Congress Bheri Meeting : టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరు గ్యారెంటీ పథకాలు ప్రకటించిన సోనియా గాంధీ
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో సహా ఆరు హామీలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించారు.
Congress Bheri Meeting : తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం తుక్కుగూడలో విజయభేరీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం పాల్గొంటుంది. ఈ సభలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఆరు హామీలు ప్రకటించారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు ఆరు హామీలు నెరవేర్చబోతున్నట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్తామన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
తెలంగాణలో అధికారంలోకి వస్తే మహిళలకు మహాలక్షి పథకం కింద నెలకు రూ.2500, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలుచేస్తామన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రైతుకు ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతుకూ ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వెల్లడించారు.
- మహాలక్ష్మి పథకం- మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం, పేద మహిళలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- రైతు భరోసా పథకం - ఏటా రైతుకు రూ.15 వేలు, కౌలు రైతులకు ఇది వర్తిస్తుంది. వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు, వరి పండించే రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్,
- గృహజ్యోతి పథకం- ఈ పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్
- చేయూత పథకం- పేదలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా, నెలకు రూ.4 వేల పెన్షన్
- ఇందిరమ్మ ఇళ్లు - పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం
- యువ వికాసం- విద్యార్థులకు రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం
రైతు భరోసా పథకం
తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే మాట్లాడారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రక రోజు అన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ఆరు హామీలను ప్రకటించిందన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు రూ.15 వేలు పెట్టుబడి సాయం, కౌలు రైతులకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వరికి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ అందిస్తామని మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తామన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఈ పథకాలను అమలు చేశామన్నారు. ఉపాధిహామీ చట్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తుచేశారు.
ఆ మూడు పార్టీలూ ఒక్కటే - రాహుల్ గాంధీ
అనంతరం మాట్లాడిన రాహుల్ గాంధీ... బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంపై విమర్శలు చేశారు. ఈ మూడు పార్టీలు పైకి విడిగా కనిస్తున్నా, అంతా ఒక్కటేనని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీఆర్ఎస్ ఎంత అవినీతి చేసినా ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్‌లో బీజేపీ తెచ్చే అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. దేశంలో ప్రశ్నించిన వారిపైనే మోదీ సర్కార్ కేసులు పెట్టి వేధిస్తుందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలను అధికారంలోకి రాగానే అమలుచేస్తామన్నారు.