తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Nehra On Team India: దక్షిణాఫ్రికాతో సిరీస్‍లకు అతడిని ఎంపిక చేయాల్సింది: నెహ్రా

Nehra on Team India: దక్షిణాఫ్రికాతో సిరీస్‍లకు అతడిని ఎంపిక చేయాల్సింది: నెహ్రా

02 December 2023, 16:16 IST

    • Nehra on Team India: దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్ల ఎంపికపై మాజీ స్టార్ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందించారు. ఈ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‍లకు ఓ ప్లేయర్‌ను తీసుకుంటారని తాను అనుకున్నానని అన్నాడు. ఆ వివరాలివే..
ఆశిష్ నెహ్రా
ఆశిష్ నెహ్రా

ఆశిష్ నెహ్రా

Nehra on Team India: ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియా తదుపరి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు (డిసెంబర్ 10 నుంచి), మూడు వన్డేలు (డిసెంబర్ 17 నుంచి), రెండు టెస్టుల (డిసెంబర్ 26 నుంచి) సిరీస్‍లను భారత్ ఆడనుంది. ఈ సిరీస్‍లకు ఇటీవలే భారత జట్లను ప్రకటించారు బీసీసీఐ సెలెక్టర్లు. మూడు సిరీస్‍లకు మూడు విభిన్నమైన జట్లను ఎంపిక చేశారు. కాగా, దక్షిణాఫ్రికా టూర్ కోసం ఎంపిక చేసిన టీమ్‍పై భారత మాజీ పేసర్ అశిష్ నెహ్రా తాజాగా స్పందించారు.

దక్షిణాఫ్రికా పర్యటనలో పరిమిత ఓవర్ల (టీ20, వన్డే) సిరీస్‍లకు జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చినా.. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరును టీమిండియా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అతడిని ఎంపిక చేయలేదు. ఈ విషయంపైనే నెహ్రా మాట్లాడాడు. దక్షిణాఫ్రికా టూర్‌లో పరమిత ఓవర్ల సిరీస్‍లకు భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.

“దక్షిణాఫ్రికాకు వెళుతున్నారు.. చాలా మంది ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేశారు.. ఆ సమయంలో నా మైండ్‍లోకి భువనేశ్వర్ కుమార్ పేరు గుర్తు వచ్చింది. అర్షదీప్, ముకేశ్ కుమార్ సహా మరికొన్ని కొత్త ఆప్షన్లు మీకు ఉన్నాయని తెలుసు. కానీ అనుభవం ఉన్న భువనేశ్వర్ కుమార్‌ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవాల్సింది” అని జియో సినిమా కార్యక్రమంలో నెహ్రా చెప్పారు.

పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం భువనేశ్వర్ కుమార్‌ను సెలెక్టర్లు మరువకూడదని, అతడు ఇంకా బాగా బౌలింగ్ చేస్తున్నాడని నెహ్రా అభిప్రాయపడ్డాడు. “భువనేశ్వర్ కుమార్ చాలా అనుభవజ్ఞుడు. అతడు ఇంకా మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. సెలెక్టర్లు అతడిపై ఓ కన్నేసి ఉంచాలి. ముఖ్యంగా టీ20లు, 50 ఓవర్ల ఫార్మాట్లలో అతడిని అసలు మరిచిపోకూడదు” అని నెహ్రా అన్నాడు.

భువనేశ్వర్ కుమార్ చివరగా టీమిండియా తరఫున 2022 నవంబర్‌లో న్యూజిలాండ్‍పై టీ20 ఆడాడు. భారత తరఫున ఇప్పటి వరకు భువశ్వర్ కుమార్.. 86 టీ20 మ్యాచ్‍ల్లో 90 వికెట్లు, 120 వన్డేల్లో 141 వికెట్లు, 21 టెస్టు మ్యాచ్‍ల్లో 63 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో శివమ్ మావీ, ఉమ్రన్ మాలిక్, హర్షల్ పటేల్ లాంటి యువ పేసర్లకు చోటిచ్చిన సెలెక్టర్లు.. భువీని పరిగణనలోకి తీసుకోలేదు. ఇటీవల జరిగిన దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో నాలుగు మ్యాచ్‍ల్లో 10 వికెట్లతో భువనేశ్వర్ రాణించాడు.

మరోవైపు, దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డేలు, టీ20లనుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకున్నారు. టెస్టు సిరీస్‍లో వారు ఆడనున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయనున్నారు.

తదుపరి వ్యాసం