తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Parliament: వాడివేడిగా వర్షాకాల సమావేశాలు; యుద్ధానికి సిద్ధమవుతున్న విపక్షాలు; తొలిసారి కొత్త బిల్డింగ్ లో భేటీలు

Parliament: వాడివేడిగా వర్షాకాల సమావేశాలు; యుద్ధానికి సిద్ధమవుతున్న విపక్షాలు; తొలిసారి కొత్త బిల్డింగ్ లో భేటీలు

HT Telugu Desk HT Telugu

17 July 2023, 13:57 IST

  • Parliament Monsoon Session: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై ఉభయసభల్లో చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశాలు తొలిసారి పార్లమెంటు నూతన భవనంలో జరగనున్నాయి. 

పార్లమెంటు నూతన భవన సముదాయం
పార్లమెంటు నూతన భవన సముదాయం (via REUTERS)

పార్లమెంటు నూతన భవన సముదాయం

పార్లమెంటు (Parliament) నూతన భవనంలోనే ఈ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. కొత్త భవనాన్ని మే 28వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. జులై 20 తేదీ గురువారం నుంచి, ఆగస్ట్ 11వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. వచ్చే సంవత్సరం లోక సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది.

21 కొత్త బిల్లులు, 7 పాత బిల్లులు

ఈ సమావేశాల్లో పార్లమెంట్లో 21 కొత్త బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఏడు పాత బిల్లులపై కూడా చర్చ జరుగుతుంది. వాటిలో డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ (Digital Personal Data Protection Bill, 2022) కీలకమైంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అండ్ సెన్సిటివ్ పర్సనల్ డేటా నిబంధనల’ స్థానంలో ఈ డేటా ప్రొటెక్షన్ బిల్లు వస్తోంది. వ్యక్తిగత సమాచార హక్కు ఉల్లంఘనలకు కఠినమైన శిక్షలు, జరిమానాలను ఈ బిల్లులో పొందుపర్చారు. ఇది కాకుండా అటవీ పరిరక్షణ సవరణ బిల్లు, బయోలాజికల్ డైవర్సిటీ బిల్లు, జన విశ్వాస్ సవరణ బిల్లు, మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు, మీడియేషన్ బిల్లు, సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు మొదలైనవి ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి.

యుద్ధానికి సిద్ధమవుతున్న విపక్షాలు..

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. వివిధ ప్రభుత్వ విధానాలపై యుద్ధానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాల్లో విపక్ష కూటమికి నేతృత్వం వహించనుంది. ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అధికారాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ పై ఆప్ ఆగ్రహంగా ఉంది. ఆ ఆర్డినెన్స్ పై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న కాంగ్రెస్, తాజాగా, ఆ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్నామని, ఈ విషయంలో ఆప్ కు మద్దతిస్తున్నామని ప్రకటించింది. మరోవైపు, ఉమ్మడి పౌర స్మృతి ని తీసుకువచ్చే ప్రభుత్వ ప్రతిపాదనను పలు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిగా నిలిచిన విపక్షాల ఐక్యతకు ఈ సమావేశాలు ఒక ఉదాహరణగా నిలవనున్నాయి. మరోవైపు, పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలను ఎదుర్కోవడంతో పాటు రానున్న ఎన్నికలపై వ్యూహ రచన లక్ష్యంగా ఎన్డీఏ పక్షాలు సమావేశమయ్యాయి.

తదుపరి వ్యాసం