తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'నుపుర్​' వివాదంతో భారత్​కు బిలియన్​ డాలర్ల నష్టం తప్పదా?

'నుపుర్​' వివాదంతో భారత్​కు బిలియన్​ డాలర్ల నష్టం తప్పదా?

Sharath Chitturi HT Telugu

07 June 2022, 13:07 IST

    • Nupur Sharma : నుపుర్​ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో గల్ఫ్​ దేశాలు ఇండియాను తప్పుబడుతున్నాయి. అవి వ్యక్తిగత వ్యాఖ్యలే అని భారత ప్రభుత్వం చెబుతున్నా.. ఆయా దేశాలు వినిపించుకోవడం లేదు. ఇదే కొనసాగితే, నుపుర్​ శర్మ వల్ల ఇండియాకు బిలియన్​ డాలర్ల నష్టం తప్పదని వాదనలు వినిపిస్తున్నాయి.
నుపుర్​ వ్యాఖ్యలతో భారత్​కు బిలియన్​ డాలర్ల నష్టం తప్పదా?
నుపుర్​ వ్యాఖ్యలతో భారత్​కు బిలియన్​ డాలర్ల నష్టం తప్పదా? (HT)

నుపుర్​ వ్యాఖ్యలతో భారత్​కు బిలియన్​ డాలర్ల నష్టం తప్పదా?

Nupur Sharma : నుపుర్​ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో గల్ఫ్​ దేశాలు ఇండియాపై ఆగ్రహంతో ఉన్నాయి. కొన్ని దేశాల్లో భారత ఉత్పత్తులపై అనధికారిక నిషేధం కూడా నడుస్తోంది. పరిస్థితులను శాంతిపంజేసేందుకు గల్ఫ్​ దేశాలను భారత ప్రభుత్వం బుజ్జిగిస్తున్నప్పటికీ.. ఈ వివాదం పశ్చిమాసియాలో రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. నుపుర్​ శర్మ వల్ల ఇప్పుడు గల్ఫ్​ దేశాలు- భారత్​ మధ్య బంధం బలహీనపడే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే భారత్​కు బిలియన్​ డాలర్ల నష్టం తప్పదు!

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

వాణిజ్యం..

గల్ఫ్​ ప్రాంతంలోని అనేక దేశాలతో వాణిజ్యపరమైన బంధం భారత్​కు ఉంది. 2021-22 మధ్యకాలంలో 189బిలియన్​ డాలర్ల విలువైన వాణిజ్య బంధాన్ని ఇండియా నమోదు చేసింది. ఇందులోని 18.3శాతం.. సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్​, బహ్రయిన్​, ఖతార్​, కువైట్​, ఇరాక్​ వంటి గల్ఫ్​ దేశాలకు చెందినదే కావడం గమనార్హం. ఆయా దేశాలతో భారత ప్రభుత్వం.. దిగుమతులు, ఎగుమతుల విషయంలో చురుకుగా ఉంటుంది.

"ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితుల్లో.. ద్వైపాక్షిక బంధం అనేది కేవలం ఇరు దేశాల నేతల మధ్య ఉన్న మైత్రిపైనే ఆధారపడి ఉండదు. ప్రజల మనోభావాలు కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అరబ్​ దేశాల్లో రాజకీయాలు, మతం అనేది వేరువేరుగా ఉండవు. ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అందువల్ల ఇండియా జాగ్రత్తగా వ్యవహరించాలి," అని జేఎన్​యూకు చెందిన ప్రొఫెసర్​ బిశ్వజిత్​ ధార్​ అభిప్రాయపడ్డారు.

India Gulf relations : యూఏఈ, సౌదీ, ఖతార్​, ఇరాక్​, కువైట్​, ఒమన్​, బహ్రయిన్​లను గల్ఫ్​ దేశాలుగా సంబోధిస్తూ ఉంటారు. ఇరాక్​ మినహా.. ఇతర దేశాలు జీసీసీలో భాగంగా ఉన్నాయి.

2021-22లో జీసీసీ దేశాలతో 154.7బిలియన్​ డాలర్ల వాణిజ్యపరమైన లెక్కలను రికార్డు చేసింది భారత్​. 2020-21తో పోల్చుకుంటే ఇది 77శాతం ఎక్కువ! జీసీసీ దేశాలకు 43.9బిలియన్​ డాలర్ల ఎగుమతులు చేసింది ఇండియా. అదే కాకుండా.. భారత్​కున్న అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యుల్లో జీసీసీ దేశాలే ఎక్కువగా ఉన్నాయి. యూఏఈ, సౌదీ, ఇరాక్​లు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.

"గల్ఫ్​ దేశాలతో భారత్​ బంధం రెండు విషయాలతో ముడిపడి ఉంటుంది. చమురు, ఎగుమతులు. మన ప్రధాన భాగస్వాముల మనోభావాలను దెబ్బతినకుండా చూసుకోవాలి కదా," అని నిపుణులు అంటున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే యూఏఈతో ఎఫ్​టీఏ(ఫ్రీ ట్రేడ్​ అగ్రిమెంట్​)ను కుదుర్చుకుంది భారత ప్రభుత్వం. తద్వారా.. 97శాతం భారత ఉత్పత్తులు.. డ్యూటీ ట్యాక్సులు లేకుండానే యూఈఏలో ప్రవేశిస్తాయి. జీసీసీతో కూడా ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకోవాలని ఇండియా భావిస్తోంది. మరి ఈ సమయంలో నుపుర్​ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీయడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

ప్రవాస భారతీయులు..

గల్ఫ్​​ దేశాల్లో ప్రవాస భారతీయుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వారి వల్ల దేశంలోకి ప్రవహిస్తున్న నగదులో జీసీసీ(గల్ఫ్​ కోఆపరేషన్​ కౌన్సిల్​) దేశాల వాటా 55.6శాతం ఉంది. భారతీయ వలసదారుల్లో(ఎన్​ఆర్​ఐ, భారత సంతతి) ఎక్కువ శాతం అరబ్​ దేశాల్లోనే జీవిస్తున్నారు. విదేశాల్లో జీవిస్తున్న మొత్తం భారతీయుల్లో.. జీసీసీ దేశాల వాటా 27.7శాతం. ఈ జాబితాలో యూఏఈ టాప్​లో ఉంది. అక్కడ 3.4మిలియన్​ మంది భారతీయులు ఉంటున్నారు. సౌదీలో 2.6మిలియన్​, కువైట్​లో 1మిలియన్​ మంది నివాసముంటున్నారు.

India Gulf issue : అక్కడ పని చేసే భారతీయులు.. దేశంలోని కుటుంబసభ్యులకు తరచూ నగదు పంపిస్తూ ఉంటారు. దీనిని 'ఇన్​వర్డ్​ రెమిట్టెన్స్​' అంటారు. ఇందులో కూడా యూఏఈ టాప్​లో ఉంది. యూఏఈలో స్థిరపడిన భారతీయుల నుంచి ఒక్క 2017లోనే 13.8బిలియన్​ డాలర్ల నగదు దేశానికి చేరింది. సౌదీలో అది 11.2బిలియన్​ డాలర్లుగా ఉంది.

అయితే.. నుపుర్​ వ్యాఖ్యలతో వాణిజ్యపరమైన బంధం దెబ్బతినే అవకాశం ఉందని, కానీ ప్రవాస భారతీయులు పంపించే డబ్బులో మార్పులు ఉండకపోవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆ ప్రాంతాల్లో జీవిస్తున్న భారతీయులు.. అక్కడి ప్రజలతో మంచి బంధాన్ని కలిగి ఉండటం.. ఈ సమయంలో సానుకూలంగా మారుతుందని ఆశిస్తున్నారు.

ఏంటి ఈ వివాదం?

Nupur Sharma comment on Muhammad : గత శుక్రావారం.. ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పూర్​లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. మసీదులో శుక్రవారం ప్రార్థనల అనంతరం జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కాగా.. దేశంలో మతపరమైన ఘర్షణలు ఇటీవల ఆందోళనకర రీతిలో పెరిగిపోయాయి. ఇండియాలో పరిస్థితులు, మైనారటీల సమస్యలపై ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

ఈ సమయంలోనే.. బీజేపీకి చెందిన నుపుర్​.. ముస్లింలపై అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేయడంపై ఇప్పుడు సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. గత ఆదివారం ఓ టీవీ డిబేట్​లో పాల్గొన్న నుపుర్​ శర్మ.. మహమ్మద్​ ప్రవక్తపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి, ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు ఉన్నాయి.

గల్ఫ్​ దేశాలు ఫైర్​..

బీజేపీ నేతల వ్యాఖ్యలపై నిరసనలు భగ్గుమన్నాయి. దేశంలోని విపక్షాలతో పాటు గల్ఫ్​ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేసి.. బీజేపీ నేతల వ్యవహారాన్ని తప్పుబట్టాయి. నుపుర్​ శర్మ వ్యాఖ్యలు.. కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపించిన సౌదీ అరేబియా.. అన్ని మతాలను, నమ్మకాలను గౌరవించాలని హితవు పలికింది. ఖతార్​, కువైట్​, ఇరాన్​ దేశాలు.. భారత రాయబారులకు సమన్లు జారీ చేసి.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశించాయి. అంతేకాకుండా.. గల్ఫ్​ దేశాల్లో భారత వస్తువులపై నిషేధం విధించాలని డిమాండ్లు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. గల్ఫ్​తో వాణిజ్యపరమైన బంధాన్ని పెంచుకునే దిశగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ఖతార్​లో పర్యటిస్తున్న వేళ ఈ ఘటన జరగడం ఇప్పుడు భారత అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.

'బీజేపీ నేతల వ్యాఖ్యలు వ్యక్తిగతం. ఆ మాటలతో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడ అన్ని మతాల వారు కలిసి జీవిస్తున్నారు. ప్రభుత్వం అందుకు కృషి చేస్తోంది,' అని ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది కేంద్రం. దీనితో పాటు గల్ఫ్​ దేశాలను బుజ్జగించేందుకు దౌత్యవేత్తలను కేంద్రం పంపించినట్టు తెలుస్తోంది. కానీ గల్ఫ్​ దేశాలు మాత్రం తమ అలకను మానుకోవడం లేదని తెలుస్తోంది.

తదుపరి వ్యాసం