్నారని రైతులు నిరసనకు దిగగా.. అది కాస్త చిలికిచిలికి గాలివానగా మారింది. విషయం సీఎం రేవంత్​ రెడ్డి దాకా వెళ్లగా.. ఆయన ఆదేశాల మేరకు కదిలిన జిల్లా అధికారులు ముగ్గురు వ్యాపారులపై కేసు నమోదు చేశారు. అనంతరం రైతులకు మద్దతు చెల్లించి, కొనుగోలు ప్రక్రియ ప్రారంభించారు. వరి కోతలు పూర్తవడంతో బుధవారం దాదాపు 250 మంది రైతులు తమ ధాన్యాన్ని జనగామ వ్యవసాయ మార్కెట్ కు తీసుకువచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రేటు ఖరారు చేసి, కాంటాలు ప్రారంభించాల్సిన కొందరు వ్యాపారులు రైతులను ఆగమాగం చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకైనా కాంటాలు ప్రారంభించాల్సి ఉండగా.. సాయంత్రం ఐదు గంటలకు కొనుగోళ్లు స్టార్ట్​ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

TS Wines Shops Close : ఇవాళ్టి నుంచే వైన్స్ షాపులు బంద్ - ఎప్పటివరకంటే..?

TSRJC CET Results 2024 : టీఎస్ఆర్జేసీ సెట్‌ ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ 7వ ఛార్జీషీట్ - నిందితురాలిగా కవిత పేరు..!

Yadagirigutta Tour : ఒకే ఒక్క రోజులో యాదాద్రి ట్రిప్ - కొలనుపాక జైన్ మందిర్ కూడా చూడొచ్చు, 1499కే టూర్ ప్యాకేజీ

తాలు, తేమ పేరుతో దోపిడీ

సాయంత్రం సమయంలో కొనుగోళ్లు(Paddy Procurement) ప్రారంభించిన వ్యాపారులు ధాన్యంలో తేమ, తాలు సాకుతో క్వింటా ధాన్యానికి రూ.1,551, రూ.1,569, రూ.1,658 చొప్పున ధర నిర్ణయించారు. దీంతో కష్టపడి పంట పండించిన రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇదే విషయమై వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. వారు స్పందించకపోవడంతో మార్కెట్ కమిటీ కార్యాలయం(Jangaon Market Committee) ముందు నిరసన చేపట్టారు. ప్రభుత్వం క్వింటా ధర రూ.2,203 నిర్ణయిస్తే తమకు రూ.1,500 ఇవ్వడమేంటని వ్యాపారులు, అధికారులను నిలదీశారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయకుంటే ఆ మొత్తం ధాన్యాన్ని తగలబెడతామని స్పష్టం చేశారు. దీంతో మార్కెట్​ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సమాచారం అందు కున్న జనగామ జిల్లా అడిషనల్​ కలెక్టర్ రోహిత్​ సింగ్​ వెంటనే మార్కెట్​ యార్డుకు హుటాహుటిన తరలివచ్చారు. ఆందోళన చేపట్టిన రైతుల(Farmers Protest)తో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. మార్కెట్ అధికారులు ఇచ్చిన ధాన్యం చీటీలపై ట్రేడర్లు రాసిన ధరలను చూసి షాక్​ అయ్యారు. ట్రేడర్ల తీరును తప్పుబడుతూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ ధర నిర్ణయించిన ట్రేడర్లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, దీనిపై ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజరు ప్రసాద్​ కు సూచించారు. అలాగే రైతులు దోపిడీకి గురవుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిన మార్కెట్ కార్యదర్శిని కూడా సస్పెండ్ చేయాలని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని, కనీస మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విమరించారు.

సీఎం సీరియస్​.. వ్యాపారులపై కేసు

వ్యాపారుల దోపిడీ విషయం సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy Serious) దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఆదేశాల మేరకు సీఎంవో అధికారులు గురువారం జనగామ జిల్లా అధికారులతో మాట్లాడారు. సీఎం రేవంత్​ రెడ్డి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జనగామ వ్యవసాయ మార్కెట్(Jangaon Agriculture Market)​ లోని ట్రేడర్స్ పై చర్య తీసుకున్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేసిన ట్రేడర్స్(Traders) కందుకూరి వెంకట్ నారాయణ, దాస ఉష రాణి, కందుకూరి సుజాతలపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ట్రేడర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించడంతో పాటు రైతుల సమస్యలపై స్పందించిన జిల్లా అధికారులను సీఎం రేవంత్​ రెడ్డి అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై వెంటనే స్పందించాలని, వ్యాపారుల దోపిడీ జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లువెత్తగా.. గురువారం సెలవు రోజు అయినప్పటికీ కొనుగోళ్లు(Paddy Procurement) ప్రారంభించారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం