September 17th : విలీనం, విమోచనం, విద్రోహం.. సెప్టెంబర్ 17న ఏది జరుపుకోవాలి? దీనిపై భిన్నాభిప్రాయాలు ఎందుకు?-why political parties in telangana have different opinions on september 17 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  September 17th : విలీనం, విమోచనం, విద్రోహం.. సెప్టెంబర్ 17న ఏది జరుపుకోవాలి? దీనిపై భిన్నాభిప్రాయాలు ఎందుకు?

September 17th : విలీనం, విమోచనం, విద్రోహం.. సెప్టెంబర్ 17న ఏది జరుపుకోవాలి? దీనిపై భిన్నాభిప్రాయాలు ఎందుకు?

Basani Shiva Kumar HT Telugu
Sep 15, 2024 06:05 AM IST

September 17th : సెప్టెంబర్ 17.. తెలంగాణ రాజకీయాల్లో ఈ తేదీకి ప్రాముఖ్యత ఎక్కువ. ఉన్న మూడు ప్రధాన పార్టీలు సెప్టెంబర్ 17పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అసలు సెప్టెంబర్ 17పై రాజకీయ పార్టీలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాయి అనే చర్చ జరుగుతోంది.

తెలంగాణలో సెప్టెంబర్ 17
తెలంగాణలో సెప్టెంబర్ 17

సెప్టెంబర్ 17.. 1948.. తెలంగాణ ప్రజల బతుకును మార్చిన తేదీ ఇది. అందుకే సెప్టెంబర్ 17 వచ్చిందంటే.. రాజకీయ పార్టీలు ఎప్పుడూ లేని విధంగా యాక్టివ్ అవుతాయి. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. సెప్టెంబర్ 17పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఒక పార్టీ విలీనం అంటే.. మరో పార్టీ విమోచనం అని.. ఇంకో పార్టీ విద్రోహం అని సెప్టెంబర్ 17వ తేదీకి రాజకీయ రంగు పులుముతున్నాయి. దీంతో అసలు సెప్టెంబర్ 17వ తేదీని ఏమని జరుపుకోవాలనే చర్చ తెరపైకి వస్తోంది.

విలీనం..

ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్‌ను పాలించిన నిజాంకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అభిమానులు ఉన్నారు. వారిని నొప్పించకుండా ఉండేందుకు.. వారి ఓట్ల కోసం.. ఒక రాజకీయ పార్టీ విలీనం అనే స్లోగన్‌ను వాడుతోంది. దీని కారణంగా.. అటు హిందు సమాజం.. ఇటు ముస్లీం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారనేది పొలిటికల్ ప్లాన్. సెప్టెంబర్ 17 1948లో హైదరాబాద్ స్టేట్‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేశారని.. అందుకే ఈ పదాన్ని వాడుతున్నట్టు సదరు పొలిటికల్ పార్టీ నేతలు చెబుతుంటారు.

విమోచనం..

హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో విలీనం కాక ముందు.. ఈ ప్రాంతంలో ఆటవిక పాలన కొనసాగేదనే వాదనలు ఉన్నాయి. నిజాం పాలకులు తమ ప్రైవేట్ సైన్యంతో అమాయక ప్రజలపై దాడులు చేసేవారని.. వారికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయని చరిత్రకారులు చెబుతుంటారు. ముఖ్యంగా రజకార్లు తెలంగాణ ప్రాంతంలోని ప్రజలపై దాడులు చేస్తూ.. వారిని బానిసలుగా చూసేవారని వ్యాఖ్యానిస్తుంటారు. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో కలిసిన రోజును విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని నిజాంకు వ్యతిరేకంగా ఉండే రాజకీయ పార్టీ నాయకులు చెబుతుంటారు.

విద్రోహం..

1948 సెప్టెంబర్‌కు ముందు హైదరాబాద్ స్టేట్‌ను పాలించిన నిజాంకు తెలంగాణ ప్రాంతంలో మద్దతుదారులు ఉన్నారు. వీరు అప్పుడూ.. ఇప్పుడూ ఒకే మాట చెబుతుంటారు. భారత సైన్యం అక్రమంగా నిజాం సంస్థానాన్ని ఆక్రమించిందని.. అందుకే సెప్టెంబర్ 17వ తేదీని విద్రోహ దినంగా జరుపుకోవాలని చెబుతుంటారు. నిజాం పాలకులకు, హైదరాబాద్ స్టేట్ ప్రజలకు ఈ రోజు ద్రోహం జరిగిందని ఆరోపిస్తుంటారు. అందుకే ప్రస్తుత తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తుంటారు.

అయితే.. హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో కలవక ముందు.. ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ముఖ్యంగా హిందు సమాజంలోని ఎక్కువ వర్గాలు నిజాం పాలనను వ్యతిరేకించాయి. ఇండియన్ యూనియన్‌లో కలపాలని డిమాండ్ చేశాయి. అదే సమయంలో.. హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక దేశంగా ఉండాలని ముస్లీం సమాజంలో ఎక్కువ మంది కోరుకునే వారు. అయితే.. నిజాం పాలనకు మద్దతిచ్చే హిందువులు, నిజాం పాలనను వ్యతిరేకించే ముస్లీంలు లేకపోలేదు. కానీ.. ఎక్కువ మంది హిందువులు నిజాంకు వ్యతిరేకంగా.. ఎక్కువ మంది ముస్లీంలు నిజాంకు మద్దతుగా నిలిచారన్నది మాత్రం వాస్తవం.

ప్రస్తుతం తెలంగాణలో ముస్లీం ఓటింగ్ దాదాపు 10 శాతంపైనే ఉంది. దీంతో వారి ఓట్ల కోసం రాజకీయ పార్టీలు నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ వారిని నొప్పించకుండా సెప్టెంబర్ 17న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ.. బీజేపీ మాత్రం మొదట్నుంచి.. నిజాం వ్యతిరేక స్టాండ్ తీసుకొని.. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని.. అందుకు తగ్గటే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజా పాలన పేరుతో కార్యకమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.