TSPSC Paper Leak: గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ కూడా లీక్ చేశారా…?-ts police suspects that tspsc group 1 preliminary examinations question papers also leacked ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Paper Leak: గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ కూడా లీక్ చేశారా…?

TSPSC Paper Leak: గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ కూడా లీక్ చేశారా…?

HT Telugu Desk HT Telugu
Mar 14, 2023 12:46 PM IST

TSPSC Paper Leak తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకు పేపర్ లీక్‌ వ్యవహారం ఏఈ పరీక్షలకు మాత్రమే పరిమితమని భావించినా, ప్రధాన నిందితుడు ప్రవీణ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షా పత్రాలను కూడా లీక్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు

TSPSC Paper Leak తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో రోజుకో కొత్త సంగతి వెలుగు చూస్తోంది. నిందితులు గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన నిందితుడు ప్రవీణ్ గ్రూప్ 2 ఉద్యోగిగా ఉన్నాడు. కారుణ్య నియామకంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాన్ని పొందిన ప్రవీణ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి వద్ద పిఏగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో నిందితుడు గ్రూప్1 పరీక్షలకు దరఖాస్తు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ప్రాథమిక పరీక్షల్లో 103 మార్కులతో అర్హత సాధించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షా పత్రాలు కూడా లీకై ఉంటాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్రూప్ పరీక్షలపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

మరోవైపు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులను కస్టడీకి తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నారు. నిందితులను కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తే లీకేజీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

జూనియర్ అసిస్టెంట్ నుంచి సెక్షన్ ఆఫీసర్‌గా మారి….

Tspsc నిందితుడు ప్రవీణ్‌ 2017లో టీఎస్‌పీఎస్‌సీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరాడు. నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్‌ విభాగంలో విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో వెరిఫికేషన్‌ విభాగానికి వచ్చే మహిళల చరవాణి నంబర్లను నిందితుడు తీసుకునేవాడు. దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యలను పరిష్కరించి సదరు మహిళలతో సాన్నిహిత్యతం పెంచుకున్నాడు. పలువురు మహిళలలో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రవీణ్‌ సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మహిళల నంబర్లు, వాట్సాప్‌ చాటింగ్‌లోనూ మహిళల నగ్న ఫొటోలు, దృశ్యాలు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే రేణుకతో ఏర్పడిన పరిచయంతో ఏఈ పరీక్ష పత్రాన్ని కూడా లీక్‌ చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడు ప్రవీణ్ తండ్రి మరణించడంతో కారుణ్య నియామకంలో ఉద్యోగం లభించినట్లు గుర్తించారు.

నిందితుడు ప్రవీణ్‌ నుంచి పేపర్‌ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వీరి నుంచి పేపర్లు కొనుగోలు చేసినట్టు సమాచారమున్న మరో నలుగురు అభ్యర్థులనూ విచారిస్తున్నారు. ఈ కేసులో మరికొందరు పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను రంగంలోకి దించారు.

వనపర్తి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిదే కీలక పాత్ర…

సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఆమె అడ్డదారిని ఎంచుకున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడ్డారు. చివరి బండారం బయటపడిపోవడంతో కటకటాల పాలయ్యారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఉపాధ్యాయురాలు రేణుక కూడా ఉన్నారు. నిందితుల నుంచి 4 పెన్‌డ్రైవ్‌లు, 3 ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌, 5 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరానికి చెందిన పులిదిండి ప్రవీణ్‌కుమార్‌బీటెక్‌ పూర్తి చేశాడు. ప్రవీణ్‌ తండ్రి హరిచంద్రరావు ప్రభుత్వ ముద్రణాలయంలో అదనపు ఎస్పీగా పనిచేసేవారు. విధి నిర్వహణలో మరణించటంతో కారుణ్య నియామకం కింద ప్రవీణ్‌ అక్కడే జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరాడు.

ముద్రణాలయం మూసేయడంతో 2017 నుంచి టీఎస్‌పీఎస్సీలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఏఎస్‌వో గా పనిచేస్తున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా పగిడ్యాల్‌ పంచగల్‌ తండాకు చెందిన ఎల్‌.రేణుక గురుకుల ఉపాధ్యాయ పరీక్షకు దరఖాస్తు చేశారు. దరఖాస్తులో తప్పులు దొర్లటంతో సరిచేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ప్రవీణ్‌తో పరిచయమైంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రవీణ్ ఫోన్‌ నంబర్‌ తీసుకొని..రేణుక తరచూ మాట్లాడుతుండేది.

పబ్లిక్ సర్వీస్ కార్యాలయంలోనే కాపీ చేసి పంపిణీ….

ప్రస్తుతం రేణుక వనపర్తి గురుకుల పాఠశాలలో పనిచేస్తోంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సోదరుడు రాజేశ్వర్‌ నాయక్‌ కోసం ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసేందుకు ఆమె సిద్ధమైంది. వికారాబాద్‌ జిల్లా రెవెన్యూ శాఖలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రేణుక భర్త ఢాక్యానాయక్‌ ప్రవీణ్‌తో సంప్రదింపులు జరిపారు. అదే కార్యాలయంలో నెట్‌వర్క్‌ అడ్మిన్‌గా పనిచేస్తున్న ఎ.రాజశేఖర్‌రెడ్డితో కలసి ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌.. కార్యదర్శి డైరీలోని ఐపీ అడ్రస్‌ను దొంగచాటుగా సేకరించాడు. నెట్‌వర్క్‌ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డితో కలసి కార్యాలయ ఇన్‌ఛార్జి కంప్యూటర్‌ నుంచి వివిధ విభాగాల ప్రశ్నపత్రాలున్న ఫోల్డర్‌ను ప్రవీణ్‌ 4 పెన్‌డ్రైవ్‌లలో భద్రపరిచాడు. కార్యాలయంలోనే ప్రశ్నాపత్రాలను పదుల సంఖ్యలో ప్రింట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

దగ్గరుండి పరీక్షలు రాయించాడు….

అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ప్రశ్నపత్రాలను అక్కడే ప్రింట్‌ తీసి వాటిని ఈ నెల 2న రేణుక, ఢాక్యానాయక్‌లకు ఇచ్చి రూ.5 లక్షలు తీసుకున్నాడు. రేణుక, ఢాక్యానాయక్‌, రాజేశ్వర్‌ నాయక్‌లను ప్రవీణ్‌ తన ఇంటికి కూడా తీసుకెళ్లాడు. ముగ్గురు అక్కడే రెండ్రోజుల పాటు ఉన్నారు. ఈ నెల 5న రాజేశ్వర్‌ను పరీక్షా కేంద్రానికి తన వాహనంపైనే ప్రవీణ్‌ తీసుకెళ్లాడు. ఉదయం, సాయంత్రం రెండు పేపర్లు రాయించి తీసుకొచ్చాడు. పరీక్ష పూర్తయ్యాక ఈ నెల 6న రేణుక దంపతులు ప్రవీణ్‌కు మరో రూ.5 లక్షలు నగదు ఇచ్చారు. బేస్‌ పేపర్లు కావటంతో ప్రశ్నలు, సమాధానాలు పక్కనే ఉంటాయని గుర్తించారు. దీన్ని సొమ్ము చేసుకునేందుకు మరికొందరికి విక్రయించినట్లు గుర్తించారు.

Whats_app_banner

సంబంధిత కథనం