Medaram Maha Jatara 2024 Updates: మేడారం.. నట్టడివిలో జరిగే మహాజాతర. వనదేవతలైన సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు కోటిన్నరకుపైగా భక్తులు తరలివచ్చే తెలంగాణ కుంభమేళా. రెండేళ్లకోసారి మాత్రమే మహానగరాన్ని తలపించే మేడారంలో విద్యుత్తు కాంతులే ఎంతో కీలకమైనవి. కొద్దిసేపు అక్కడ కరెంట్ స్తంభించిపోతే అక్కడి వ్యవస్థే అతలాకుతలమవుతుంది. అందుకే తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీఎస్ ఎన్పీడీసీఎల్) ఏర్పాట్లలో నిమగ్నమైంది. మేడారంలో రెప్పపాటు కాలం కూడా కరెంట్ కట్ ఉండకుండా చర్యలు చేపట్టింది. సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, కరెంట్ పోల్స్ ఇలా ప్రతిదీ సమకూర్చుకుని పనులు మొదలుపెట్టింది. ఐదురోజులు 24 గంటల పాటు కరెంట్ సరఫరా చేయడంతో పాటు ఒకవేళ ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే క్షణాల్లో సాల్వ్ చేసేలా కిందిస్థాయి ఏఈ నుంచి సీఎండీ వరకు అందరూ నిరంతర విధుల్లో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది. దాదాపు రూ.16.73 కోట్లతో పనులు ముమ్మరం చేసింది.
మేడారం జాతర నేపథ్యంలో అక్కడి అవసరాల నిమిత్తం ఏర్పాట్లు చేసేందుకు టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థ రూ.16,73,23,660 అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపించింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా సంబంధిత మొత్తాన్ని మంజూరు చేసింది. ఆ నిధులతో అధికారులు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా పస్రా, ములుగు, తాడ్వాయిలోని 133/11 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్లను రెడీ చేశారు. అక్కడి నుంచి మేడారంలో రెండు చోట్లా ఉన్న 33/11 కేవీ సబ్ స్టేషన్లకు సప్లై చేసి, అక్కడి నుంచి జాతర మొత్తం కరెంట్ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు జాతరలో ముఖ్యంగా 315 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్లు నాలుగు, 160 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్లు 84, 100 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్లు 96, 25 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్లు 24 అమర్చారు. మేడారం మొత్తం మీద సమ్మక్క గద్దెల ప్రాంగణం, చుట్టుపక్కల ఆఫీసులు, గెస్ట్ హౌజులు, ఇతర అధికారిక నివాసాలతో పాటు జాతరలో దాదాపు 2 వేలకు పైగా టెంపరరీ దుకాణాలు ఏర్పాటు కానుండగా.. వాటన్నింటికీ కరెంట్ సరఫరా చేసేలా చర్యలు ప్రారంభించారు.
జాతరలో నిరంతర సరఫరాను పర్యవేక్షించేందుకు దాదాపు 500 మంది విద్యుత్తుశాఖ సిబ్బంది విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానం 120 మంది వరకు ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు, 400 మంది వరకు ఆపరేటింగ్ స్టాఫ్, వారిపైనా ఎస్ఈలు, డైరెక్టర్లు, సీజీఎంలు, చీఫ్ ఇంజినీర్లు నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు. ఇప్పటికే మేడారం జాతరలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సంబంధిత సిబ్బందికి కూడా శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు. అంతేగాకుండా సరిపడా లేబర్ ను కూడా అందుబాటులో పెట్టుకుని అవసరమైన పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జాతరలో 24 గంటలపాటు సేవలందించేలా చర్యలు చేపడుతున్నారు. కాగా అక్కడ పని చేసే సిబ్బంది అందరినీ మొత్తంగా 50 మొబైల్ టీములుగా విభజించారు. ఈ మేరకు వారు విద్యుత్తు సంబంధ సమస్యలు ఏం ఎదురైనా తక్షణమే అక్కడికి వెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
జాతరలో చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకునే వ్యాపారులు ముందస్తు పర్మిషన్ లేకుండానే డిస్ట్రిబ్యూటరీ లైన్లకు వైర్లు తగిలించి కరెంట్ ను వాడుకుంటుంటారు. దీంతో ఆ లైన్ ట్రాన్స్ ఫార్మర్లపై లోడ్ అధికంగా పడి తరచూ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతోనే ఇలాంటి సమస్యలను నివారించడానికి ఈసారి మేడారం జాతర సందర్భంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. టీఎస్ ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. ఎక్కడైనా కరెంట్ వైర్లకు తీగలను తగిలిస్తే వెంటనే తెలిసేలా దానిని తీర్చిదిద్దారు. ఇదిలాఉంటే పోల్స్ మధ్య కరెంట్ వైర్లు తెగిపోవడమో.. లేదా ఒకవైరును ఇంకో వైరు తాకి ప్రమాదాలు సంభవించడమో చూస్తుంటాం. కానీ ఈసారి జాతరలో అలాంటి సమస్య రాకుండా ముందస్తుగానే జాతర లైన్లలో దాదాపు 7,500 వరకు సెపరేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక వేళ కరెంట్ వైర్లు తెగినా సెపరేటర్ల వల్ల వైర్లు కిందికి వేలాడకుండా ఉంటాయి. ఒకవేళ అనుకోని ప్రమాదమేదైనా జరిగితే అప్రమత్తంగా ఉండటానికి అగ్నిమాపక శాఖ అధికారులతో కూడా కోఆర్డినేషన్ మీటింగులు కూడా నిర్వహించారు.
ఇప్పటికే మేడారం జాతరకు సంబంధించిన పనులు చివరి దశకు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జాతర ప్రాంగణంలో వర్క్స్ అన్నీ కంప్లీట్ కాగా.. రెండు చోట్లా ఆర్టీసీ బస్టాండ్లకు సంబంధించిన పనులు నడుస్తున్నట్లు తెలిపారు. తాడ్వాయితో పాటు సమ్మక్క గద్దెల సమీపంలో రెండు చోట్లా బస్టాండ్లు ఏర్పాటు చేయగా.. అక్కడ 30 స్తంభాలు ఏర్పాటు చేసి సరఫరా ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. అంతేగాకుండా జాతర సక్సెస్ చేయడానికి ఇదివరకు ఇక్కడ పనిచేసిన సిబ్బంది కీలకం కాగా.. గత జాతర్లలో పని చేసిన సిబ్బందికి ప్రాధాన్యం ఇచ్చి విధులు కేటాయిస్తున్నారు. కాగా జాతరలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు విద్యుత్తుశాఖ అధికారులు చెబుతుండగా.. క్షణకాలం పాటు కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం లేకుండా విద్యుత్తుశాఖ అధికారులు చేపడుతున్న చర్యలు సఫలమవ్వాలని మనమూ కోరుకుందాం.
సంబంధిత కథనం