APSEA President: కడపలో ఎన్నికల ప్రచారం.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం వేటు..-kadapa election campaign secretariat employees union president venkatrami reddy suspended by ec ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Apsea President: కడపలో ఎన్నికల ప్రచారం.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం వేటు..

APSEA President: కడపలో ఎన్నికల ప్రచారం.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం వేటు..

Sarath chandra.B HT Telugu
Apr 19, 2024 07:14 AM IST

APSEA President: వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిపై ఈసీ ఆదేశాలతో పంచాయితీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ సస్పెన్షన్ వేటు వేసింది.

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసిన ఈసీ
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసిన ఈసీ

APSEA President: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని Venkatrami Reddy ఎన్నికల సంఘం సస్పెండ్ Suspension చేసింది. ఈసీ Election Commission ఆదేశాలతో పంచాయితీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్ కాలంలో హెడ్‌క్వాటర్స్‌ దాటి వెళ్లొద్దని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వెంకట్రామిరెడ్డి కడప జిల్లా బద్వేలులో YCP వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం Election Campaignలో నిర్వహించారు.. ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై వైకాపాకు ఓటు వేయాలని ప్రచారం చేశారని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కడప జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. వెంకట్రామిరెడ్డి పంచాయతీరాజ్‌ శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

అధికార పార్టీ నాయకుడి చలామణీ అవుతున్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు పడింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల కమిషన్‌ ఆదే‎శాలతో పంచాయితీరాజ్‌ శాఖ కార్యదర్శి సస్పెండ్ చేశారు.

వెంకట్రామిరెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్నారు.

మార్చి 31న ఉమ్మడి కడప జిల్లాలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, మరికొందరితో కలిసి వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డిపోల్లో వెంకట్రామిరెడ్డి ప్రచారం నిర్వహించారని , వైసీపీ తరపున కరపత్రాలు పంచారని ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంలో రవాణా శాఖకు చెందిన 10మంది ఉద్యోగులపై ఇప్పటికే వేటు పడింది. వెంకట్రామిరెడ్డిపై చర్యలకు టీడీపీ ఈసీని ఆశ్రయించింది.

ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, ఉద్యోగ సంఘం నాయకుడైనా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడినందుకు ఏపీ కాండక్ట్‌ రూల్స్‌-1964 ప్రకారం కూడా సస్పెన్షన్‌ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి వాస్తవానికి పంచాయతీరాజ్‌ శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌. ప్రస్తుతం ఇన్‌చార్జి అసిస్టెంట్‌ సెక్రటరీ పోస్టులో పనిచేస్తున్నారు.

మార్చి 31న ఆర్టీసీ సంఘాలతో కలిసి ఎన్నికల ప్రచారంపై ఫిర్యాదులు అందడంతో 11 మందిని ఆర్టీసీ యాజమాన్యం మార్చి 4న సస్పెండ్‌ చేసింది. వెంకట్రామిరెడ్డి వ్యవహారంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరించింది. వెంకట్రామిరెడ్డిని సస్పెండ్‌ చేయాలని ఎన్నికల సంఘం మార్చి 8వ తేదీన ఆదేశించింది. ఈ వ్యవహారంపై తాత్సరం చేసేందుకు మార్చి 13వ తేదీ వరకు జీఏడీలోని వివిధ స్థాయిల అధికారుల మధ్యే ఫైల్ నడిచింది.

మార్చి 14వ తేదీన సీఎస్‌ జవహర్‌రెడ్డి వద్దకు చేరినా 18వ తేదీ వరకు చర్యలు తీసుకోలేదు. గురువారం వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేయాలని పంచాయితీరాజ్ శాఖకు ఆదేశాలు అందడంతో ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌ సమయంలో వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ అనుమతి లేకుండా అమరావతి, గుంటూరు, విజయవాడ దాటి వెళ్లకూడదని ఆదేశించారు.

పంచాయితీరాజ్‌ శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డిపై గతంలో టీడీపీ ప్రభుత్వ హయంలో కూడా శాఖపరమైన చర్యలు తీసుకోలేరు. అప్పట్లో తనపై టీడీపీ కక్ష సాధింపుకు పాల్పడుతోందని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Whats_app_banner

సంబంధిత కథనం