PM MITRA Parks: తెలంగాణకు గుడ్ న్యూస్.. 'మెగా టెక్స్‌టైల్ పార్క్' ప్రకటించిన కేంద్రం
PM MITRA Park to Telangana: తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.మరో ఆరు రాష్ట్రాల్లో కూడా ఈ పార్కులను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటన చేసింది.
PM MITRA Parks in India: దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ఏడు రాష్ట్రాల్లో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నట్లు తెలిపారు. పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
ఈ టెక్స్‌టైల్ 5ఎఫ్(ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్) విజన్ కి అనుగుణంగా టెక్స్‌టైల్స్ రంగాన్ని ప్రోత్సహిస్తాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ పార్కుల ద్వారా టెక్స్‌టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని చెప్పారు. కోట్లాది పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు దొరుకుతాయని వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా మరియు మేక్ ఫర్ ది వరల్డ్ కు ఇది గొప్ప ఉదాహరణ అవుతుందని ఆకాంక్షించారు.
ఈ మెగా టెక్స్‌టైల్ పార్కులో దారం తయారీ నుంచి బట్టలు నేయడం, రంగులు అద్దడం, డిజైన్లు ముద్రిస్తారు. వస్త్రాల తయారీ వరకు అన్ని రకాల పనులు ఒకే ప్రదేశంలో నిర్వహించేలా ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన భారీ వస్త్ర పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. ఈ మెగా టెక్స్‌టైల్ పార్కుల ఫలితంగా రవాణా ఖర్చులు తగ్గి, భారతీయ టెక్స్‌టైల్ రంగంలో పోటీతత్వం పెరిగే అవకాశం ఉంటుంది. టెక్స్ టైల్స్ పరిశ్రమ కోసం ప్రపంచస్థాయిలో ధీటుగా మారడానికి రూ. 10,683 కోట్ల ఆర్థిక వ్యయంతో పీఎల్ఐని ప్రారంభించింది. ఈ పథకం కింద టెక్స్‌టైల్స్ పరిశ్రమలో ఇప్పటివరకు సుమారు రూ. 1,536 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు జౌళి మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇక వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ను తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఈ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు కేటాయించాలని చాలా సార్లు మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. అయితే కేంద్రం… తాజాగా మెగా టెక్స్ టైల్స్ పార్క్ ప్రకటించిన నేపథ్యంలో… తెలంగాణ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.