Warangal Crime : డబుల్ బెడ్ రూం ఇల్లు, ఉద్యోగం ఇప్పిస్తానని మోసం- కుడా మాజీ డైరెక్టర్ పై కేసు నమోదు-warangal case registered on kuda ex chairman cheated on youth with double bed room flat employment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Crime : డబుల్ బెడ్ రూం ఇల్లు, ఉద్యోగం ఇప్పిస్తానని మోసం- కుడా మాజీ డైరెక్టర్ పై కేసు నమోదు

Warangal Crime : డబుల్ బెడ్ రూం ఇల్లు, ఉద్యోగం ఇప్పిస్తానని మోసం- కుడా మాజీ డైరెక్టర్ పై కేసు నమోదు

HT Telugu Desk HT Telugu
Sep 09, 2024 11:05 PM IST

Warangal Crime : వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని కుడా మాజీ డైరెక్టర్ మోడెం ప్రవీణ్ మోసం చేశాడని బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఈ రెండు పనులకు ప్రవీణ్ రూ.5 లక్షలు తీసుకున్నాడని, చివరకు ఏదీ ఇవ్వలేదని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

డబుల్ బెడ్ రూం ఇల్లు, ఉద్యోగం ఇప్పిస్తానని మోసం- కుడా మాజీ డైరెక్టర్ పై కేసు నమోదు
డబుల్ బెడ్ రూం ఇల్లు, ఉద్యోగం ఇప్పిస్తానని మోసం- కుడా మాజీ డైరెక్టర్ పై కేసు నమోదు

Warangal Crime : వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగంతో పాటు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తానని మోసం చేసిన ఘటనలో కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(కుడా) మాజీ డైరెక్టర్, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ప్రధాన అనుచరుడిపై కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. బాధితులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతానికి చెందిన మోడెం ప్రవీణ్ గత ప్రభుత్వ హయాంలో కుడా డైరెక్టర్ గా పని చేశాడు. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు కూడా ప్రధాన అనుచరుడిగా కొనసాగేవాడు. ఇదిలాఉంటే మోడెం ప్రవీణ్ తో వరంగల్ ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన సముద్రాల రాంబాబుకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సముద్రాల రాంబాబుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)లో జవాన్ గా ఉద్యోగం ఇప్పిస్తానని, అంతేగాకుండా బీపీఎల్ కుటుంబాల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇంటిని కూడా ఇప్పిస్తానని మోడెం ప్రవీణ్ నమ్మబలికాడు. ఆ రెండు పనులు చేసేందుకు ప్రవీణ్ రూ.5 లక్షల వరకు డిమాండ్ చేశాడు. దీంతో సముద్రాల రాంబాబు ఇటు ఉద్యోగం, అటు ఇల్లు కూడా వస్తుందని ఆశ పడి మోడెం ప్రవీణ్ అడిగిన రూ.5 లక్షలు ఆయనకు ముట్ట జెప్పాడు.

పైసలు ఇవ్వకపోగా.. బెదిరింపులు

సముద్రాల రాంబాబు నుంచి డబ్బులు తీసుకుని ఏడాది దాటినా ప్రవీణ్ ఇల్లు గానీ, మున్సిపల్ కార్పొరేషన్ లో జవాన్ గా ఉద్యోగం గానీ ఇప్పించలేదు. దీంతో రాంబాబు పలుమార్లు ప్రవీణ్ ను నిలదీశాడు. అయినా ప్రవీణ్ రేపు, మాపు అంటూ కాలయాపన చేయడంతో రాంబాబు తాను మోసపోయినట్లు తెలుసుకున్నాడు. దీంతో గత నెలలోనే పూర్తిగా డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని రాంబాబు కు మాటిచ్చిన ప్రవీణ్ ఆ తరువాత చేతులెత్తేశాడు. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వాల్సిందిగా ఈ నెల 5న బాధితుడు రాంబాబు మరోసారి అడిగాడు.

ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు, ఉద్యోగం ఇప్పించకపోగా, తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వకుండా ప్రవీణ్ తిరిగి రాంబాబుపైనే బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడు రాంబాబు చేసేదేమీ లేక ఆదివారం రాత్రి మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు మోడెం ప్రవీణ్ పై 318(4), 115(2), 296, 351(2) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మిల్స్ కాలనీ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు. కాగా వరంగల్ నగరంలో డబుల్ బెడ్ రూం ఇల్లు, ఉద్యోగాల పేరున మోసాలకు పాల్పడిన ఘటనలు గతంలో కూడా వెలుగులోకి రాగా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగాల పేరున మోసాలకు పాల్పడిన ఘటనలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)