తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gulab Jamun With Rava: ఉప్మా రవ్వతో ఇలా గులాబ్ జామ్ చేసేయండి, మృదువుగా టేస్టీగా వస్తాయి

Gulab jamun with Rava: ఉప్మా రవ్వతో ఇలా గులాబ్ జామ్ చేసేయండి, మృదువుగా టేస్టీగా వస్తాయి

Haritha Chappa HT Telugu

10 May 2024, 15:30 IST

    • Gulab jamun with Rava: బయట దొరికే గులాబ్ జామ్ మిక్స్‌ల్లో మైదానే ఎక్కువగా ఉంటుంది. మైదా ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఉప్మా రవ్వతో గులాబ్ జామున్ చేయడం తెలుసుకోండి. రెసిపీ ఇదిగో.
గులాబ్ జామూన్ రెసిపీ
గులాబ్ జామూన్ రెసిపీ (Pixabay)

గులాబ్ జామూన్ రెసిపీ

Gulab jamun with Rava: గులాబ్ జామ్ పేరు చెప్తేనే నోరూరిపోతుంది. బయట దొరికే గులాబ్ జామున్ మిక్సులు మైదాతో తయారు చేసినవి. మైదా ఆరోగ్యానికి హానికరం. గులాబ్ జాములు తినాలంటే మైదా వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతో కూడా తీయతీయని మృదువైన గులాబ్ జాములు తయారు చేసుకోవచ్చు. దీన్ని చేయడం చాలా సులువు కూడా. ఉప్మా రవ్వతో గులాబ్ జామూన్‌లు ఎలా చేయాలో రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

గులాబ్ జామున్ రెసిపీకి కావలసిన పదార్థాలు

ఉప్మా రవ్వ - రెండున్నర కప్పులు

పాలు - ఒక కప్పు

నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

చక్కెర - రెండు కప్పులు

యాలకుల పొడి - ఒక స్పూను

నెయ్యి - మూడు స్పూన్లు

గులాబ్ జామున్ రెసిపీ

1. మైదాకు బదులుగా ఉప్మా రవ్వతో గులాబ్ జామున్ ను సులువుగా చేసేయొచ్చు. ఉప్మా రవ్వతో చేసిన గులాబ్ జామ్ ఆరోగ్యానికి మంచిది కూడా.

2. మైదాతో చేసిన గులాబ్ జామ్ తినడం వల్ల మైదా, పంచదార రెండూ శరీరంలో చేరి అనారోగ్యాలను కలుగజేస్తాయి.

3. రవ్వతో గులాబ్ జామ్ ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి చక్కెరను వేయాలి.

4. నీరు పోసి పంచదార సిరప్ వచ్చేవరకు కలపాలి.

5. అందులోనే అర స్పూను యాలకుల పొడి, ఒక స్పూను పాలు వేసి స్టవ్ కట్టేయాలి.

6. ఈ మొత్తం మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.

7. ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేయాలి.

8. చిన్న మంట మీద ఉంచి ఆ నెయ్యిలో ఉప్మా రవ్వను వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.

9. అందులోనే పాలు, యాలకుల పొడి, పంచదార వేసి చిన్న మంట మీద కలుపుకోవాలి.

10. ఈ మొత్తం మిశ్రమం హల్వా లాగా దగ్గరగా అవుతుంది.

11. అలా అయ్యేవరకు స్టవ్ మీదే ఉంచాలి.

12. తర్వాత స్టవ్ కట్టేసి ఆ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి.

13. ఇప్పుడు అరచేతికి కాస్త నూనె రాసుకొని రవ్వ ముద్దను తీసి చిన్న చిన్న బాల్స్ లా చుట్టుకోవాలి.

14. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.

15. ఆ నూనె బాగా వేడెక్కాక రవ్వతో చేసిన బాల్స్ ను అందులో వేసి గోల్డెన్ రంగులోకి వచ్చేవరకు వేయించాలి.

16. తర్వాత వాటిని తీసి ముందుగా సిద్ధం చేసుకున్న చక్కెర సిరప్ లో వేయాలి.

17. ఒక అరగంట పాటు ఆ గులాబ్ జాములను చక్కెర సిరప్ లోనే వదిలేయాలి.

18. సిరప్ ను పీల్చుకొని అవి మెత్తగా మృదువుగా తీపిగా అవుతాయి. ఈ మొత్తం మిశ్రమంలో కాస్త నెయ్యిని కూడా వేసుకుంటే ఘుమఘుమలాడుతుంది.

పిల్లలకు ఈ రవ్వ గులాబ్ జామ్ చాలా నచ్చుతుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మైదాతో చేసిన గులాబ్ జామున్‌లతో పోలిస్తే రవ్వతో చేసిన గులాబ్ జామూన్ ఆరోగ్యానికి మంచిది. ఇందులో చక్కెరను వాడాం కాబట్టి ఎంతో కొంత శరీరానికి హాని జరుగుతుంది. కానీ మైదాతో చేసిన గులాబ్ జామూన్ లతో పోలిస్తే ఆ హాని చాలా తక్కువే అని చెప్పాలి.

టాపిక్

తదుపరి వ్యాసం