iOS trojan virus : ఐఫోన్ యూజర్స్‌కి అలర్ట్! మీ బ్యాంక్ నుంచి డబ్బులు దోచేసే ప్రమాదకరమైన వైరస్..
17 February 2024, 12:00 IST
GoldPickaxe trojan virus : ఐఫోన్ యూజర్స్‌కి అలర్ట్! ఓ ప్రమాదకరమైన వైరస్.. ఇప్పుడు ఐఫోన్స్లోకి ప్రవేశించి, యూజర్ల బ్యాంక్‌లను ఖాళీ చేసేస్తోంది..
ఐఫోన్ యూజర్స్‌కి అలర్ట్! మీ బ్యాంక్ నుంచి డబ్బులు దోచేసే ప్రమాదకరమైన వైరస్..
iOS trojan virus : సెక్యూరిటీకి పెట్టింది పేరు యాపిల్ ప్రాడక్ట్స్. మరీ ముఖ్యంగా.. డేటా ప్రైవసీ, సెక్యూరిటీ కోసమే చాలా మంది ఐఫోన్స్‌ని కొంటూ ఉంటారు. అలాంటిది! ఓ ప్రమాదకరమైన వైరస్.. ఇప్పుడు ఐఫోన్ యూజర్స్‌కి షాక్ ఇస్తోంది. వారికి తెలియకుండానే, ఫోన్లోని ముఖ్యమైన డేటాను దొంగిలించి, బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులను దోచేస్తోంది. ఈ “గోల్డ్పికాక్స్ ట్రోజన్ వైరస్”తో అప్రమత్తంగా ఉండాలని టెక్ నిపుణులు.. ఐఫోన్ యూజర్స్‌కి అలర్ట్ ఇస్తున్నారు.
అసలేంటి ఈ గోల్డ్పికాక్స్ ట్రోజన్ వైరస్?
ట్రోజన్ వైరస్ అనేది ఓ హానికర సాఫ్ట్వేర్. ఇది ఎన్నో దశాబ్దాలుగా ఇబ్బంది పెడుతోంది. అయితే.. ఇప్పుడు, కేవలం ఐఫోన్స్నే టార్గెట్ చేస్తూ.. గోల్డ్పికాక్స్ ట్రోజన్ వైరస్ బయటకి వచ్చింది. ఇందులో అనేక అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండటం మరింత ఆందోళనకు గురిచేస్తున్న విషయం.
టెక్రాడార్ నివేదిక ప్రకారం.. ఈ గోల్డ్పికాక్స్ ట్రోజన్ వైరస్‌ని తొలిసారిగా గతేడాది అక్టోబర్‌లో గుర్తించారు. అనంతరం ఆ గోల్డ్పికాక్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ వచ్చింది. చివిరికి.. ఐఓఎస్ డివైజ్‌ల భద్రతకు ముప్పుగా మారింది. మరీ ముఖ్యంగా ఐఫోన్స్‌ని అది టార్గెట్ చేస్తోంది.
iPhone users security breach : ఈ కొత్త ట్రోజన్ వైరస్.. మన ఫోన్లోకి ప్రవేశించి, ఫేషియల్ రికగ్నీషన్ సమాచారం, ఐడెంటిటీ డాక్యుమెంట్స్, టెక్ట్స్ మెసేజ్‌లను స్కాన్ చేస్తోందట. వాటిల్లో బ్యాంకింగ్ సమాచారాలు దొరికితే.. అకౌంట్స్‌ని ఖాళీ చేసేస్తోందట!
బయోమెట్రిక్ డేటా దొరికితే.. ఏఐ ఆధారిత డీప్‌ఫేక్స్ చేయడం నుంచి ఆథరైజ్ లేకుండా బ్యాంక్ అకౌంట్స్‌కి యాక్సెస్ పొందడటం వరకు.. అన్ని ప్రమాదాలు ఉన్నాయి. ప్రస్తుతానికి.. ఈ తరహా కేసులు వియత్నాం, థాయ్‌లాండ్‌లో కనిపిస్తున్నాయి. కానీ రానున్న రోజుల్లో.. ఈ గోల్డ్పికాక్స్ ట్రోజన్ వైరస్‌కి ఇంగ్లీష్ స్పీకింగ్ దేశాలకు కూడా పాకొచ్చని నివేదికలు చెబుతున్నాయి.
GoldPickaxe virus news : అసలు ఈ గోల్డ్పికాక్స్ వైరస్.. ఐఓఎస్ డివైజ్‌లోకి ఎలా వెళ్లగలుగుతోంది? అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. సాధారణంగా.. ఆండ్రాయిడ్ డివైజ్‌లలో.. లింకస్, యాప్స్, ఇతర మార్గాల ద్వారా వైరస్లు ఫోన్స్‌లోకి వెళ్లడం సులభమే. కానీ ఐఓఎస్ డివైజ్‌లలో అది చాలా కష్టమైన విషయం. దానిని ఛేదించుకుని కూడా వెళుతోందంటే.. ఈ వైరస్ ఎంత శక్తివతమైనదో అర్థం చేసుకోవచ్చు. యాపిల్ మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ ప్లాట్‌ఫామ్ అయిన టెస్ట్ఫ్లైట్ని.. హ్యాకర్లు హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి గోల్డ్పికాక్స్ని వ్యాప్తి చేసినట్టు సమాచారం.
ఇలా చేసి జాగ్రత్తపడండి..
ఈ వార్త ఐఫోన్ యూజర్స్‌కి కాస్త ఇబ్బందికరమైనదే! అందుకే ఐఫోన్ వాడే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప.. టెస్ట్‌ఫ్లైట్ నుంచి యాప్స్‌ని ఇన్స్టాల్ చేసుకోవద్దని చెబుతున్నారు. మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ ప్రొఫైల్స్‌కి కూడా దూరంగా ఉండాలని అంటున్నారు. యూఎస్బీ ద్వారా మాక్కి కనెక్ట్ చేస్తుంటే.. మాల్వేర్ స్కానింగ్ సెటప్‌ని రన్ చేయాలని స్పష్టం చేస్తున్నారు. లాక్డౌన్ మోడ్‌ని ఆన్ చేసి, యాపిల్ స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్‌ని యాడ్ చేస్తే.. భద్రత పెరుగుతుందని సూచిస్తున్నారు.