Palle Patnam Pulao : పల్లె పట్నం పులావ్.. తింటే ఆహా ఏమి రుచి అంటారు
21 April 2023, 13:30 IST
- Palle Patnam Pulao : కొంతమందికి పులావ్ అంటే చాలా ఇష్టం. చాలా రకాలుగా తయారు చేసుకుని తింటారు. కొత్తగా పల్లె పట్నం పులావ్ గురించి తెలుసుకుందాం..
పల్లె పట్నం పులావ్
చాలామందికి హోటల్ భోజనాలు పడవు. ఇంట్లోనే వంట చేస్తారు, అదే బాక్స్‌కి కూడా తీసుకెళ్తారు. బ్యాచిలర్‌లకు గంటలు గంటలు వంట చేసే సహనం ఉండదు. సమయం కూడా ఉండదు. అందుకోసమే.. సులభంగా తయారు చేయగల రెసిపీలు చూసుకోవాలి. అందులో పులావ్ కూడా ఒకటి. ఈ రెసిపీ చేయడానికి పెద్దగా సమస్య ఉండదు. తయారు చేయడం సులభం, రుచి చాలా బాగుంటుంది. అయితే కొత్తగా పల్లె పట్నం పులావ్ గురించి చెబుతున్నారు ప్లాట్ ఫామ్ 65 చెఫ్ వీహెచ్ సురేశ్. దానీ తయారీ విధానమేంటో చూద్దాం..
తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
అర కేజీ చికెన్, ఉల్లిపాయలు-100 గ్రాములు, టమోటా - 50 గ్రాములు, పచ్చి మిర్చి - 20 గ్రాములు, పెరుగు - 100 గ్రాములు, గరం మసాలాల మిశ్రమం- 15 గ్రాములు, ఆయిల్ - 20 మిల్లీ గ్రాములు, అల్లం వెల్లుల్లీ మిశ్రమం - 150 గ్రాములు, బాసుమతి బియ్యం- 500 గ్రాములు, నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, గరం మసాల- 20 గ్రాములు, బిర్యానీ ఆకు పొడి - 10 గ్రాములు, మట్టి కుండ- 01, ఉడకబెట్టిన గుడ్లు - 2, నెయ్యి- 50 గ్రాములు, కారం పొడి - 20 గ్రాములు, జీరా పొడి - 20గ్రాములు, అరటి ఆకు - 1
తయారు చేసే విధానం :
Step 1 : ముందుగా అన్ని మసాలా పదార్థాలను తీసుకొని ఒక పౌడర్ గా సిద్ధం చేయండి.
Step 2: తర్వాత చికెన్, పెరుగు తీసుకుని మసాలా మిశ్రమం కలిపి అరగంట పాటు మ్యారినేట్ చేయండి.
Step 3: ఇప్పుడు, ఒక మీడియం సైజు మట్టి కుండ తీసుకోండి. నూనె, తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
Step 4: కుండలో మ్యారినేట్ చికెన్ వేసి, ఉడికించాలి.
Step 5: సరిపడా నీరు ను పోసి ఉడికించాలి
Step 6: ఇలా ఉండికించిన చికెన్ కు బాస్మతి రైస్ వేయాలి.
Step 7: బియ్యం 80 శాతం వరకు ఉడికిన తర్వాత దానిపై ఉడికించిన గుడ్లు ఉంచాలి. తర్వాత అరటి ఆకును పైన ఉంచి మూత పెట్టాలి.
Step 8 : చిన్న మంటలో అన్నం ఉడికించి, 10 నిమిషాల తరువాత పూర్తిగా ఆపేయాలి.
Step 9 : ఉల్లిపాయలు, నెయ్యి, పెరుగు రైతాతో వేడి వేడి పల్లె పట్నం పులావ్ ను సర్వ్ చేసుకుని తినొచ్చు.