తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Himachal Pradesh Congress: హిమాచల్ కాంగ్రెస్ లో ‘సీఎం’ పంచాయితీ

Himachal Pradesh Congress: హిమాచల్ కాంగ్రెస్ లో ‘సీఎం’ పంచాయితీ

HT Telugu Desk HT Telugu

10 December 2022, 15:48 IST

  • Himachal Pradesh Congress: కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ అందించిన హిమాచల్ ప్రదేశ్ లో పార్టీకి ఆదిలోనే కొత్త పంచాయితీ ప్రారంభమైంది. 

హిమాచల్ సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ నేతలు ప్రతిభా సింగ్, సుఖ్వీందర్ సింగ్
హిమాచల్ సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ నేతలు ప్రతిభా సింగ్, సుఖ్వీందర్ సింగ్ (HT_PRINT)

హిమాచల్ సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ నేతలు ప్రతిభా సింగ్, సుఖ్వీందర్ సింగ్

Himachal Pradesh Congress: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 68 అసెంబ్లీ స్థానాలకు గానూ, 40 సీట్లు గెలుచుకుని అధికార పీఠంపైకి రానుంది. అయితే, మొదట్లోనే పార్టీలో విబేధాలు ప్రారంభమయ్యాయి. సీఎం కావడం కోసం పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయి, పెద్ద ఎత్తున లాబీయింగ్ ప్రారంభించారు.

Front runner Pratibha Singh: రేసులో వీరభద్ర సింగ్ భార్య

ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానంలో.. శాసన సభా పక్ష నేతను ఎంపిక చేేేేసే బాధ్యతను పార్టీ అధ్యక్షుడికి అప్పగించారు. అయినా, కొందరు నేతలు తమకు అవకాశం ఇవ్వాలని లాబీయింగ్ ప్రారంభించారు. పార్టీ తరఫున పరిశీలకులుగా వచ్చిన చత్తీస్ గఢ్ సీఎం భూషేశ్ భఘేల్, హరియాణా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా ల ముందు శనివారం ఉదయం నుంచి వినతిపత్రాలతో క్యూ కట్టడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి పదవి రేసులో ప్రధానంగా రాష్ట్రంలో ఇన్నాళ్లూ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి, ఇటీవల చనిపోయిన మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్(Pratibha Singh) ముందంజలో ఉన్నారు. ఆమె ప్రస్తుతం హిమాచల్ లో పార్టీ పీసీసీ చీఫ్ గా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

Himachal Pradesh Congress: పోటీలో వీరు కూడా..

ప్రతిభా సింగ్(Pratibha Singh) తో పాటు ఇన్నాళ్లు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ముకేశ్ అగ్నిహోత్రి, పార్టీ ఎన్నికల కమిటీ చీఫ్ సుఖ్వీందర్ సింగ్ సుక్కు కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు. వీరు పార్టీ తరఫున పరిశీలకులుగా వచ్చిన భూపేశ్ భఘేల్, భూపీందర్ సింగ్ హుడాలను ఇప్పటికే వ్యక్తిగతంగా కలిసి, తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. అయితే, పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తామని వారు మీడియాకు స్పష్టం చేశారు. సీఎం పదవిని ఆశిస్తున్నట్లు ప్రతిభా సింగ్(Pratibha Singh), ఆమె కుమారుడు విక్రమాదిత్య బహిరంగంగా ప్రకటించారు. సీఎం పదవి వీరభద్ర సింగ్ కుటుంబానికే దక్కాలని వారు కోరుతున్నారు.

Priyanka Gandhi to decide the CM name: ప్రియాంక చేతిలో నిర్ణయం

కాగా, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని నిర్ణయించే బాధ్యతను సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) కు పార్టీ అప్పగించింది. హిమాచల్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక విస్తృతంగా పాల్గొన్న విషయం తెలిసిందే. పార్టీని గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్న ప్రియాంక(Priyanka Gandhi).. ఆ భాద్యతను విజయవంతంగా నిర్వర్తించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రారంభించి, ప్రచార వ్యూహం, ప్రచారం, ప్రచార కర్తల సమన్వయం వరకు అన్నీ తానై వ్యవహరించి, కాంగ్రెస్ ను గెలిపించారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను కూడా పార్టీ ఆమె(Priyanka Gandhi)కే అప్పగించింది. శనివారం రాత్రిలోగా హిమాచల్ ప్రదేశ్ సీఎం పేరును ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వాద్రా ప్రకటించే అవకాశముంది.

తదుపరి వ్యాసం