TSRTC: విద్యార్థులకు ఆర్టీసీ షాక్.. బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు
విద్యార్థులకు షాక్ ఇచ్చింది టీఎస్ఆర్టీసీ. డీజిల్ సెస్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో… బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచింది.
ఇంధన ధరల ఎఫెక్ట్, నష్టాలు ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. కొద్దిరోజుల కిందటే డీజిల్ సెస్ పెంచింది. పల్లె వెలుగు బస్సుల్లో 250 కిలోమీటర్ల దూరానికి రూ. 5 నుంచి రూ.45, ఎక్స్‌ప్రెస్‌లో 500 కిలోమీటర్ల దూరానికి రూ.5 నుంచి రూ.90కి, డీలక్స్ బస్సుల్లో 500 కిలోమీటర్లకు రూ. 5 నుంచి రూ.125కి, సూపర్ లగ్జరీలో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ.130కి, ఏసీ సర్వీసుల్లో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ.170 వరకు సెస్ పెంచినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈసారి విద్యార్థుల వంతు వచ్చింది. బస్ పాస్ ఛార్జీలు భారీగా పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడింతలు పెంచుతూ పెద్ద షాకే ఇచ్చింది. ఇప్పటి వరకు రూ.165తో నెల రోజుల పాటు ప్రయాణం చేసినవారు ఇకపై రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.
10 నుంది దరఖాస్తులు....
ఈ విద్యా సంవత్సరం కోసం విద్యార్థులు బస్ పాస్ లు దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్టీసీ పేర్కొంది. ఈ నెల 10 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. 15వ తేదీ నుంచి బస్ పాస్ లు జారీ చేస్తామని వెల్లడించింది. కొత్త ధరల నేపథ్యంలో 3 నెలల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు తీసుకొనే క్వార్టర్లీ పాస్ ధర రూ.490 నుంచి ఇప్పుడు ఏకంగా రూ.1200కు చేరనుంది.
కొత్త ఛార్జీలు ఇలా...
4 కి.మీ. దూరానికి బస్‌పాస్ ఛార్జీ రూ.165 నుంచి రూ.450కు పెంపు
8 కి.మీ దూరానికి బస్‌పాస్ ఛార్జీ రూ.200 నుంచి రూ.600కు పెంపు
12 కి.మీ దూరానికి బస్‌పాస్ ఛార్జీ రూ.245 నుంచి రూ.900కు పెంపు
18 కి.మీ దూరానికి బస్‌పాస్ ఛార్జీ రూ.280 నుంచి రూ.1,150కు పెంపు
ఆర్టీసీ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ స్థాయిలో పెంచటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
టాపిక్