Hyderabad Parliament : హైదరాబాద్ లో ట్రయాంగిల్ పోరు, ఇంకా సైలెంట్ మోడ్ లోనే కాంగ్రెస్
Hyderabad Parliament : హైదరాబాద్ లోక్ సభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మజ్లిస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం నామ మాత్రంగా ప్రచారం చేస్తుంది.
Hyderabad Parliament : లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో అభ్యర్థుల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. విమర్శలకు ప్రతి విమర్శలు, సవాళ్లకు ప్రతి సవాళ్లతో ఎన్నికల ప్రచారం(Election Campaign) మరింత వేడెక్కుతుంది. అయితే ఈ పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad)పార్లమెంట్ స్థానంలో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా హైదరాబాద్ సెగ్మెంట్ లో మజ్లిస్(MIM) డామినేషన్ ఏళ్లుగా కొనసాగుతుంది. కాగా ఎన్నికల సమయంలో ప్రతిసారీ ఇక్కడ ఎంఐఎం పార్టీ ఎలాంటి అభివృద్ది చేయలేదని, హైదరాబాద్ లో అనేక సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయని, మజ్లిస్ పార్టీకి ఓట్లు వేసినంత కాలం ఈ సమస్యలు ఈ ప్రాంత ప్రజలను ఇలానే పిడుస్తాయని ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపిస్తుంటారు. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్థులు గతానికి భిన్నంగా ప్రచారం చేస్తున్నారట. ఓ వైపు మజ్లిస్ పార్టీ పై విమర్శలు చేస్తునే.. మరోవైపు తాము గెలిస్తే హైదరాబాద్ ను ఏ విధంగా అభివృద్ధి చేస్తామో ప్రజలకు వివరిస్తున్నారట.
దూకుడుగా బీఆర్ఎస్ అభ్యర్థి
బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో దిగిన గడ్డం శ్రీనివాస్ యాదవ్(Gaddam Srinivas yadav), గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi)ని కలిసి తనకు గోషామహల్ టికెట్ వచ్చేలా చూడాలని గడ్డం శ్రీనివాస్ యాదవ్ వేడుకున్నారని అప్పట్లో జోరుగా ప్రచారం జరగింది. అసదుద్దీన్, గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఫొటోలు కూడా సామాజిక మధ్యమాల్లో ఆ మధ్య చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు అవన్నీ మరిచి శ్రీనివాస్ యాదవ్ అసదుద్దీన్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..... అసదుద్దీన్ ను బంగాళా ఖాతంలో పడేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు హైదరాబాద్(Hyderabad) ప్రాంతాన్ని శాసించిన మజ్లిస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఇటు బీజేపీ అభ్యర్థి కొంపల్లి మాధవి లతా(Madhavi Latha)పై సైతం అదే స్థాయులో ఆరోపణలు చేశారు. మహమ్మారి కరోనా(Corona)తో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉంటే విరించి ఆస్పత్రి ప్రజల ప్రాణాలను పిండుకు తిందని, అలాంటి మాధవి లతా నీతి, ధర్మం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
సైలెంట్ మోడ్ లో కాంగ్రెస్
ఇటు మాధవి లతా కూడా మజ్లిస్ పార్టీ(Majlis), బీఆర్ఎస్(BRS) పార్టీలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. పాదయాత్రలతో ఆమె పాతబస్తీని చుట్టేస్తున్నారు. ఆశ్చర్యంగా ఇటు హిందువులతో పాటు అటు ముస్లిం ఓటర్లకు(Muslim Voters) కూడా దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ సెగ్మెంట్ లో ఇంకా సైలెంట్ మోడ్ లోనే ఉంది. ప్రత్యర్థులు కనీసం కాంగ్రెస్ పార్టీని ఇక్కడ పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదు. ఇప్పటి వరకైతే బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య మాత్రమే హోరాహోరీ పోటీ నడుస్తుందని చెప్పాలి. కాంగ్రెస్(Congress) పార్టీ అభ్యర్థిగా వలీహుళ సమీర్ పేరును అధిష్టానం ఖరారు చేసినప్పటికీ ఆయన మాత్రం ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. ఏది ఏమైనప్పటికీ హాట్ సెగ్మెంట్ గా మారిన హైదరాబాద్ లోక్ సభ స్థానంలో ఈసారి ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.
కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం