Warangal News : 2022 చనిపోయిన వ్యక్తికి ఏడాది క్రితం బైక్ లోన్, వసూలు కోసం ఇంటికెళ్తే బయటపడ్డ మోసం!
Warangal News : వరంగల్ జిల్లాలో రెండేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరిట బుల్లెట్ బైక్ కు లోన్ ఇచ్చారు అధికారులు. బండి కిస్తీలు సరిగ్గా చెల్లించడంలేదని అతని ఇంటికి వస్తే అసలు విషయం తెలిసింది. చనిపోయిన వ్యక్తి పేరిట మరో వ్యక్తి లోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
Warangal News : వరంగల్ జిల్లాలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి పేరు మీద బుల్లెట్ బండి అమ్ముడైంది. సుమారు నాలుగు సంవత్సరాల పాటు ఈఎంఐ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని మరీ ఆయన పేరు మీద రూ.3 లక్షల విలువైన బండి రిలీజ్ చేశారు. చివరకు కిస్తీలు సరిగా కట్టడం లేదంటూ వారి ఇంటికి వెళ్లి చూసిన బ్యాంక్ అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వ్యక్తి చనిపోయి రెండున్నర సంవత్సాలు దాటిందని కుటుంబ సభ్యులు చెప్పడంతో నివ్వెరపోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నందిగామ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నందిగామ గ్రామానికి చెందిన భూక్య సునీత, నగేశ్ దంపతులకు ముగ్గురు కొడుకులు. అందులో పెద్దవాడైన భూక్య రాకేష్ వివిధ సమస్యల కారణంగా 2022 జనవరి 23న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన జరిగిన దాదాపు రెండున్నర సంవత్సరాలకు రాకేష్‌ను వెతుక్కుంటూ కొంతమంది బ్యాంక్ అధికారులు వారి ఇంటికి వచ్చారు. రాకేష్పేరు మీద లోన్ ఉందని, కిస్తీలు సరిగా కట్టడం లేదని దబాయించడంతో ఆయన తల్లిదండ్రులు, స్థానికులంతా షాక్ అయ్యారు. రాకేష్ ఎప్పుడో చనిపోతే, ఆయన బండి తీసుకోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
చనిపోయిన రెండేళ్లకు బండి కొనుగోలు
భూక్య రాకేష్ 2022 జనవరి 23న చనిపోగా, 2023 అక్టోబర్ 18న ఆయన పేరు మీద కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖమ్మం బ్రాంచ్ అధికారులు రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్350 సీసీ ద్విచక్ర వాహనానికి సుమారు రూ.3 లక్షల లోన్ మంజూరు చేశారు. మొత్తంగా 48 నెలల ఈఎంఐ ప్లాన్ కూడా ఇచ్చారు. ఈ మేరకు ప్రతి నెలా రూ.7,150 చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని బండి రిలీజ్ చేశారు. ఆ తరువాత మూడు నెలల పాటు కిస్తీలు కూడా ఖాతాలో జమయ్యాయి. ఆ తరువాత వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకపోవడంతో లోన్ రికవరీ కోసం కలెక్షన్ మేనేజర్ శ్రీనివాస్, వెరిఫికేషన్ ఏజెంట్ అరవింద్ నందిగామకు చేరుకున్నారు. అడ్రస్ వెతుక్కుంటూ రాకేష్ఇంటికి వెళ్లారు. అక్కడ బుల్లెట్ బండి కనపడకపోగా, ఆయన గతంలోనే చనిపోయాడన్న విషయం తెలుసుకుని బ్యాంక్ అధికారులు షాక్ తిన్నారు.
తప్పుడు పత్రాలు సృష్టించి లోన్
రాకేష్ చనిపోయాడని చెప్పినా వినకుండా బ్యాంక్ అధికారులు లోన్ చెల్లించాల్సిందిగా సంబంధిత కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు ఎదురు తిరిగారు. ఎవరికో లోన్ ఇచ్చి, తమను కట్టమంటే ఎలా కడతామని నిలదీశారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు. కాగా మృతి చెందిన రాకేష్ మిత్రుడొకరు నర్సంపేటకు చెందిన వ్యక్తికాగా, ఆయన ద్వారానే ఈ బాగోతం నడిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా నర్సంపేటకు చెందిన వ్యక్తే బండి తీసుకుని, బ్యాంక్ సిబ్బంది, దళారుల సహాయంతో ఈ మోసానికి తెరలేపినట్లు తెలిసింది. రాకేష్ పేరున తప్పుడు పత్రాలు సృష్టించి, బ్యాంకు సిబ్బందిని మేనేజ్ చేసి లోన్ మీద బండి తీసుకుని మోసానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇదే విషయమై సంబంధిత బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించగా, గుట్టుగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)