Hotels in Hyderabad: హోటల్ నిర్వాహకులకు అలెర్ట్.. అర్ధరాత్రి దాటితే అంతే సంగతులు!
Hotels in Hyderabad: రంగు రంగుల లైట్లతో దర్శనమిచ్చే హోటళ్లకు హైదరాబాద్‌లో కొదవే ఉండదు. ఏ సమయంలో వెళ్లినా తినడానికి ఫుడ్ దొరుకుతుందనే నమ్మకం ఉంటుంది. హోటల్ నిర్వాహకులు కూడా రద్దీకి తగ్గట్టు అర్ధరాత్రి కూడా హోటల్ తెరిచే ఉంచుతారు. అలాంటి వారికి లోకల్ కోర్టు ఝలక్ ఇచ్చింది.
హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల అర్ధరాత్రి వరకు హోటళ్లు తెరిచి ఉంచిన ఇద్దరికీ.. న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. మెహిదీపట్నం ఏరియాలోని ఎల్ఐసీ కాలనీలో మండీటౌన్ హోటల్.. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు తెరిచే ఉంచారు. దీంతో క్యాషియర్ మహ్మద్ ఇర్ఫాన్(19)పై పోలీసులు కేసు నమోదు చేశారు. 4వ ప్రత్యేక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. ఇర్ఫాన్‌కు 14 రోజుల జైలు శిక్ష విధిస్తూ.. న్యాయమూర్తి డీసీ ఉమాపతిరావు తీర్పు ఇచ్చారు.
ఆసిఫ్ నగర్‌లోని సయ్యద్ అలీగూడలో.. ఫ్రెండ్స్ పాస్ట్ ఫుడ్ సెంటర్‌ను అర్ధరాత్రి తర్వాత కూడా తెరిచి ఉంచారు. దీంతో నిర్వాహకుడు మహ్మద్ ముజీబ్ (32)పై పోలీసులు కేసు నమోదు చేసి.. కోర్టులో హాజరుపర్చారు. మహ్మద్ ముజీబు 14 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ రెండు ఘటనలు హోటల్ నిర్వాహకుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అయితే.. చాలామంది హోటల్ నిర్వాహకులు నిబంధనలు తెలియక రాత్రి పొద్దుపోయే వరకూ హోటళ్లు తెరిచే ఉంచుతున్నారు. కేసుల పాలవుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధిక మద్యపానాన్ని అదుపు చేయడానికి పరిమితి విధించారు. అప్పటి నుంచి పోలీసులు అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లేట్ నైట్ వరకు నడుస్తున్న హోటళ్లకు నోటీసులు ఇస్తూ.. కేసులు నమోదు చేస్తున్నారు. అయితే.. గతంలో రెస్టారెంట్లు నడపడానికి ఎక్కువ సమయం ఇస్తానని రేవంత్ హామీ ఇచ్చినట్టు హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.
అటు రాత్రి వేళల్లో స్విగ్గీ, జొమాటో సర్వీసులు బంద్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఈ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా డ్రగ్స్ తెస్తున్న వాళ్లని ఎన్ కౌంటర్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిరోజ్ ఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.