TSPSC Group 2 Jobs: గ్రూప్-2కి 5 లక్షలకు పైగా దరఖాస్తులు..ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ!
TSPSC Group 2 Applications: తెలంగాణలో గ్రూప్-2 దరఖాస్తుల గడువు ముగిసింది. మొత్తం 783 పోస్టులకు 5,51,943 దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-2 పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
TSPSC Group 2 Recruitment 2022: తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్ 1,2,3 4 నోటిఫికేషన్లు రాగా... మరోవైపు ఇతర శాఖలోని పోస్టులు కూడా భర్తీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపు అన్నీ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం కాగా... పలు ఉద్యోగాల రాత పరీక్ష తేదీలను ప్రకటించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇదిలా ఉంటే గ్రూప్ 2 ఉద్యోగాలకు ఫిబ్రవరి 16వ తేదీతో గడువు ముగిసింది. మొత్తం 783 పోస్టులకు 5,51,943 దరఖాస్తులు వచ్చాయి. త్వరలోనే పరీక్ష తేదీలను ఖరారు చేయనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. అయితే కొందరి ఫీజు చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తలెత్తటంతో... అప్లికేషన్ల సంఖ్యలో స్వల్ప మార్పులుండే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు.
గ్రూప్-2 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 783 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా వచ్చిన దరఖాస్తులను పోల్చితే... ఒక్కో పోస్టుకు 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు. పరీక్షా తేదీని వచ్చే వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డేట్స్ ప్రకటించే అవకాశం ఉంది.
తాజా గ్రూప్ -2 నోటిఫికేషన్‌లో మహిళలకు అగ్రస్థానం దక్కిందనే చెప్పొచ్చు. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులు భర్తీ చేయనుండగా... వీటిలో 350 పోస్టులు మహిళలకే రిజర్వు అయ్యాయి. జనరల్ కేటగిరీలో 55.31 శాతం చొప్పున 433 పోస్టులున్నాయి. రెండు విభాగాల్లోని పోస్టుల్లో చూస్తే ఒక్కటీ కూడా జనరల్ కేటగిరీలో లేదు. కార్మికశాఖ పరిధిలోని సహాయ కార్మికశాఖ అధికారి పోస్టులు తొమ్మిది ఉంటే...ఇవన్నీ కూడా మహిళలకే కేటాయించారు. ఎన్నికల కమిషన్‌లో రెండు సహాయ సెక్షన్ అధికారి పోస్టులుంటే అవి రోస్టర్ ప్రకారం మహిళల కోటాలోకి వచ్చాయి. సహాయ వాణిజ్య పన్నుల అధికారి పోస్టులు 59 ఉంటే మహిళలకు దాదాపు సగం వారికే రిజర్వయ్యాయి. రెవెన్యూశాఖలో నాయబ్ తహసీల్దారు పోస్టులు 98 ఉంటే ఇందులో 53 మహిళలవే. ఇదే తరహాలో కొన్ని విభాగాల్లో సగానికిపైగా పోస్టులు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. మొత్తంగా ఈ నోటిఫికేన్ లో మహిళలకు 44 శాతానికి పైగా పోస్టులు దక్కినట్లు అయింది. తద్వారా 350 పోస్టులు వారికే దక్కనున్నాయి.
4 పేపర్లు...
గ్రూప్ 2 పరీక్షను మొత్తం 600 మార్కులకు నిర్వహించనున్నారు. ఇందులో 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌లో 150 మల్టిపుల్ ఛాయిల్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పేపర్ పరీక్ష కాల పరిమితి రెండున్నర గంటలు ఉంటుంది. పేపర్-1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, పేపర్-2లో చరిత్ర, పాలిటీ, సొసైటీ, పేపర్-3లో ఎకానమీ, డెవలప్‌మెంట్, పేపర్-4లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుపై ప్రశ్నలుంటాయి. గతంలో మాదిరిగా ఇంటర్వూలు లేవు.
సిలబస్ లో మార్పులు...!
మొత్తం నాలుగు పేపర్లలో పేపర్2లో స్వల్ప మార్పులు ఉన్నాయి. ఇక పేపర్3లో చాలా మార్పులే చేశారు. పేపర్1, 4 లో ఎలాంటి మార్పులు లేవు. పేపర్-2లోని పార్టు-2లో గతంలో ఉన్న ‘భారత రాజ్యాంగం - కొత్త సవాళ్లు’... ‘భారత రాజ్యాంగం - సవరణల విధానం, సవరణ చట్టాలు’గా మారింది. ‘దేశంలో న్యాయవ్యవస్థ’ సబ్జెక్టులో జ్యుడీషియల్ రివ్యూ, సుప్రీంకోర్టు, హైకోర్టు అంశాలు అదనంగా వచ్చాయి. ప్రత్యేక రాజ్యాంగ నియమావళిలో మహిళలు, మైనార్టీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలు... జాతీయ కమిషన్లలో మహిళా, మైనార్టీ, మానవ హక్కులను చేర్చారు. జాతీయ సమైక్యత, సవాళ్లు, అంతర్గత భద్రత, అంతర్రాష్ట్ర సవాళ్లు సబ్జెక్టుగా వచ్చాయి. పేపర్-3లోనూ ఒక్కోపార్టులో పలు అంశాలను సిలబస్‌లోకి చేర్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ను చూడొచ్చు.
సంబంధిత కథనం