KTR Legal Notices: బండి సంజయ్, రేవంత్‌‌లపై కేటీఆర్‌ పరువునష్టం దావా..-minister ktr filed a defamation suit against bjp bandi sanjay and tpcc president revanth reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Legal Notices: బండి సంజయ్, రేవంత్‌‌లపై కేటీఆర్‌ పరువునష్టం దావా..

KTR Legal Notices: బండి సంజయ్, రేవంత్‌‌లపై కేటీఆర్‌ పరువునష్టం దావా..

HT Telugu Desk HT Telugu
Mar 29, 2023 07:46 AM IST

KTR Legal Notices: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణలు చెప్పకపోతే రూ.100కోట్ల దావా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్

KTR Legal Notices: తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కేటీఆర్‌ పాత్ర ఉందని బండి సంజయ్, రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ న్యాయపోరాటం ప్రారంభించారు. బండి సంజయ్, రేవంత్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపారు. ప్రశ్నపత్రాల లీక్‌‌కు సంబంధించి తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్, రేవంత్ ఆరోపణలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించాయని అభ్యంతరం తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, వారంలోగా వాటిని వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే దావాను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఐపీసీ 499, 500 సెక్షన్ల కింద ఇద్దరికీ నోటీసులు పంపారు.

బండి సంజయ్, రేవంత్‌ రెడ్డిలు ఎంపీలు కావడంతో వారి ఢిల్లీ చిరునామాలకు కూడా న్యాయవాది ద్వారా నోటీసులు పంపించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్‌కు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీసులు పంపించారు.తనపై చేసిన వ్యాఖ్యలను వారం రోజుల్లోపు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసుల్లో స్పష్టం చేశారు.

'ఈ నెల 17 నుంచి 25 వరకు వివిధ టీవీ చానెళ్లతో పాటు డిజిటల్, సోషల్‌ మీడియాలో తన పరువుకు భంగం కలిగించేలా ఇద్దరు నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడారని, 2009 నుంచి 2018 వరకు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేస్తున్నానని కేటీఆర్ చెప్పారు. విద్యావంతుడినైన తన ప్రతిష్టకు.. బండి సంజయ్, రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు భంగం కలిగించాయని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు.

సుదీర్ఘ కాలంగా ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్‌ రెడ్డి పదేపదే అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటివారిపై అసత్య ప్రేలాపనలు చేసే హక్కు లేదని, ఈ నేపథ్యంలోనే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని 499, 500 సెక్షన్ల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపుతున్నట్లు వివరించారు.

ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలు మానుకోవాలని, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే దావాను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. బండి సంజయ్, రేవంత్‌ రెడ్డిలు చేసిన ఆరోపణల వివరాలను నోటీసుల్లో కేటీఆర్‌ పొందుపరిచారు.

 

Whats_app_banner