Kiren Rijiju: న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు ఔట్.. ఆయన స్థానంలో మేఘ్వాల్
18 May 2023, 11:26 IST
- Kiren Rijiju: కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు స్థానాన్ని అర్జున్ రామ్ మేఘ్వాల్ భర్తీ చేయనున్నారు. రిజిజుకు వేరే మంత్రిత్వ శాఖను మోదీ ప్రభుత్వం అప్పగించింది.
Kiren Rijiju: న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు ఔట్
Kiren Rijiju: కేంద్ర కేబినెట్‍లో నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శాఖ మారింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ఉన్న ఆయనను భూవిజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ(Ministry of Earth Sciences)కు కేంద్ర ప్రభుత్వం మార్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి(Union Law Minister)గా అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) నియమితులయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్న మేఘ్వాల్.. న్యాయ మంత్రిత్వ శాఖ స్వతంత్ర బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు. న్యాయ శాఖ మంత్రిగా రిజిజు స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ ఈ విషయంపై గురువారం ప్రకటన విడుదల చేసింది.
మరో ఏడాదిలో లోక్‍సభ ఎన్నికలు ఉన్న తరుణంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకు కీలకమైన మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వహించి ప్రభుత్వంలో ఒకానొక హైప్రొఫైల్ మంత్రిగా రిజిజు ఉన్నారు. అయితే, ఇప్పుడు తక్కువ ప్రాధాన్యం ఉన్న భూ విజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖను ఆయనకు కేటాయించడం ఆసక్తికరంగా మారింది.
న్యాయమూర్తులను నియమించే కొలీజియమ్ వ్యవస్థపై కిరణ్ రిజిజు ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొలీజియమ్ వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొలిజియమ్ వ్యవస్థను అపారదర్శకమని అన్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు కొలీజియమ్ మధ్య కోల్డ్ వార్ నడిచింది. ఈ తరుణంలో న్యాయ శాఖ నుంచి కేంద్ర ప్రభుత్వం రిజిజును తప్పించింది.
2021 జూలై 8వ తేదీన కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు భూవిజ్ఞాన శాఖకు మారారు. జితేంద్ర సింగ్ నిర్వహిస్తున్న ఈ శాఖను కేంద్రం రిజిజుకు అప్పగించింది. జితేంద్ర సింగ్ వద్ద ఇప్పుడు శాస్త్ర, సాంకేతికాభిృద్ధి శాఖలు ఉన్నాయి.
టాపిక్