Amith Sha in Hyderabad : పటేల్, మున్షీ వల్లే నిజాం పాలన అంతం - విమోచన వేడుకల్లో అమిత్ షా-union home minister amit shah participated in hyderabad liberation day celebrations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Amith Sha In Hyderabad : పటేల్, మున్షీ వల్లే నిజాం పాలన అంతం - విమోచన వేడుకల్లో అమిత్ షా

Amith Sha in Hyderabad : పటేల్, మున్షీ వల్లే నిజాం పాలన అంతం - విమోచన వేడుకల్లో అమిత్ షా

Telangana Liberation Day Celebrations : సర్దార్ పటేల్, కేఎం మున్షీ వల్లే నిజాం పాలన అంతమైందన్నారు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా. హైదరాబాద్ కు ఇవాళ విముక్తి లభించిన రోజు అని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ లో కేంద్రమంత్రి అమిత్ షా

Telangana Liberation Day : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు.ఈ వేడుకల్లో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… హైదరాబాద్ కు ఇవాళ విముక్తి లభించిన రోజు అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. పటేల్, మున్షీ వల్లే నిజాం పాలన అంతమైందన్నారు. తెలంగాణ చరిత్రను 75 ఏళ్ల పాటు వక్రీకరించారని పేర్కొన్నారు. మోదీ ప్రధాని అయ్యాకే ఆ పొరపాటను సరిచేశారని చెప్పారు.

“విముక్తి పోరాటంలో పాల్గొన్న యోధులకు వందనాలు. పటేల్ లేకపోతే తెలంగాణ విముక్తి సాధ్యమయ్యేది కాదు. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు వందనాలు. నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న పోరాట యోధుల పేర్లను ప్రస్తావించారు అమిత్ షా.ఉస్మానియాలో వందేమాతం పేరుతో ఆందోళనలు జరిగాయన్నారు. తెలంగాణ ప్రాంతం రజాకార్ల అరాచకాలకు పరకాల సజీవసాక్ష్యంగా నిలుస్తుందని చెప్పారు. పరకాలలో అనేక మంది అమరులయ్యారని పేర్కొన్నారు. ఈ ప్రాంత విముక్తి కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని… ‘ఆపరేషన్‌ పోలో’ పేరుతో నిజాం మెడలు పటేల్‌ వంచారని గుర్తు చేశారు.

తెలంగాణ విమోచన దినాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు అమిత్ షా. దేశ ప్రజలు వాళ్లను క్షమించరన్న ఆయన… స్వాతంత్య్ర పోరాటాన్ని కూడా కాంగ్రెస్ వక్రీకరించిందని దుయ్యబట్టారు. చంద్రయాన్‌-3 విజయంతో భారత్‌కు అంతర్జాతీయ కీర్తి లభించిందన్నారు. ఈరోజు మోదీ పుట్టినరోజు సేవాదివస్‌గా జరుపుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేదని,,. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌ కోసమే విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.సెప్టెంబర్‌ 17ను అధికారికంగా విమోచన దినోత్సవం జరిపించడానికి కారణాలున్నాయన్న అమిత్ షా… భవిష్యత్‌ తరాలకు నాటి పోరాటయోధులను గుర్తుచేయడం, పోరాట యోధులను సన్మానించడమే అని స్పష్టం చేశారు.

ఈ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా పలువురు స్వాతంత్య్ర పోరాట యోధులను సన్మానించారు అమిత్ షా. పలువురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అమిత్‌షా పంపిణీ చేశారు. పారామిలటరీ బలగాల గౌరవవందనాన్ని అమిత్ షా స్వీకరించారు. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తో పాటు తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులర్పించిన అనంతరం… జాతీయ జెండాను ఎగరవేశారు. అమిత్ షా ప్రసంగం కంటే ముందు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ‍ప్రజలను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం చేస్తోందన్నారు.