TSRTC Special Service : వేములవాడ టు శంషాబాద్ ఎయిర్‍పోర్టు.. టీఎస్‌ఆర్టీసీ కొత్త సర్వీసు, వివరాలివే
TSRTC Latest News: గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగించే వారి సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వేములవాడ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రతిరోజూ బస్సును నడపనుంది.
TSRTC Special Service : గత కొంతకాలంగా వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. ఓ వైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవటంతో పాటు... ప్రయాణికులను ఆకర్షించేలా మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే చాలా ఆఫర్లను ప్రకటించగా… తాజాగా గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగించే వారి సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేకంగా బస్సు సర్వీసును ప్రారంభించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
వేములవాడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి కొత్త సర్వీసును సెప్టెంబర్ 22 నుంచి TSRTC ఏర్పాటు చేసింది. ఈ డీలక్స్ బస్సు ప్రతి రోజు సాయంత్రం 4:30 గంటలకు వేములవాడ నుంచి బయల్దేరుతుంది. సిరిసిల్ల, సిద్దిపేట, జెబిఎస్ మీదుగా శంషాబాద్ విమానశ్రయానికి రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది. ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి ఉదయం 10 గంటలకు వేములవాడకు వస్తుంది. ఆయా ప్రాంతాల నుంచి దుబాయ్, మస్కట్, తదితర ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని.. ఈ కొత్త సర్వీసును ఆదరించాలని సంస్థ కోరింది.
దసరా ప్రత్యేక బస్సులు…
TSRTC Dasara Special Buses : దసరా పండుగకు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి, 24 దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో.. ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్నీ ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి తెలంగాణ నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ లో ప్రధాన బస్టాండ్ లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్ తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. పండుగ రోజుల్లో ఎంజీబీఎస్-ఉప్పల్, ఎంజీబీఎస్-జేబీఎస్, ఎంజీబీఎస్-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 23 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యూలర్, స్పెషల్ సర్వీసులను ఎంబీజీఎస్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నడపాలని సంస్థ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపునకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయలుదేరుతాయి.
ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి బయలుదేరనున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. వరంగల్, హన్మకొండ, జనగామ, పరకాల, నర్సంపేట, మహబుబాబాద్, తొర్రూరు, యాదగిరిగుట్ట బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్ నుంచి నడుస్తాయన్నారు. విజయవాడ, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం బస్సులు ఎల్బీనగర్ నుంచి బయలుదేరుతాయి. మిగతా సర్వీసులు యథావిధిగా ఎంజీబీఎస్ నుంచే నడుస్తాయి.