Addanki Dayakar: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పదవి దక్కేదెవరికి.. రేసులో అద్దంకి దయాకర్-who will get the post of mlc is an interesting debate in the congress party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Addanki Dayakar: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పదవి దక్కేదెవరికి.. రేసులో అద్దంకి దయాకర్

Addanki Dayakar: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పదవి దక్కేదెవరికి.. రేసులో అద్దంకి దయాకర్

HT Telugu Desk HT Telugu
Jan 05, 2024 11:37 AM IST

Addanki Dayakar: కాంగ్రెస్ నుంచి భర్తీ కానున్న ఎమ్మెల్సీ ఒక్కటే అయినా.. ఆశావహులు మాత్రం పెద్ద సంఖ్యలో ఉండటంతో అది ఎవరికి దక్కుతుందనే చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్సీ టిక్కెట్‌పై కాంగ్రెస్‌లో ఉత్కంఠ
ఎమ్మెల్సీ టిక్కెట్‌పై కాంగ్రెస్‌లో ఉత్కంఠ

Addanki Dayakar: రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీకి ఎన్నికల షెడ్యూలు విడులైంది. ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ జారీ కానుండగా, 29వ తేదీన ఎన్నిక జరగనుంది.

శాసన సభలో ఎమ్మెల్యేల బలాబలాలను పరిగణలోకి తీసుకుంటే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు చెరో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునే వీలుంది. అంటే కాంగ్రెస్ నుంచి భర్తీ కానున్న ఎమ్మెల్సీ ఒక్కటే అయినా.. ఆశావహులు అధిక సంఖ్యలో ఉన్నారు.

శాసన సభ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా ఓటమి పాలైన వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఉన్నారు. వీరిలో ముందు వరసలో ఎమ్మెల్సీ రేసులో అద్దంకి దయాకర్ ఉన్నట్లు చెబుతున్నారు.

గతేడాది ముగిసిన ఎన్నికల్లో ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ ను త్యాగం చేశారు. దీంతో బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరిన మందుల సామేలుకు ఆ ఎన్నికల్లో టికెట్ ఇవ్వగా ఆయన ఘనవిజయం సాధించారు.

ఇపుడు ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అద్దంకి దయాకర్ పేరు రేసులో ముందున్నదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ ఆయన అభ్యర్థిత్వానికి ఏఐసీసీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీ పదవి దక్కినట్టేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పైసా ఖర్చు లేకుండా వచ్చే పదవిపైనే ఆసక్తి

వాస్తవానికి తెలంగాణ శాసన మండలిలో ప్రస్తుతానికి వివిధ కోటాలు కలిపి ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సునాయసంగా కైవసం చేసుకునే వాటిలో ఎమ్మెల్యే కోటా, గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఉన్నాయి.

పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ పదవి దక్కాలంటే మూడు జిల్లాల పరిధిలోని పట్టభద్రుల మనసు చూరగొని ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ కారణంగానే పైసా ఖర్చులేని గవర్నర్ నామినేటెడ్ కానీ, ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నిక ద్వారా కానీ ఎమ్మెల్సీ పదవులు పొందాలని పట్టుదలతో ఉన్నారు.

బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డ్డి డిసెంబరు ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు.

దీంతో ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 29వ తేదీన ఎన్నిక జరగనుండడంతో ఆశావహులు తమ ప్రయత్నాలకు పదును పెట్టారు.

ఒక్క పదవి.. పలువురి పోటి

శాసన సభ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వాస్తవానికి ఎమ్మెల్సీ పదవుల రేసులో వివిధ జిల్లాలకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఉన్నారు.

తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014, 2018, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్ 2023 ఎన్నికల్లోనూ టికెట్ ఆశించారు. కానీ, అధినాయకత్వం నచ్చచెప్పడంతో ఆయన తన టికెట్ ను త్యాగం చేశారు.

ఎమ్మెల్సీ పదవి హామీతోనే టికెట్ రేసు నుంచి పక్కకు తప్పుకున్నట్లు పార్టీ వర్గాల్లో ఓ అభిప్రాయం ఉంది. ఇపుడు ఎన్నికల షెడ్యూలు విడుదల కావండంతో మరో మారు అద్దంకి దయాకర్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

ఉన్నది ఒక్క ఎమ్మెల్సీ పదవే అయినా.. పోటీలో మాత్రం ఎక్కువ మందే ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారిలో షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, సంపత్, మధు యాష్కీ గౌడ్ వంటి నాయకులు వీరిలో ఉన్నారు.

కాంగ్రెస్ నుంచి ఒక్క ముస్లిం మైనారిటీ నాయకుడు కూడా ఎమ్మెల్యేగా లేరు. అదే మాదిరిగా ఎమ్మెల్సీలు కూడా లేరు. మంత్రి వర్గంలోకి ఒక ముస్లిం మైనారిటీ నేతను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలపై కన్నేసిన కాంగ్రెస్ కు ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకం కానున్నాయి.

ఈ అంశాన్ని పరిగణలోకి తీసకుంటే ఈ ముగ్గురిలో ఒకరికి తక్షణం అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. ఈ లెక్కన అద్దంకి దయాకర్ మరికొన్నాళ్ల పాటు ఎదురు చూడాల్సి వస్తుందేమోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

( రిపోర్టింగ్ క్రాంతీపద్మ, నల్గొండ )

Whats_app_banner