Etela vs Revanth : ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లావ్! నీకు నాతో పోలికేంటి..? - ఈటల
23 April 2023, 13:10 IST
- Etela Rajender News: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. రేవంత్‌రెడ్డికి తనకు పోలికేంటి..? అని ప్రశ్నించారు.
ఈటల రాజేందర్
Etela Rajender On Revanth Reddy: భాగ్యలక్ష్మీ ఆలయం సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. తాను రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదన్నారు. రేవంత్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటూ కూడా అసభ్యంగా మాట్లాడారని.. తాను ఏ రాజకీయ నేత గురించి కూడా తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. వీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టడని చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డికి తనకు పోలిక ఏంటి అని ప్రశ్నించారు. నోటుకు ఓటు కేసులో రేవంత్ జైలుకి వెళ్లివచ్చారన్న ఆయన... తాను విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నానని అన్నారు. బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయని... పార్లమెంట్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి పోరాటాలు చేశాయని గుర్తు చశారు.
“రేవంత్ రెడ్డి సంస్కరహీనంగా మాట్లాడిండు. విద్యార్థి దశ నుంచే నేను పోరాడుతున్నాను. తెలంగాణ ఉద్యమంలో నేను పోరాడుతున్నప్పుడు... రేవంత్ రెడ్డి చంద్రబాబు దగ్గర ఉన్నాడు. ప్రజల కోసం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లలేదు. ఓటుకు నోటుకు కేసులో వెళ్లిన సందర్భాలు మాత్రమే ఉన్నాయి.రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెడతారని అనుకోలేదు. ధీరుడు ఎప్పుడు కన్నీరు పెట్టరు. ఏదైనా ఉంటే పొలిటికల్ గా చూసుకుందాం. దమ్ముందా.. తేల్చుకుందాంరా..! నా ఇల్లు ఎవడు ముట్టడిస్తాడో రండి” అంటూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు ఈటల.
మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ 25 కోట్లు ఇచ్చిందన్న విషయంలో తాను రేవంత్ రెడ్డి పేరు ఎత్తలేదంటూ క్లారిటీ ఇచ్చారు ఈటల రాజేందర్. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఢిల్లీలో చెట్టాపట్టాలేసుకుని తిరిగాయని చెప్పుకొచ్చారు. రెండు పార్టీల పొత్తులపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా సంకేతాలు ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కాలేనన్న బాధతోనే రేవంత్ రెడ్డి కన్నీరు కార్చారేమో అంటూ ఈటల విమర్శించారు.
25 కోట్ల ఆరోపణలపై రేవంత్ రెడ్డి శనివారం భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… భావోద్వేగానికి గురయ్యారు. “రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు..ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను పోరాటం చేస్తా..అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా...మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుని ఉంటే... నా కుటుంబం సర్వ నాశనమైపోతుంది” అని రేవంత్ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడారు.
భాగ్యలక్ష్మి ఆలయంలో ఆత్మసాక్షిగా ప్రమాణం చేశానని తెలిపారు రేవంత్ రెడ్డి. తాను హిందువునని, అమ్మవారి నమ్ముతానని అన్న ఆయన... అందుకే ఈటల చేసిన ఆరోపణలను నిరూపించుకోవడానికి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చానని చెప్పారు. తాను కేసీఆర్,టీఆర్ఎస్ నేతల దగ్గర ఒక్కరూపాయి కూడా తీసుకోలేదన్నారు. “నన్ను అమ్ముడుపోయారని అంటావా? కేసీఆర్ సర్వం ధారపోసినా నన్ను కొనలేరు. ఇది చిల్లర రాజకీయం కాదు... పోరాటం. నా నిజాయితీని శంఖిస్తే మంచిది కాదు. రేవంత్ రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదు. నేను ఎవరికీ భయపడను.. నిటారుగా నిలబడి కొట్లాడుతా..నా జీవితంలో అన్నీ ఉన్నాయి. కేసీఆర్ సర్వం ధారపోసినా నన్ను కొనలేరు. బిడ్డ పెళ్లికి ఖైదీలా వచ్చిపోతే నా ఆవేదన తెలిసేది. రేవంత్‌రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదు. కేసీఆర్‌ను గద్దెదించడమే నా ఏకైక లక్ష్యం. చివరి రక్తపు బోట్టు వరకు, ఒంట్లో భయం లేకుండా కేసీఆర్ తో పోరాడుతా” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మొత్తంగా ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు ఆరోపణలు, కౌంటర్లతో రాజకీయం హీటెక్కింది. సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్రస్థాయిలో పోస్టులు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్, బీజేపీలను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది.