తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Loksabha Polls 2024 : ప్రతిసారీ మోసం చేస్తున్నారు, ఈసారి మేం ఓటేయం..! భద్రాద్రి జిల్లాలో ఫ్లెక్సీ , రంగంలోకి అధికారులు

Loksabha Polls 2024 : ప్రతిసారీ మోసం చేస్తున్నారు, ఈసారి మేం ఓటేయం..! భద్రాద్రి జిల్లాలో ఫ్లెక్సీ , రంగంలోకి అధికారులు

HT Telugu Desk HT Telugu

09 May 2024, 18:13 IST

    • Loksabha Elections in Telangana 2024:
భద్రాద్రి జిల్లా గరిమెళ్లపాడులో ఫ్లెక్సి కలకలం..!
భద్రాద్రి జిల్లా గరిమెళ్లపాడులో ఫ్లెక్సి కలకలం..!

భద్రాద్రి జిల్లా గరిమెళ్లపాడులో ఫ్లెక్సి కలకలం..!

Bhadradri Kothagudem :  "ఆదివాసీలమైన మమ్మల్ని ప్రభుత్వం/అధికారులు ప్రతి సారీ మోసం చేస్తున్నారు.. అందుకే దేవుడి తోడు.. ఈసారి కచ్చితంగా ఓటు వేయం - గరిమెళ్ళ పాడు ప్రజానీకం, చుంచుపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.." ఆ ఆదివాసీ గ్రామ శివారు ప్రాంతంలో తెల్లవారేసరికి వెలసిన ఫ్లెక్సీ ఇది. 

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha elections : 'అబ్​ కీ బార్​ 400 పార్​'- బిహార్​ డిసైడ్​ చేస్తుంది..!

TG Graduate MLC Election 2024 : బీఆర్ఎస్ లో 'ఎమ్మెల్సీ' ఎన్నికల కుంపటి - తలో దారిలో నేతలు..!

Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యక్షమైన ఈ ఫ్లెక్సీ కలకలం రేపింది. క్షణాల్లోనే ఈ సమాచారం ఆనోటా ఈనోటా పడి దావానలంలా వ్యాపించింది. అధికారుల దృష్టికి వెళ్లడంతో ఒక్కసారిగా ఖంగు తిని హుటాహుటిన ఆ పల్లె బాట పట్టారు. అధికారులు వచ్చేసరికి ఒకేతాటిపైకి వచ్చిన గ్రామస్తులంతా మూకుమ్మడిగా తమ గోడును వెళ్లబోసుకున్నారు.

ఉపాధి మార్గమేదీ..?

ఆదివాసీ గిరిజనులమైన తమకు గ్రామంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని గ్రామస్తులు మూకుమ్మడిగా అధికారుల ఎదుట వాపోయారు. ఆదివాసీ పల్లెలో నెలకొన్న సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కరించడం లేదని తెలిపారు. కనీసం తమకు ఉపాధి మార్గాలు కూడా కల్పించడం లేదని వివరించారు. అందుకే మేము ఓటును బహిష్కరిస్తామని బ్యానర్లు కట్టామని చెప్పారు. గడిచిన ఐదేళ్ల కిందట జరిగిన ఎన్నికల సమయంలోనూ నాయకులు తమ దగ్గరికి వచ్చి ఓట్లు అభ్యర్ధించారని, ఆ సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని విన్నవించారు. 

ఆదివాసి గిరిజనులకు, అధికారులకు నడుమ కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఆదివాసీ గిరిజనుల సమస్యలను అటు ప్రభుత్వం కానీ, ఇటు అధికారులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. మా ఆవేదనను అధికారులకు తెలియజేసేందుకే ఓటును బహిష్కరిస్తున్నామని బ్యానర్లు కట్టామన్నారు. అంతే తప్ప రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తాము తిరస్కరించడం లేదని చెప్పారు.

సమస్యలు తీరుతాయి.. ఓటేయ్యండి..

 అధికారులు ఆ ఆదివాసీ గిరిజనులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యతపై వారికి అర్ధమయ్యే రీతిలో కొత్తగూడెం డిఎస్పి, ఆర్డీవో, సీఐ, ఎంఆర్ఓ, ఎంపీడీవోలు మాట్లాడారు. అధికారుల మాటలను విశ్వసించిన గిరిజనులు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తాము వినియోగించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల తర్వాత అయినా తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని అధికారులను కోరారు.

గరిమెళ్ళపాడు నర్సరీలో నిత్యం పనులు ఉండేలా ఉపాధి కల్పించాలని, ఐటీడీఏలో ఉన్న భూములు తమ తాత తండ్రులవని అయినా ఆ భూములపై హక్కులను కోరడం లేదని స్పష్టం చేశారు. భూమి లేకపోయినా కనీసం ఉపాధి దొరికితే చాలని వేడుకున్నారు. గతంలో మేము చేసిన ఉపాధి హామీ పనులకు సంబంధించి పెద్ద ఎత్తున సొమ్ము బకాయి పడిందని చెప్పారు. తమకు రావాల్సిన బకాయిల గురించి గతంలో ఉన్న ఐటీడీఏ పీవో దివ్య, అప్పటి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులకు నివేదించినా మాకు రావాల్సిన కోట్ల రూపాయల కూలీ డబ్బులు ఇంతవరకూ రాలేదని మొర పెట్టుకున్నారు. ఇది మా ప్రధాన సమస్య కాగా బకాయి డబ్బులు ఇప్పించే నాయకుడు గానీ అధికారులు గానీ లేరని దుయ్యబట్టారు. 

ఐటీడీఏ నర్సరీలో గిరిజనులకు మాత్రమే టెండర్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పుడు నాన్ ట్రైబ్ ఇచ్చిన టెండర్లను రద్దు చేయాలని సదరు టెండర్లు తమకు ఇస్తే గిరిజనులందరం కలిసి ఉపాధిని పొందుతామని చెప్పారు. 100 రోజుల ఉపాధి హామీ పథకం తమ కడుపును నింపటం లేదని ఆవేదన వెలిబుచ్చారు. నర్సరీ పనులు మాత్రమే చేసే తాము కడియం కు వలస పోకుండా ఇక్కడే ఉపాధిని కల్పించాలని కోరారు. అంతేకాకుండా ఆదివాసీలమైన తాము వేసుకున్న గుడిసెలకు ఇంటి నెంబర్లు కేటాయించాలని, ఈ ప్రజా ప్రభుత్వంలో తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులకు తెలిపారు.

హామీలకు ఇది సమయం కాదు..

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాము ఎలాంటి హామీలకు ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఓటు రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కని తప్పనిసరిగా వేయాలని చెప్పారు. 

ఎన్నికల్లో మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవచ్చని, మీకు ఎవరూ నచ్చని పక్షంలో "నోటా"ను ఉపయోగించుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఎలక్షన్ల అనంతరం మీ సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకు వచ్చినట్లయితే పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని వివరించారు. దీంతో ఓట్ల బహిష్కరణ నిర్ణయాన్ని ఆదివాసీ గిరిజనులు వెనక్కి తీసుకున్నారు. తప్పకుండా ఓటు వేస్తామని అధికారులకు హామీ ఇచ్చారు. ఓటు బహిష్కరణ స్థితికి వచ్చిన ఈ గరిమెళ్ళపాడు గిరిజన సమస్యలపై రానున్న రోజుల్లో పాలకులు, అధికారులు ఏ మేరకు పరిష్కార మార్గాలు చూపుతారో వేచి చూడాల్సిందే.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

తదుపరి వ్యాసం