బీఆర్ఎస్ కారు వేగం తగ్గడానికి కారణాలివే
‘తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ రోజురోజుకు ప్రాబల్యాన్ని కోల్పోతూ వస్తుందని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ పతనం ఇప్పటికిప్పుడు మొదలయ్యింది కాదు. ఐదేళ్ల పరిణామాలను శాస్త్రీయంగా, లోతుగా అధ్యయనం చేస్తే స్పష్టత ఏర్పడుతుంది..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చర్ ఐవీ మురళీ కృష్ణ శర్మ రాజకీయ విశ్లేషణ.
నాడి పట్టి చూస్తే కొంతవరకు పరిస్థితిని అంచనా వేయవచ్చు. అదే స్కాన్ చేసి చూస్తే లోటుపాట్లు అన్నీ స్పష్టంగా తెలిసిపోతాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ రోజురోజుకు ప్రాబల్యాన్ని కోల్పోతూ వస్తుందని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ పతనం ఇప్పటికిప్పుడు మొదలయ్యింది కాదు. బీఆర్‌ఎస్ కారుకు బ్రేకులు ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయో తేలాలంటే రాష్ట్రంలో ఐదేళ్ల పరిణామాలను శాస్త్రీయ పద్ధతుల్లో క్షుణ్ణంగా, లోతుగా అధ్యయనం చేస్తే స్పష్టత ఏర్పడుతుంది.
ట్రెండింగ్ వార్తలు
2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ సంక్షేమంలో, అభివృద్ధిలో తనదైన ముద్ర వేయగలిగింది. మిగులు బడ్జెట్ రాష్ట్రం కావడంతో ప్రజాదరణ పొందేలా ఆసరా ఫించన్లు, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మీ-షాదీ ముబారక్, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి ఆకర్షణీయమైన పథకాలు అమలు చేయగలిగారు. వీటికి తోడు మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువుల తవ్వకం, తాగునీటి కోసం చేపట్టిన మిషన్ భగీరథ పథకాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మంచి గుర్తింపు తెచ్చాయి. రైతు రుణమాఫీతో పాటు 2018 ఎన్నికల ముందు రైతుబంధు, రైతు బీమా అనే రెండు బ్రహ్మాస్త్రాల్లాంటి పథకాలు వదలడంతో కొత్త రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది.
అలా మొదలైంది
2018 ఎన్నికల్లో 46.9 శాతం ఓట్లతో 88 సీట్లు గెలిచిన కేసీఆర్ ఇక తనకు ఎదురే లేదనుకున్నారు. నెల రోజుల వరకు మంత్రివర్గాన్ని విస్తరించకుండా తాత్సారం చేశారు. పార్టీలో బలమైన నాయకుడిగా ముద్రపడిన హరీశ్‌రావుకి చాలా రోజుల వరకు మంత్రిపదవి ఇవ్వకుండా ఆలస్యం చేశారు. కేసీఆర్ తన తనయుడు కేటీఆర్‌కి పార్టీ పగ్గాలు అప్పగించే వ్యూహంలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ని చేశారు.
భారీ విజయం తర్వాత కూడా అవసరం లేకున్నా 16 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. నియంతృత్వ పోకడలతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ వారి ఉనికే లేకుండా చేయాలనుకుంటే ప్రజలే ప్రతిపక్షంగా మారుతారనే ప్రజాస్వామ్య సూత్రాన్ని మరిచారు.
2018 ఎన్నికల తర్వాత వచ్చిన ప్రతి ఎన్నికలలో ప్రజలు బీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయాని అన్వేషించడం ప్రారంభించారు. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా క్షేత్రస్థాయిలో ఎవరు బీఆర్‌ఎస్‌ని గట్టిగా ఎదుర్కోగలరో ఆ పార్టీనే గెలిపించారు. ఇలా ప్రజల్లో బీఆర్‌ఎస్‌పై పెరుగుతున్న కోపం క్రమంగా బయటపడటం ప్రారంభమైంది.
2018 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొన్ని రోజుల వ్యవధిలోనే జరిగిన ఆదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్, వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని ప్రజలు గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆరు నెలల వ్యవధిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 41.29 శాతం ఓట్లు తెచ్చుకుని 5.16 శాతం ఓట్లను కోల్పోయింది.
పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీని, నల్లగొండ, భువనగిరి, మల్కాజిగిరి స్థానాల్లో కాంగ్రెస్‌ని గెలిపించారు. ‘కారు`సారు- పదహారు’ నినాదంతో పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగిన బీఆర్‌ఎస్ తొమ్మిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిజామాబాద్ ఎంపీగా కేసీఆర్ కూతురు కవిత ఓడిపోవడంతో ఆరు నెలల్లోనే ఎమ్మెల్సీ పట్టం గట్టి పార్టీలో తమ కుటుంబానికే ప్రాధాన్యత అనే భావనకు కేసీఆర్ మరింత బలం చేకూర్చడంతో అన్ని వైపుల నుండి విమర్శలొచ్చాయి.
గ్రాఫ్ అలా పడిపోతూ వచ్చింది
రాష్ట్రంలో వివిధ కారణాలతో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోతూనే ఉంది. దుబ్బాకలో అధికార పార్టీ ఎమ్మెల్యే చనిపోయినా సానుభూతి పని చేయక ఓడిపోయింది. 2018 ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో పోలిస్తే బీఆర్‌ఎస్ దుబ్బాకలో 16.54 శాతం ఓట్లను కోల్పోయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నగరవాసులు బీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయంగా బీజేపీకి ఊహించని విధంగా సీట్లను కట్టబెట్టారు.
ఆ తర్వాత ఈటెల రాజేందర్‌ని పార్టీ నుంచి బయటకు పంపిన తీరు ప్రజలకు నచ్చలేదు. ఈటెల బీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామ చేసి బీజేపీలో చేరడంతో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 18.96 శాతం ఓట్లను కోల్పోయి ఓటమి మూటగట్టుకుంది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌లో కీలక నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తీన్మార్ మల్లన్న చేతిలో కన్ను లొట్టబోయినట్టు గట్టెక్కారు.
నాగర్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించినా అక్కడ కేవలం 0.72 శాతం ఓట్లను మాత్రమే పెంచుకోగలిగింది. రాజకీయ పార్టీల చదరంగంలో భాగంగా వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాలతో జతకట్టి గెలిచిన బీఆర్‌ఎస్ 12.12 శాతం ఓట్లను పెంచుకుంది. అయితే మునుగోడులో 2014లో సీపీఐకి 12.2 శాతం, సీపీఐ(ఎం)కు 5.36 శాతం ఓట్లు వచ్చాయనే గణాకాంలను పరిశీలిస్తే ఈ ఉప ఎన్నికలలో కమ్యునిస్టులే ముఖ్యపాత్ర పోషించారని చెప్పవచ్చు.
వందకు పెంచుకున్నా
2018లో 88 స్థానాలు గెలిచిన కేసీఆర్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని అసెంబ్లీలో సభ్యుల సంఖ్యను వందకు పెంచుకున్నారు. వంద మంది బలగం ఉన్న బీఆర్‌ఎస్ ఉపఎన్నికలలో ఓడిపోతే వచ్చే ఉపద్రవాలేముండవు. అయినా కేసీఆర్ ఇవేమీ పట్టించుకోలేదు. ఉపఎన్నికలను సజావుగా జరగనిచ్చే ఉంటే అవి ప్రజాభిప్రాయానికి ఒక ప్రయోగమయ్యేవి. పార్టీలో లోటుపాట్లు సమీక్షించుకునే అవకాశమూ దొరికేది.
కానీ కేసీఆర్ అత్యుత్సాహంతో ఊరికో ఎమ్మెల్యేను పంపి ఉప ఎన్నికలను ఒక రాజకీయ క్రీడగా మార్చారు. విచ్చలవిడిగా ప్రలోభాలకు గురి చేసి గెలిచితీరాలనే కసి వాస్తవాలను కప్పేశాయి. 2017లో నంద్యాల ఉపఎన్నికలలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పునే కేసీఆర్ తెలంగాణ ఉపఎన్నికల్లో చేశారు. నంద్యాల ఉప ఎన్నికలలో 27 వేల మెజార్టీతో గెలిచిన టీడీపీ, ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 34 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. ప్రజల మనోభావాలను అధ్యయనం చేయకుండా నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి ఫలితాలిస్తాయో చెప్పడానికి ఇవే ఉదాహరణలు!
హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినా తమ అమ్ములపొదలో ఉన్న దళిత బంధు బ్రహ్మాస్త్రాన్ని కేసీఆర్ వృథా చేశారు. 2018 ఎన్నికలకు ముందు రైతు బంధు ప్రకటించినట్టు 2023 ఎన్నికలకు ముందు దళిత బంధు, బీసీ బంధు ప్రకటించి ఉంటే సామాజిక సమీకరణాలు వేరేలా ఉండేవి. తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నప్పటికీ, దళితబంధు లాంటివి అంతటా అమలుకాకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజలు బీఆర్‌ఎస్ పట్ల ఆగ్రహంగా ఉన్నారు.
నిరుద్యోగుల ఆక్రందన
ప్రధానంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడాన్ని యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉద్యమంలో పుట్టిన ‘కేజీ టు పీజీ’ డిమాండ్ సాకారం కాకపోగా, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన విశ్వవిద్యాలయాలకు నిధులు ఇవ్వకుండా వాటి స్థాయిని దిగజార్చారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోగా టీఎస్‌పీసీ కుంభకోణంతో బీఆర్‌ఎస్ నిరుద్యోగుల ఆక్రోశానికి గురైంది. విద్య మీద కాకుండా కేవలం కుల వృత్తుల మీదే దృష్టి పెట్టడం దళిత-బహుజన కులాల్లో బీఆర్‌ఎస్ పట్ల విముఖత పెంచింది.
ఉద్యమంలో పని చేసిన నాయకులను పక్కనపెట్టడం, ఆయనతో కలిసి పని చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ వంటి వారిని అరెస్టు చేయించడం, పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన గద్దర్‌తో పాటు ఉద్యమంలో చేదోడుగా ఉన్న ఈటెలకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులు హక్కుల కోసం పోరాడితే అణిచివేయడం, మునుగోడులో గెలుపు కోసం కమ్యూనిస్టులను వాడుకొని అవసరం తీరాక పక్కనపెట్టడం వంటివి ఉద్యమనేత కేసీఆర్ ప్రవర్తనలో వచ్చిన మార్పుకు అద్దం పడతాయి.
ఇవన్నీ కేసీఆర్‌పై వ్యతిరేకతకు కారణాలయ్యాయి. ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో కలిసి పనిచేసిన నేతలకు కూడా ఆయన అందుబాటులో లేకపోవడంతో నిరాశకు గురయిన వారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా తమను పట్టించుకుంటారేమోనని ఆశిస్తే అవి కూడా అడియాశలై ఉద్యమకారుల్లో బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత రెట్టింపయ్యింది. ఉద్యమ సమయం నుండి పార్టీలో ఉన్న సీనియర్ నేతలను పక్కనపెట్టి బంగారు తెలంగాణ పేరుతో హడావుడి చేసే బీటీ బ్యాచ్‌కు పార్టీలో ప్రాధాన్యతివ్వడంతో కిందస్థాయి కార్యకర్తలకు పార్టీ అధిష్టానానికి మధ్య భారీ గ్యాప్ ఏర్పడి పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తోంది.
పేగు బంధం తెగిపోయింది
కేసీఆర్‌లో ఉన్న ప్రాంతీయ భావనే తెలంగాణ ఏర్పాటుకు, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావడానికి కారణాలయ్యాయి. అలాంటి ప్రాంతీయ భావాన్ని తన పార్టీ నుంచి తీసేసి జాతీయ భావంతో, దేశాన్ని ఏలుతామనే మితిమీరిన ఆత్మ విశ్వాసంతో ‘టీఆర్‌ఎస్’ను ‘బీఆర్‌ఎస్’గా మార్చడం వల్ల ఆ పార్టీ తెలంగాణ ప్రజలతో ఉన్న పేగు బంధాన్ని తెంపేసుకుంది.
పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ టీఎమ్‌సీ పార్టీని విస్తరించడానికి కృషి చేసినా సొంత రాష్ట్రంలో పట్టు కోల్పోకుండా చూసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దెబ్బతిన్న మమతాబెనర్జీ అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు పీకే బృందంతో కలిసి పనిచేసి గెలుపొందారు. కేసీఆర్ కూడా పీకే బృందంతో మొదట కలిసికట్టుగా పనిచేసినా ఎందుకో మధ్యలోనే విరమించుకున్నారు.
కేసీఆర్ నేల విడిచి సాము చేసినట్టుగా మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతలు, ఉనికి కోసం పాకులాడారు. కాంగ్రెస్‌ని, బీజేపీనీ ‘నాన్ లోకల్ పార్టీల’ని సవాల్ చేసే అవకాశాన్ని బీఆర్‌ఎస్ చేజేతులా చేజార్చుకుంది. ఇది ఆ పార్టీకి ఆత్మహత్య సదృశ్యమేనని ఇటీవలి ఉదంతాలు నిరూపిస్తున్నాయి.
ఆధునిక హంగులతో నూతనంగా నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినా ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడలేదు. ప్రభుత్వం వీటి గురించి ప్రచారం చేసుకోవడంలోనూ విఫలమయ్యింది. మరోవైపు పేర్లు, విగ్రహాలు కాకుండా ప్రభుత్వం హామీ ఇచ్చిన దళితులకు భూపంపిణీ, దళితులందరికీ దళిత బంధు ఏమయ్యాయనే సవాళ్లతో బీఆర్‌ఎస్ ఉక్కిరిబిక్కిరవుతోంది.
బెడిసి కొట్టిన కేసీఆర్ వ్యూహం
ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ను వ్యూహాత్మకంగా పక్కనపెట్టాలని చూసిన కేసీఆర్ బీజేపీయే తమకు ప్రధాన శత్రువని ఉప ఎన్నికల్లో ఆ పార్టీని బలోపేతం చేశారు. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలతో పట్టున్న కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయడం బీఆర్‌ఎస్ దిద్దుకోలేని తప్పు చేసినట్టే. తెలంగాణలో కాంగ్రెస్ ఖాలీ అయ్యిందనే భావనతో ఆ పార్టీని చిన్నచూపు చూస్తే ఆ పార్టీ ఇప్పుడు తిరగబడి గట్టి సవాలు విసురుతోంది. రాష్ట్రంలో బీజేపీ బలపడితే కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి లాభపడవచ్చని కేసీఆర్ భావిస్తే అందుకు భిన్నంగా రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు బలహీనపడుతూ, కాంగ్రెస్ వేగంగా పుంజుకుంటోంది. దీంతో కాంగ్రెస్‌పై కేసీఆర్ వ్యూహం ఘోరంగా బెడిసికొట్టింది.
ఎన్నికలు, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజాకర్షణ పథకాలు ప్రకటించే కేసీఆర్ ప్రభుత్వం తర్వాత వాటిని పట్టించుకోదనే విమర్శలున్నాయి. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోనే అభివృద్ధి చేస్తారని, అక్కడే ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తారనే అభిప్రాయం కలిగించేలా బీఆర్‌ఎస్ వ్యవహరించింది. హామీల అమలు తీరుపై సమీక్షలు చేసుకోకుండానే తాత్కాలికంగా హామీలిచ్చి నవ్వులపాలవడం బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రివాజుగా మారింది. దళితులకు భూ పంపిణీ హామీ పూర్తి స్థాయిలో నెరవేరకముందే, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో దళిత బంధు హామీ ఇచ్చారు. అది అందరికీ అందక ముందే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చారు. ఇలా నోటిమాట హామీలు బీఆర్‌ఎస్‌కు గుదిబండగా మారాయి. అందుకే ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు పోటీగా హామీలిస్తున్నా ప్రజలు వీటిన విశ్వసించకుండా నీటి మీద రాతలుగానే చూస్తున్నారు.
సిట్టింగ్ ప్రయోగం వికటిస్తుందా?
ఎన్నికలను ఎదుర్కోవడంలో తమకు ఎదురులేదని భావించే కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో సిట్టింగ్ కార్పొరేటర్లకే టికెట్లిచ్చి భంగపడ్డారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లపై వ్యతిరేకత ఉన్నా పలు రకాల మేనేజ్‌మెంట్‌తో విజయం సాధించవచ్చనే భావనతో సిట్టింగ్‌లకే తిరిగి టికెట్లిచ్చి బీజేపీ చేతిలో భంగపడ్డారు. జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల్లో గుణపాఠం నేర్వని బీఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ దాదాపు సిట్టింగ్‌లకే టికెట్లిచ్చింది. ఈ ప్రయోగం వికటించే అవకాశాలున్నాయని క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రజలు నిలదీస్తున్న ఘటనలే నిరూపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో అధికారుల బదిలీలు మొదలుకొని అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు ఒంటెత్తు పోకడలతో రారాజులుగా ప్రవర్తించారు. దీంతో ప్రజల్లో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకతకు ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడడవంతో బీఆర్‌ఎస్‌కు రెండింతల నష్టం జరగనుంది.
2019నుండి బీఆర్‌ఎస్‌కు బ్రేకులు పడుతున్నా కేసీఆర్ బృందం వైఫల్యాలపై సింహావలోకనం చేసుకోకుండా, రైతు రుణ మాఫీ, డబుల్ బెడ్రూం వంటి ప్రధానమైన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా వారికే తిరిగి టికెట్లు ఇవ్వడం చూస్తుంటే బీఆర్‌ఎస్ అర్థ, అంగ బలంతో గట్టెక్కవచ్చనే ధీమాతో ఉన్నట్టుంది. ప్రభుత్వంపై, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, మరోవైపు కాంగ్రెస్ దూకుడుతో అన్ని వైపుల నుండి వస్తున్న సవాళ్ల పద్మవ్యూహాన్ని కేసీఆర్ ఛేదిస్తారో లేదా అభిమన్యుడిలా చిక్కుకుంటారో డిసెంబర్ 3న వెలువడే ఫలితాలే తేలుస్తాయి.
- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
రీసెర్చర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ,
Email: peoplespulse.hyd@gmail.com
(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన విశ్లేషణలు, అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం లేదా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థవి. హెచ్‌టీ తెలుగువి కావు)