TS TET : ఇకపై ఏడాదిలో 2 సార్లు తెలంగాణ 'టెట్' - విద్యాశాఖ ఉత్తర్వులు, ఎప్పుడెప్పుడంటే..?-ts tet will be conducted twice in a year in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tet : ఇకపై ఏడాదిలో 2 సార్లు తెలంగాణ 'టెట్' - విద్యాశాఖ ఉత్తర్వులు, ఎప్పుడెప్పుడంటే..?

TS TET : ఇకపై ఏడాదిలో 2 సార్లు తెలంగాణ 'టెట్' - విద్యాశాఖ ఉత్తర్వులు, ఎప్పుడెప్పుడంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 07, 2024 05:26 AM IST

Telangana TET Exam : టెట్ పరీక్షలకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఇక నుంచి ప్రతి ఏడాది రెండుసార్లు టెట్ ను నిర్వహించాలని నిర్ణయించింది.

ఇకపై ఏడాదిలో 2 సార్లు 'టెట్
ఇకపై ఏడాదిలో 2 సార్లు 'టెట్

Telangana TET Exam : టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు తెలంగాణ విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ నోటిఫికేషన్ల కోసం ఇక నుంచి ఎదురుచూడకుండా...ఏడాదిలో రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది.

జూన్, డిసెంబర్ మాసంలో.....

ఏడాదిలో 2 సార్లు టెట్ ను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. జూన్ నెలతో పాటు డిసెంబర్ మాసంలో ఈ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. అభ్యర్థులు ఎన్నిసార్లైనా టెట్ రాసుకునే అవకాశం కూడా కల్పించారు. టెట్ మార్కుల ఆధారంగా... డీఎస్సీలో వెయిటేజీని ఇస్తారు.

గతంలో టెట్ పరీక్షను ఏడాదిలో ఒకసారి మాత్రమే నిర్వహించారు. కానీ నేషనల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఫర్‌‌‌‌ టీచర్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ (ఎన్​సీటీఈ) ఏటా రెండుసార్లు టెట్‌‌‌‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కూడా ఆదేశాలను ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా... రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏడాదిలో రెండుసార్లు టెట్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి.

టెట్ పేపర్‌-1 కు డీఈడీ(D.Ed) అర్హతతోపాటు జనరల్‌ అభ్యర్థులు ఇంటర్ 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 2015 లోపు డీఈడీ చేసిన జనరల్ అభ్యర్థులకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు, ఇతరులకు 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి.

టెట్‌ పేపర్‌-2కు డిగ్రీ అర్హతతోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 2015 లోపు బీఈడీ చేసిన జనరల్ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఇతరులకు 40 శాతం మార్కులు పొంది ఉండాలి.

టెట్(పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్‌-1 సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా నియామకానికి, పేపర్‌-2 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. 

పేపర్‌-1కు 1-8 తరగతులు, పేపర్‌-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు. ఇక టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.

TS TET Syllabus - తెలంగాణ టెట్ సిలబస్ వివరాలు….

శిశు అభివృద్ధి, బోధన శాస్త్రం (30 మార్కులు): శిశు అభివృద్ధి నమూనాలు, నేర్చుకునే సామర్థ్యం, బోధన శాస్త్ర అవగాహన

  • తెలుగు (30 మార్కులు) : పఠనావగాహన, తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, పదజాలం, భాషాంశాలు, బోధన పద్ధతులు
  • ఇంగ్లీష్ (30 మార్కులు) : ఆంగ్లభాష విషయాలు, వ్యాకరణం (24 మార్కులు), ఆంగ్ల బోధన శాస్త్రం (6 మార్కులు)
  • గణిత శాస్త్రం (30 మార్కులు) : సంఖ్యామానం, భిన్నాలు, అంకగణితం, రేఖాగణితం, కొలతలు, డేటా అప్లికేషన్స్‌, ఆల్‌జీబ్రా (24 మార్కులు), గణిత బోధన పద్ధతులు (6 మార్కులు)
  • పర్యావరణ అధ్యయనం (30 మార్కులు) : నా కుటుంబం, పని, ఆటలు, మొక్కలు, జంతువులు, మన ఆహారం, వసతి, గాలి, ఇంధనం, నీరు, ఆరోగ్యం, పరిశుభ్రత, భౌగోళిక మ్యాపులు, భారత దేశ చరిత్ర- సంస్కృతి, భారతదేశం- తెలంగాణ సంస్కృతి, పట్టణాలు, జీవన విధానం, సహజవనరులు, నదులు, నాగరికత, భారత రాజ్యాంగం, భద్రత (భూకంపాలు, వరదలు, ఆగ్నిమాపక, ప్రాథమిక చికిత్స, 108, 104 వాహనాలు) (24 మార్కులు), పర్యావరణ బోధన శాస్త్రం (6మార్కులు)

పేపర్‌-2 సిలబస్‌( సైన్స్‌, సోషల్‌)

  • శిశు అభివృద్ధి, బోధన శాస్త్రం(30 మార్కులు): శిశు వికాసం, వ్యక్తిత్వ వికాసం, ప్రవర్తనా సమస్యలు, నేర్చుకునే సామర్థ్యం, మానసిక ఆరోగ్యం బోధన శాస్త్ర అవగాహన తదితర అంశాలు ఉంటాయి.
  • తెలుగు భాష( 30 మార్కులు): పఠనావగాహన(పద్యం, గద్యం), 2015లో రూపొందించిన పాఠ్య పుస్తకాల ఆధారంగా తెలంగాణ సాహిత్యం, సంస్కృతి(ప్రాచీనం, ఆధునికం), పదజాలం, భాషాంశాలు, బోధన పద్ధతులు
  • ఇంగ్లీష్ సబ్జెక్ట్ (30 మార్కులు) : ఆంగ్లంలోని పార్ట్స్‌ ఆఫ్‌ స్వీచ్‌, టెన్సెస్‌, యాక్టివ్‌ వాయిస్‌, పాసివ్‌ వాయిస్‌, డిగ్రీస్‌ ఆఫ్‌ కంపారిజన్‌, వెర్బ్‌లు తదితర మొత్తం 20 రకాల వ్యాకరణాంశాలు. వాటికి 24 మార్కులు. మరో 6 మార్కులు ఆంగ్ల బోధనా పద్ధతులకు ఉంటాయి.
  • గణితం, సైన్స్‌( 60 మార్కులు): గణితానికి 30, సైన్స్‌కు 30 మార్కులుంటాయి. గణితంలో సంఖ్యామానం, అంకగణితం, సెట్స్‌, అల్‌జీబ్రా, రేఖాగణితం(జామెట్రీ), మెన్సురేషన్‌, డేటా హ్యాండ్లింగ్‌, త్రికోణమితి, గణిత బోధన పద్ధతులు.
  • సైన్స్‌లో: ప్రకృతి వనరులు, మన విశ్వం, మెకానిక్స్‌, మేగ్నటిజం అండ్‌ ఎలక్ట్రిసిటీ, మూలకాల వర్గీకరణ, రసాయన బంధం, పదార్థం, అణు నిర్మాణం, జీవశాస్త్రం తదితర అంశాలు.
  • పేపర్‌-2లో సోషల్‌ స్టడీస్‌(60 మార్కులు): భూ వైవిధ్యం, ఉత్పత్తి- వలసలు, జీవనోపాధి, రాజకీయ వ్యవస్థలు, సామాజిక అసమానతలు, మతం- సమాజం, సంస్కృతి-కమ్యూనికేషన్‌ తదితర అంశాలకు 48 మార్కులు ఉంటాయి. మరో 12 మార్కులు బోధన పద్ధతులకు ఉంటాయి.

NOTE: పైన పేర్కొన్న సిలబస్ వివరాలు ఈ ఏడాదిలో  నిర్వహించిన టెట్ పరీక్షకు సంబంధించినవి. కొత్త నోటిఫికేషన్ విడుదలైనప్పుడు అందుకు అనుగుణంగా విద్యాశాఖ సిలబస్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది.

Whats_app_banner