Kishan Reddy : తెలంగాణలో కొత్తగా 17 ఏకలవ్య పాఠశాలలు, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు- కిషన్ రెడ్డి
Kishan Reddy : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ములుగు జిల్లాలో రూ.900 కోట్ల వ్యయంతో గిరిజన యునివర్సిటీ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.
Kishan Reddy : రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బుధవారం ఆయన మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కిషన్ రెడ్డి హామీనిచ్చారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. సమ్మక్క సారలమ్మ దేవతలు వెలిసిన ములుగు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ రూ.900 కోట్లతో గిరిజన విశ్వవిద్యాలయం ప్రకటించడం ఎంతో సంతోషమన్నారు. అందుకు ప్రధాని మోదీకి తాను హృదయపూర్వంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
రూ.25 కోట్లతో ట్రైబల్ మెమోరియల్ మ్యూజియం
గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జాతి నిర్మాణంలో ఆదివాసీల త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోయేలా కేంద్రప్రభుత్వం భరోసా ఇస్తుందన్నారు. హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.25 కోట్లతో ట్రైబల్ మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నామని, అలాగే రూ.6.5 కోట్లతో నిర్మించిన గిరిజన పరిశోధనా కేంద్రాన్ని అతి త్వరలో ప్రారంభించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లాలోని రుద్రేశ్వర (రామప్ప) ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా ప్రధాని ప్రత్యేక చొరవ తీసుకున్నారని గుర్తుచేశారు.
రూ.420 కోట్లతో 17 నూతన ఏకలవ్య పాఠశాలలు
తెలంగాణలో రూ.420 కోట్లతో 17 కొత్త ‘ఏకలవ్య’ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాలను ఆకాంక్ష జిల్లాలుగా గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమం కింద భూపాలపల్లి, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కేంద్ర ప్రభుత్వంరూ.37 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. స్వదేశ్ దర్శన్ కింద రూ.80 కోట్లతో ములుగు-లక్నవరం-తాడ్వాయి-దామరవాయి-బొగత జలపాతాల సర్క్యూట్‌ను అభివృద్ధి చేసినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. సోమశిల, సింగోటం, కదలివనం, అక్కమహాదేవి, ఈగలపెంట, ఫరహాబాద్, ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం ఎకో సర్క్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు మరో రూ.92 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.