TSRTC for Girl Students : విద్యార్థినులకి గుడ్ న్యూస్.. త్వరలో 100 ప్రత్యేక బస్సులు
TSRTC for Girl Students : హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చదివే విద్యార్థినులకి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వారి కోసం ప్రత్యేకంగా 100 బస్సులు నడుపుతామని... ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొంది. విద్యా సంవత్సరం ముగిసే నాటికి 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
TSRTC for Girl Students : హైదరాబాద్ ప్రజా రవాణాలో... సిటీ బస్సులదే కీ రోల్. ఉద్యోగులు కార్యాలయాలకు... విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు.. టీఎస్ఆర్టీసీ నిర్వహణలోని సిటీ బస్సులనే ఆశ్రయిస్తారు. నగరంలో ప్రయాణం చేసేందుకు సాధారణ ప్రజల మొదటి ఛాయిస్ కూడా ఆర్టీసీ సర్వీసులే. మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చినా.. ఇప్పటికీ ప్రతి రోజు లక్షల మంది సిటీ సర్వీసుల్లో ప్రయాణం చేస్తున్నారు.
ఇందుకు అనుగుణంగా... మెట్రో రూట్ లేని మార్గాల్లో సర్వీసులు పెంచిన ఆర్టీసీ అధికారులు... ప్రయాణికులకి సేవలు అందిస్తున్నారు. అయినా... ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సులు నగర ప్రజలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. ముఖ్యంగా.. ఉదయం, సాయంత్రం వేళల్లో కొన్ని రూట్లలో బస్సుల్లో కాలు పెట్టే చోటు కూడా ఉండటం లేదు. దీంతో... విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా.. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినుల బాధలు వర్ణనాతీతం. కొన్ని రూట్లలో విద్యార్థినులు ఫుట్ బోర్డింగ్ చేయాల్సిన దుస్థితి. ప్రమాదకరమని తెలిసినా.. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు ఇలా ప్రయాణం చేస్తున్నారు. ఇబ్బందులని గమనించి.. బస్సుల సంఖ్యని పెంచాలని.. విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో.. సమస్యపై దృష్టి సారించిన టీఎస్ఆర్టీసీ అధికారులు ... విద్యార్థినుల కోసం 100 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
శివారు ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్లే విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని... త్వరలోనే వాటిని అందుబాటులోకి తెస్తామని చెప్పారు... టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. విద్యార్థులను క్షేమంగా విద్యాసంస్థలకు చేర్చేందుకు 100 అదనపు ట్రిప్పులను నడపనున్నట్టు తెలిపారు. ఈ విషయంపై బస్‌భవన్‌లో సమీక్షి నిర్వహించిన ఆయన... శివారు ప్రాంతాలను 12 కారిడార్‌లుగా విభజించి 350 వరకు బస్సులను నడుపుతున్నామని తెలిపారు.
ఇబ్రహీంపట్నం క్లస్టర్‌లో విద్యార్థుల రద్దీ ఎకువగా ఉందని.... ఆ కారిడార్‌లోని కాలేజీలకు 44 వేల మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారని సజ్జనార్ వెల్లడించారు. వారిలో మూడోవంతు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా వారం రోజులుగా ట్రిప్పులను అదనంగా నడుపుతున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో ట్రిప్పుల సంఖ్యను పెంచుతామని... విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతామని పేర్కొన్నారు.
విద్యా సంవత్సరం ముగిసే నాటికి 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. హైదరాబాద్ నగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని... కొత్త బస్సులు కూడా అందుబాటులోకి వస్తే .. నగరవాసులకి మరింత మెరుగైన సేవలు అందుతాయని స్పష్టం చేశారు.