TSRTC : అదృష్టవంతులెవరో...? రేపే ఆర్టీసీ రాఖీ పౌర్ణమి 'లక్కీ డ్రా'
TSRTC lucky draw :రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన లక్కీ డ్రాను.. రేపు ప్రకటించనుంది టీఎస్ఆర్టీసీ. ఇందులోని విజేతలకు నగదును అందజేయనున్నారు.
TSRTC lucky Draw 2023: రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన లక్కీ డ్రాను ఈ నెల రేపు (సెప్టెంబర్ 5న టీఎస్ఆర్టీసీ నిర్వహించనుంది. రాష్ట్రంలోని 11 రీజియన్ కేంద్రాల్లో లక్కీ డ్రాను నిర్వహించి.. ప్రతి రీజియన్ కు ముగ్గురి చొప్పున 33 మంది విజేతలను ఎంపికచేయనుంది. ఈ లక్కీ డ్రాకు జిల్లా స్థాయి మహిళా అధికారులను ముఖ్య అతిథులు గా ఆహ్వానించడం జరిగింది.
రాఖీ పౌర్ణమి సందర్భంగా సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించి.. గెలుపొందిన వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకోసం రీజియన్ కు రూ.50 వేల చొప్పన 11 రీజియన్లకు రూ.5.50 లక్షలను కేటాయించింది. ఒక్కో రీజియన్ లో ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు ఇవ్వాలని సంస్థ తాజాగా నిర్ణయించింది.
రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆగస్టు ౩౦, 31 తేదిల్లో సంస్థ ప్రకటించిన లక్కీ డ్రాకు మహిళా ప్రయాణికుల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ల్లో తాము ప్రయాణించిన టికెట్ వెనకాల పేరు, మొబైల్ నంబర్ ను రాసి వేశారు. రేపు నిర్వహించే ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన 33 మందికి హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఈ నెల 8న బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుంది. విజేతలకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించి వారిని ఘనంగా సంస్థ సత్కరించనుంది.
సంబంధిత కథనం