తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... జనవరి 15 నుంచి సుప్రభాత సేవ పునఃప్రారంభం

Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... జనవరి 15 నుంచి సుప్రభాత సేవ పునఃప్రారంభం

12 January 2024, 17:54 IST

google News
    • Tirumala Tirupati Devasthanams Updates: సుప్రభాత సేవకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది టీటీడీ. జనవరి 15 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభమవుతుందని ప్రకటించింది.
తిరుమల
తిరుమల

తిరుమల

Tirumala Tirupati Devasthanam Updates: జనవరి 15 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం అవుతుందని తిరుమల తిరుపది దేవస్థానం ప్రకటించింది. పవిత్రమైన ధనుర్మాసం జ‌న‌వ‌రి 14వ తేదీ ఆదివారం ముగియనుండడంతో జ‌న‌వ‌రి 15వ తేదీ సోమ‌వారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుందని వెల్లడించింది.

గత ఏడాది డిసెంబరు 17వ తేదీ తెల్ల‌వారుజామున 12.34 గంట‌ల‌కు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికానుండ‌టంతో… జనవరి 15వ తేదీ నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.

జనవరి 16వ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో వెల్లడించింది.

జ‌న‌వ‌రి 14న భోగితేరు, 15న మకరసంక్రాంతి

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో జనవరి 14న భోగితేరు, జ‌న‌వ‌రి 15న మకరసంక్రాంతి ప‌ర్వ‌దినాలు జరుగనున్నాయి.

జనవరి 14న భోగి పండుగ రోజున సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహిస్తారు. జనవరి 15న మకర సంక్రాంతి సంద‌‌ర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం చేపడతారు. ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఆల‌యం నుండి చ‌క్ర‌త్తాళ్వార్‌ను ఊరేగింపుగా క‌పిల‌తీర్థంలోని శ్రీ ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. అక్క‌డ చ‌క్ర‌స్నానం అనంత‌రం ఆస్థానం చేప‌డ‌తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజస్వామివారు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.

జనవరి 16న ఉద‌యం శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి మేల్‌ఛాట్ వ‌స్త్రం, పూల‌మాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మ‌వారికి స‌మ‌ర్పిస్తారు. శ్రీ ఆండాళ్ అమ్మ‌వారిని క‌పిల‌తీర్థంలోని శ్రీ ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. అక్క‌డ ఏకాంతంగా తిరుమంజ‌నం అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకుంటారు. ఆల‌యంలో సాయంత్రం 4 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ గోదాక‌ల్యాణం వేడుకగా నిర్వ‌హిస్తారు.

అదేవిధంగా, జ‌న‌వ‌రి 17న పార్వేట ఉత్స‌వం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యం నుండి రేణిగుంట రోడ్డులోని పార్వేట‌మండ‌పానికి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని వేంచేపు చేస్తారు. అక్క‌డ ఆస్థానం అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకుంటారు.

ఎస్వీ గోశాల‌లో క‌నుమ గోపూజ‌

సంక్రాంతి క‌నుమ పండుగ‌ను పుర‌స్క‌రించుకుని జ‌న‌వ‌రి 16వ తేదీ మంగ‌ళ‌వారం తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో గోపూజ‌ ఘనంగా జ‌రుగ‌నుంది. ఇందుకోసం ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, శ్రీ వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గ‌జ‌పూజ‌, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహిస్తారు. అనంత‌రం హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో సంక్రాంతి హ‌రిదాసులు, బ‌స‌వ‌న్న‌ల నృత్య కార్య‌క్ర‌మం ఉంటుంది. ఆ త‌రువాత‌ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుండి శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.

తదుపరి వ్యాసం