TS Police recruitment : నేటి నుంచి శారీరక సామర్థ్య పరీక్షలు….-tslprb arrangements for physical fitness exams for those who qualified with court orders in preliminary test ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tslprb Arrangements For Physical Fitness Exams For Those Who Qualified With Court Orders In Preliminary Test

TS Police recruitment : నేటి నుంచి శారీరక సామర్థ్య పరీక్షలు….

HT Telugu Desk HT Telugu
Feb 15, 2023 09:23 AM IST

TS Police recruitment కోర్టు తీర్పుతో పోలీస్ నియామక పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థులకు నేటి నుంచి శారీరక సామర్థ్య పరీక్షల్ని నిర్వహిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా 7 కేంద్రాల్లో కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పరీక్షలు నిర్వహించనుంది. హైకోర్టు ఉత్తర్వులతో 8 మార్కులు అదనంగా కలపడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు అర్హత సాధించారు.

మరో 52వేల మందికి శారీరక సామర్థ్య పరీక్షలు
మరో 52వేల మందికి శారీరక సామర్థ్య పరీక్షలు

TS Police recruitment తెలంగాణ పోలీస్ నియామక పరీక్షల్లో 52వేల మందికి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించేందుకు పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు చేస్తోంది. ప్రాథమిక రాత పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఉత్తర్వులతో పలువురు ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు మళ్లీ కొలువు దక్కించుకునే పోటీలో నిలిచారు.

కోర్టు ఆదేశాలతో ఏకంగా 52 వేల మందికి పైగా అభ్యర్థులు తాజా పరీక్షలకు హాజరు కానున్నారు. కొత్తగా ఎంపికైన అభ్యర్థులంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి మరోసారి సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి వీరికి శారీరక సామర్థ్య పరీక్షలు జరగబోతున్నాయి.

తెలంగాణ పోలీస్ నియామక పరీక్షల్లో భాగంగా గత ఏడాది డిసెంబరు 8 నుంచి 31 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఒక్కో కేంద్రంలో కనిష్ఠంగా 9 రోజులు, గరిష్ఠంగా 24 రోజులపాటు వీటిని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌తో పాటు సిద్దిపేటలో శారీరక సామర్థ్య పరీక్షలు జరిగాయి.

ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన దాదాపు 2.07లక్షల మందికి అప్పట్లో ఈ శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా మరో 52వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విడతలో కొన్ని కేంద్రాల్ని తగ్గించారు. రాచకొండ, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్‌, సిద్దిపేట మినహా మిగిలిన 7 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఏర్పాట్లు పూర్తి చేసింది.

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి గత ఏడాది ఆగస్టులో 16,875 పోస్టుల కోసం నిర్వహించిన ప్రాథమిక రాతపరీక్షలకు సుమారు 8.5 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే 60 మార్కులు రావాలని నిర్ణయించారు. ఈ పరీక్షలో 8 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి.

వాటిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన పోలీస్ నియామక మండలి అందుకు అనుగుణంగానే ఫలితాల్ని విడుదల చేసింది. అప్పట్లో 2.07లక్షల మంది అర్హులుగా తేలడంతో వారికి శారీరక సామర్థ్య పరీక్షల్ని నిర్వహించారు. తుది రాత పరీక్షలకు అభ్యర్ధుల్ని కూడా ఎంపిక చేసింది. మార్చిలో ఆ పరీక్షలను జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రాథమిక రాతపరీక్షలో తప్పులు దొర్లిన ప్రశ్నలను తొలగించకుండా వాటికీ మార్కుల్ని కలపాలనే డిమాండ్‌ మొదలైంది. ఇదే విషయమై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన న్యాయస్థానం మార్కుల్ని కలపాలంటూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 8 మార్కుల్ని అదనంగా కలపడంతో తాజాగా 52 వేల మంది అదనంగా అర్హత సాధించారు. వీరికి మలివిడతలో శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

IPL_Entry_Point