YS Sharmila: ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు వద్దా..? KCRపై షర్మిల ఫైర్
YS Sharmila Fires On KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల మరోసారి మండిపడ్డారు. కేసీఆర్ కు రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు మాత్రం పట్టించుకోరు అంటూ విమర్శించారు.
YS Sharmila Latest News:గత కొంతకాలంగా బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు వైఎస్ షర్మిల. ఇప్పటికే పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లిన ఆమె... అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఓ రేంజ్ లోనే ఆరోపణలు చేశారు. సందర్భాన్ని బట్టి సీఎం కేసీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈక్రమంలో వారికి భరోసా ఇచ్చేందుకు పంట పరిశీలనకు కూడా వెళ్లారు. అయితే తాజాగా ఇదే అంశంపై స్పందించిన షర్మిల... నష్టపోయిన రైతులను ఆదుకోవటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్ల కోసం కేసీఆర్ కు రైతు నినాదం కావాలని కానీ...వారి బాధలు మాత్రం పట్టవంటూ ఫైర్ అయ్యారు. 9 ఏళ్ల పాలనలో తొమ్మిది వేల మంది రైతుల ప్రాణాలను బలి తీసుకున్నారని ఆరోపించారు.
"వడ్లు మొలకెత్తి..గుండె భారమై ఓ కౌలు రైతన్న ప్రాణం పోయింది.చనిపోతానని ముందే చెప్పినా..ఆదుకోని అసమర్థ ప్రభుత్వమిది.కండ్లు ఉన్నా చూడలేని సర్కారు ఇది.చెవులు ఉన్నా వినలేని ప్రభుత్వమిది. కేసీఆర్ దొరకు..రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు మాత్రం వద్దు.ఓట్ల కోసం.. రైతు నినాదం కావాలి. కానీ ఆదుకునే విధానం వద్దు. తొమ్మిదేళ్లలో తొమ్మిది వేల మంది రైతులను బలి తీసుకున్న కేసీఆర్.. మరో రైతు ప్రాణం తీసుకోకముందే ఇచ్చిన మాట ప్రకారం ఆఖరి గింజ వరకూ కొను. ఐకేపీ సెంటర్లు అన్ని తెరువు. క్వింటాలుకు 12 కిలోల తరుగు దోపిడీ ఆపు. తడిసిన వడ్లు సైతం కొను" అంటూ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
ఇచ్చిన హామీ ప్రకారం కనీసం రూ.10 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రైతు పండించిన ప్రతి గింజను కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనాల్సిందేనని స్పష్టం చేశారు. తరుగు పేరుతో జరుగుతున్న దోపిడిని కూడా ఆపాలని సవాల్ విసిరారు. 2023లో దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని... అయినా పంట బీమా కూడా లేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ ప్రభుత్వానిది అంటూ దుయ్యబట్టారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా తన ట్విట్ కు జత చేశారు షర్మిల.
సంబంధిత కథనం