తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఆఫీసులో 'బిన్​ లాడెన్​' చిత్రపటం- ప్రభుత్వ అధికారి సస్పెండ్​

ఆఫీసులో 'బిన్​ లాడెన్​' చిత్రపటం- ప్రభుత్వ అధికారి సస్పెండ్​

HT Telugu Desk HT Telugu

02 June 2022, 7:49 IST

  • బిన్​ లాడెన్​ పేరు వింటేనే అసహ్యించుకునే వారు చాలా మంది ఉంటారు. కానీ ఓ ప్రభుత్వ అధికారి మాత్రం.. తన ఆఫీసులో బిన్​ లాడెన్​ చిత్రపటాన్ని పెట్టుకున్నారు. అంతేకాకుండా.. ‘రెస్పెక్టెడ్​ బిన్​లాడెన్​’ అని సంబోధిస్తూ.. ‘ప్రపంచంలోనే అత్యుత్తమైన ఇంజినీర్​’గా ఆ ఉగ్రవాదిని ఆయన పొగడటం గమనార్హం.

ఆఫీసులో ఒసామా బిన్​ లాడెన్​ చిత్రపటం
ఆఫీసులో ఒసామా బిన్​ లాడెన్​ చిత్రపటం (Getty Images)

ఆఫీసులో ఒసామా బిన్​ లాడెన్​ చిత్రపటం

ఉత్తర్​ప్రదేశ్​ ఫరూఖాబాద్​లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రపంచం మొత్తం అసహ్యించుకునే అల్​ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్​లాడెన్​ చిత్రపటాన్ని.. తన ఆఫీసులో పెట్టుకున్నారు ఓ ప్రభుత్వ ఆధారిత విద్యుత్​ పంపిణీ సంస్థకు చెందిన అధికారి. అంతేకాకుండా.. దాని కింద 'వరల్డ్స్​ బెస్ట్​ జూనియర్​ ఇంజినీర్​' అని రాసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. ఆ ఆఫీసర్​ను సస్పెండ్​ చేశారు.

డీవీవీఎన్​ఎల్​(దక్షినాంచల్​ విద్యుత్​ విత్రన్​ నిగమ్​ లిమిటెడ్​)లో సబ్​ డివిజనల్​​ ఆఫీసర్​గా పనిచేస్తున్న రవీంద్ర ప్రకాశ్​ గౌతమ్​.. తన ఆఫీసులో బిన్​ లాడెన్​ చిత్రపటం పెట్టుకున్నారు. 'రెస్పెక్టెడ్​ బిన్​ లాడెన్​' అని ఉగ్రవాదికి గౌరవం ఇస్తూ చిత్రపటం కింద బెస్ట్​ ఇంజినీర్​ అని రాశారు.

ఎవరు తీశారో తెలియదు కానీ.. ఆ 'రెస్పెక్టెడ్​ బిన్​ లాడెన్​' ఫోటోను కెమెరాల్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. అంతే! ఆ ఫొటోలు ఒక్కసారిగా వైరల్​ అయ్యాయి. ఈ వ్యవహారం సీనియర్​ అధికారుల దృష్టికి వెళ్లింది. చివరికి రవీంద్ర.. సస్పెన్షన్​కు గురయ్యారు. బిన్​ లాడెన్​ చిత్రపటం కూడా ఆఫీసు నుంచి తొలగించారు.

'నా దగ్గర చాలా ఫొటోలు ఉన్నాయి..'

కాగా.. తన చర్యలను రవీంద్ర సమర్థించుకున్నారు. "ఎవరైనా.. ఎవరిలోనైనా స్ఫూర్తిని నింపొచ్చు. ఒసామా బిన్​ లాడెన్​.. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమమైన జూనియర్​ ఇంజినీర్​. ఆఫీసు నుంచి ఆయన ఫొటోలను తీసేసి ఉండొచ్చు. కానీ నా దగ్గర బిన్​ లాడెన్​ ఫొటోలు చాలా ఉన్నాయి," అని చెప్పుకొచ్చారు.

అల్​ఖైదా..

అల్​ఖైద్​ నేతగా ఒసామా బిన్​ లాడెన్​ ప్రపంచాన్ని గడగడలాడించాడు. అమెరికాపై తన ఆయుధాలను ఎక్కుపెట్టేవాడు. న్యూయార్క్​ ట్విన్​ టవర్స్​లో విమానాలు చొచ్చుకెళ్లిన ఘటనకు సంబంధించిన సూత్రధారి బిన్​ లాడెనే. ఆ ఉగ్ర ఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నాటి రోజులను అమెరికా ప్రజలు ఇంకా మర్చిపోలేదు.

బిన్​ లాడెన్​ను అంతం చేసేందుకు రంగంలోకి దిగిన అమెరికా.. దాదాపు 10ఏళ్లు అతడిని అన్వేషించింది. చివరికి బిన్​ లాడెన్​.. పాకిస్థాన్​లో తలదాచుకుంటున్నట్టు తెలిసింది. 2011లో ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టి.. బిన్​ లాడెన్​ను అమెరికా సైన్యం అంతం చేసింది.

తదుపరి వ్యాసం