TSRTC Discount : దసరా పండక్కి ఊరెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్… టికెట్లపై రాయితీ
TSRTC Latest News: దసరా పండగ వస్తున్న నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని నిర్ణయించింది.
TSRTC News: దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆయా తేదిల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది.
“బతుక్మమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కొరకు సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలి.” టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జానర్ సూచించారు.
గ్రీన్ మెట్రో బస్సులు ప్రారంభం…
హైదరాబాద్ లో కాలుష్యనివారణకు పర్యావరణహితమైన “ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ” ఏసీ బస్సులను ప్రయాణికులకు TSRTC అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో మొదటి విడతలో 25 బస్సులను సంస్థ వీసీ అండ్ ఎండీ సజ్జనార్ తో కలిసి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు ఈ బస్సుల ప్రత్యేకతలను వారు పరిశీలించారు. ఈ నెల 23 నుంచి ఈ బస్సులు నగర ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నాయి.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం "ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ” ఏసీ బస్సుల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. టీఎస్‌ఆర్టీసీ కష్టాల్లో ఉన్నా ప్రజలకు రవాణా కష్టాలు రాకుండా మెరుగైన, నాణ్యమైన సేవలను అందిస్తూనే ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను మరింతగా పెంచేలా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ప్రైవేట్ కు ధీటుగా టీఎస్‌ఆర్టీసీ పనిచేస్తోందన్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ గారు బాధ్యతలు స్వీకరించాక గత రెండేళ్ల కాలంలోనే ఎన్నో మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు.నగరం నలుదిక్కుల విస్తరించి ఉండటంతో మెట్రోకు అనుసంధానంగా రవాణా సేవలు మెరుగుపడుతున్నాయని, త్వరలోనే ఒక్క కార్డుతో అన్ని రకాల ప్రయాణాలు చేయొచ్చని చెప్పారు.
ప్రపంచమంతా ఎలక్ట్రిక్ యుగం నడుస్తుందని, ఇతర దేశాలతో పోల్చితే మన దేశం లో ఇంకా తక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఉందన్నారు. వచ్చే తరాలకు వాయు కాలుష్యం లేని వాతావరణాన్ని అందించాలంటే ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన అవసరముందన్నారు. టీఎస్‌ఆర్టీసీ పరిరక్షించుకోవడానికి సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం మంచి పరిణామని, ఇది తన హయాంలో జరుగడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జానర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకు మంచి డిమాండ్ ఉందని, ఎయిర్ పోర్ట్ మార్గంలో తిరిగే బస్సుల్లో 80 శాతం ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) ఉందని అన్నారు. ప్రతి రోజు దాదాపు 6 వేల మంది ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఈ స్పూర్తితోనే మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుందని తెలిపారు. హైదరాబాద్ కు తలమానికమైన ఐటీ కారిడార్ లో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 500 బస్సులను నడుపుతుండగా.. రాబోయే నాలుగు నెలల్లో 475 ఎలక్ట్రిక్ బస్సులను ఐటీకారిడార్ లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
మొత్తంగా ఈ ఆర్థిక ఏడాదిలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను వాడకం తేవాలని సంస్థ ప్లాన్ చేసిందని వివరించారు. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించి.. సంస్థను ఆదరించి, ప్రోత్సహించాలని కోరారు. ఈ కొత్త బస్సులను అత్యాధునిక హంగులతో రూపొందించామని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు టీఎస్‌ఆర్టీసీతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని ఒలెక్ట్రా సీఎండీ ప్రదీప్ రావు అన్నారు. ఈ బస్సులను త్వరగా ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు సంస్థ అధికారులు ఎంతోగానో కృషి చేశారని ఆయన చెప్పారు.
సంబంధిత కథనం