తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Budget 2022 | బడ్జెట్‌లో పేదలు అనే మాట రెండు సార్లే వినిపించింది: చిదంబరం

Budget 2022 | బడ్జెట్‌లో పేదలు అనే మాట రెండు సార్లే వినిపించింది: చిదంబరం

HT Telugu Desk HT Telugu

02 February 2022, 9:32 IST

  • కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. పన్నులు చెల్లించే మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం లేదని, అత్యంత పేదలకు నగదు సహాయం గురించి ఒక్క మాట కూడా లేదని మండిపడ్డారు. ఇప్పటివరకు ఉన్న బడ్జెట్ ప్రసంగాల్లో ఇది అత్యంత పెట్టుబడిదారీ ప్రసంగం అని విమర్శించారు.

విలేకరుల సమావేశంలో చిదంబరం
విలేకరుల సమావేశంలో చిదంబరం (Mohd Zakir)

విలేకరుల సమావేశంలో చిదంబరం

నిర్మలా సీతారామన్ సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేదలు అనే మాట కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చిందని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘ఏ ప్రమాణాల ప్రకారం చూసినా, బడ్జెట్ ప్రసంగం ఆర్థిక మంత్రి చదివిన అత్యంత పెట్టుబడిదారీ ప్రసంగం. ఆర్థిక మంత్రి పెట్టుబడిదారీ ఆర్థిక శాస్త్ర పరిభాషలో ప్రావీణ్యం సంపాదించారు. ఆమె ప్రసంగాన్ని మళ్లీ చదవండి. ఆమె డిజిటల్, పోర్టల్, ఐటీ పదాలను ఎన్నిసార్లు ఉపయోగించారో లెక్కించండి.  పేపర్‌లెస్, డేటాబేస్, ఎకోసిస్టమ్, గ్లోబల్, ఆత్మనిర్భర్ వంటి పదాలను ఎన్నిసార్లు ఉపయోగించారో లెక్కించండి. 'పేద' అనే పదం ఆరో పేరాలో రెండుసార్లు వచ్చింది. ఈ దేశంలో పేద ప్రజలు ఉన్నారని గుర్తు చేసినందుకు ఆర్థిక మంత్రికి మేం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం..’ అని ఆయన అన్నారు.

ప్రజల కష్టాలు, బాధలను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని చిదంబరం మండిపడ్డారు. ‘ఆర్థిక మంత్రి రాబోయే 25 సంవత్సరాల కోసం ఒక ప్రణాళికను వివరిస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. దానిని ఆమె అమృత్ కాల్ అని పిలిచారు. ప్రస్తుతానికి ఎలాంటి శ్రద్ధ అవసరం లేదని, ప్రజలను ఓపికగా వేచి ఉండమని ప్రభుత్వం చెబుతోంది. ఇది భారతదేశ ప్రజలను, ముఖ్యంగా పేదలు , అణగారిన వారిని అపహాస్యం చేయడం తప్ప మరొకటి కాదు’ అని ఆయన అన్నారు.

నగదు సాయం గురించి మాటేది?

‘గత రెండేళ్లుగా తీవ్ర పేదరికంలోకి పడిపోయి, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పేదలకు ఎలాంటి నగదు సహాయం అందించడం గురించి ప్రసంగంలో ఒక్క మాట కూడా లేదు. ఉద్యోగాలు కోల్పోయిన వారి గురించి ఒక్క మాట కూడా లేదు. పాఠశాల స్థాయిలో చదువు ఏదో ఒక దశలో ఆగిపోయిన వారి గురించి, మూతపడిన ఎంఎస్‌ఎంఈలను పునరుద్ధరించడం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు..’ అని ఆయన ఆరోపించారు.

బడ్జెట్‌లో పోషకాహార లోపం, ఆకలిని ఎదుర్కోవడానికి ఎక్కువ ఆహారాన్ని పంపిణీ చేయడం గురించి ఒక పదం లేదని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, వస్తువుల ధరలను తగ్గించడానికి పరోక్ష పన్నులను, ముఖ్యంగా జీఎస్టీని తగ్గించడం గురించి ఒక పదం లేదని ఆయన అన్నారు. 

ఆందోళనకరమైన స్థూల ఆర్థిక సూచికలు

‘2021-22లో ఆర్థిక లోటు 6.8 శాతం లక్ష్యాన్ని అధిగమించి 6.9 శాతంగా అంచనాలు ఉన్నాయి.. వచ్చే ఏడాదికి ఇది 6.4 శాతంగా ఉంటుంది. 2025-26 నాటికి మూడు సంవత్సరాలకు 4 శాతానికి చేరుకోవడం లక్ష్యం..’ అని అన్నారు. మొత్తం సబ్సిడీ ల భారాన్ని భారీగా 27 శాతం మేర తగ్గించినట్లు కాంగ్రెస్ నాయకుడు చెప్పారు.

‘ఈ బడ్జెట్‌లో ఇది అత్యంత దయలేని కోత. ఆర్థిక మంత్రి పేదలను మరచిపోయి ఉండవచ్చు కానీ పేదలకు సుదీర్ఘ జ్ఞాపకాలు ఉన్నాయి’ అని ఆయన అన్నారు.

ధనవంతుల నుంచి, ముఖ్యంగా 142 మంది ధనవంతుల నుంచి మరిన్ని వనరులను సేకరించడం గురించి బడ్జెట్‌లో ఒక పదం లేదని ఆయన అన్నారు. వారి సంపద గత రెండేళ్లలో రూ. 23,14,000 కోట్ల నుండి రూ. 53,16,000 కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు.

తదుపరి వ్యాసం