తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Khammam Congress: ఖమ్మం కాంగ్రెస్‌లో వర్గ పోరు.. రేణుక, భట్టి వర్గీయుల మధ్య వాగ్వాదం..

Khammam Congress: ఖమ్మం కాంగ్రెస్‌లో వర్గ పోరు.. రేణుక, భట్టి వర్గీయుల మధ్య వాగ్వాదం..

HT Telugu Desk HT Telugu

01 May 2024, 7:04 IST

    • Khammam Congress:ఖమ్మం కాంగ్రెస్ లో వర్గ పోరు బట్టబయలైంది.  రేణుకా చౌదరి, మంత్రి భట్టి విక్రమార్క వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 
ఖమ్మంలో కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం
ఖమ్మంలో కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం

ఖమ్మంలో కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం

Khammam Congress: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం తర్వాత వర్గపోరు బట్ట బయలైంది. వర్గాలకు వేదికగా చెప్పుకునే కాంగ్రెస్ లో అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి కట్టుగా పని చేసినట్లు కనిపించినప్పటికీ పార్లమెంటు ఎన్నికల వేళ వర్గ పోరు బహిర్గతమైంది.

కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం మాజీ ఎంపీ రేణుక చౌదరి వ్యాఖ్యలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క Bhatti vikramarka వర్గీయులు ఆగ్రహం చెందడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేస్తున్న రామసహాయం రఘురామ్ రెడ్డి Raghuram Reddy గెలుపును కాంక్షిస్తూ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన క్షేత్ర స్థాయి నాయకుల సన్నాహక సమావేశం రసాభాసగా మారింది.

ఈ సమావేశానికి మండల స్థాయి అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర నాయకులు హాజరయ్యారు. సమావేశంలో రేణుకా చౌదరి మాట్లాడుతూ "ఇలాంటి కీలక సమావేశాలకు మండల స్థాయి నాయకుల హాజరు తగ్గింది.. పదవులు కావాలి కానీ సమావేశాలకు హాజరు రారా..?" అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఆమె మాటలకు తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గీయులు ఎదురుదాడికి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేమంతా కలిసికట్టుగా కష్టపడిన ఫలితంగానే రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని రేణుకపై మాటల దాడికి దిగారు. ఆమె తన మాటలను వెనక్కి తీసుకోవాలని పట్టు పట్టారు. దీంతో రేణుక వర్గీయులు సైతం కలుగజేసుకుని పరస్పరం వాదనకు దిగారు. దీంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

సర్ది చెప్పిన మంత్రులు..

జిల్లా పార్టీ కార్యాలయం వేదికగా ముగ్గురు మంత్రుల ముందే ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ల సమక్షంలో జరిగిన కార్యకర్తల వాదన తారాస్థాయికి చేరుతుందన్న దశలో స్వయంగా భట్టి జోక్యం చేసుకుని వారిని వారించే ప్రయత్నం చేశారు.

పొంగులేటి, తుమ్మల కూడా సర్ది చెప్పడంతో కార్యకర్తలు చల్లబడ్డారు. భట్టి, రేణుకా చౌదరి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్నారు. గతంలో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే సందర్భాలు అనేకం చోటు చేసుకున్నాయి.

రేణుకకు రాజ్యసభ నుంచి కేటాయింపు జరగడం వల్ల ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడంతో ఇద్దరు ఎదురు పడిన సందర్భాలు తక్కువగా ఉన్నాయి. తాజా పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి విజయం కోసం రేణుక ప్రచారంలో పాల్గొంటున్న నేపథ్యంలో మరోసారి వర్గ పోరు బట్టబయలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్తబ్దుగా ఉన్న ఈ పోరు పార్లమెంట్ ఎన్నికల వేళ బయట పడటంతో చర్చనీయాంశంగా మారింది.

(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రతినిధి.)

తదుపరి వ్యాసం