తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugode Bypoll Candidates: కారును పోలిన రోడ్డురోలర్ గుర్తు.. ఎవరికి దక్కిందంటే

Munugode bypoll candidates: కారును పోలిన రోడ్డురోలర్ గుర్తు.. ఎవరికి దక్కిందంటే

HT Telugu Desk HT Telugu

18 October 2022, 10:41 IST

    • Munugode bypoll candidates: అధికార టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన సింబల్ రోడ్డురోలర్‌ యుగతులసి పార్టీ అభ్యర్థికి దక్కింది.
కారు గుర్తుకు సవాలుగా మారిన రోడ్ రోలర్ గుర్తును ఎవరికీ కేటాయించొద్దని కోరిన టీఆర్ఎస్
కారు గుర్తుకు సవాలుగా మారిన రోడ్ రోలర్ గుర్తును ఎవరికీ కేటాయించొద్దని కోరిన టీఆర్ఎస్ (HT_PRINT)

కారు గుర్తుకు సవాలుగా మారిన రోడ్ రోలర్ గుర్తును ఎవరికీ కేటాయించొద్దని కోరిన టీఆర్ఎస్

హైదరాబాద్ అక్టోబర్ 18: నామినేషన్ల ఉపసంహరణ గడువు అక్టోబర్ 17తో ముగియడంతో నవంబర్ 3న జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

అయితే పోటీ ప్రధానంగా మూడు రాజకీయ పార్టీల మధ్యే కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది.

మొత్తం 130 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. వీరిలో 83 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందినప్పటికీ, సోమవారం 36 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరకు 47 మంది పోటీలో మిగిలారు. అయితే ఒక్కో ఈవీఎంపై 16 మంది అభ్యర్థుల గుర్తులకే చోటు ఉంటుంది. ఈ కారణంగా మూడు ఈవీఎం మెషీన్లను అందుబాటులో ఉంచాల్సి వస్తుంది.

అభ్యర్థుల పేర్లు, గుర్తులు, ఫోటోలు కూడా ఈవీఎంలలో పొందుపరుస్తారు. ఓటర్లు మూడు ఈవీఎం మెషీన్లలో ఉన్న 47 మంది అభ్యర్థుల వివరాలు చూసి అందులో ఒకరికి ఓటు వేయాల్సి ఉంటుంది. కాగా కారును పోలిన ట్రక్కు, ట్రాక్టర్, రోడ్ రోలర్‌ గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని అధికార టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి చేసిన విన్నపం ఫలించలేదు. రోడ్ రోలర్ గుర్తు యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్‌కు లభించింది.

మునుగోడు స్థానంలో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిని బీజేపీ రంగంలోకి దించింది. ఆయన ఆగస్టులో కాంగ్రెస్‌ను వీడి కాషాయ పార్టీలో చేరారు. నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇటీవల భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా పేరు మార్చుకున్న టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని బరిలోకి దింపింది. ఉపఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రంగంలో ఉన్నారు.

వచ్చే ఏడాది జరగనున్న శాసన సభ ఎన్నికలకు ముందు మునుగోడు ఉపఎన్నిక ఫలితం గెలుపొందిన వారికి ప్రాధాన్యతనిస్తుంది. ఓటర్లను వలలో వేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

తదుపరి వ్యాసం